
- ప్రభుత్వం పద్ధతి పాటించాల్సిందేనన్న సుప్రీంకోర్టు
- బలవంతంగా తీసుకోవడం రాజ్యాంగ విరుద్ధమని కామెంట్
- ఆస్తి హక్కుకు భంగం కలిగించొద్దని సూచన
న్యూఢిల్లీ: భూసేకరణ విషయంలో ప్రభుత్వాలు విధివిధానాల ప్రకారమే నడుచుకోవాలే తప్ప.. పరిహారం ఇస్తున్నాం కదా అని, తప్పనిసరి సేకరణ పేరుతో ఇష్టారీతిగా వ్యవహరించడం కుదరదని అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. ప్రజాప్రయోజనాల కోసం తప్పనిసరి సేకరణ రూల్ మేరకే భూసేకరణ జరిపినా సరే సరైన ప్రొసీజర్ ను పాటించాలని చెప్పింది. బలవంతంగా భూములు తీసుకొని పరిహారం ఇవ్వడం రాజ్యాంగ వ్యతిరేకమని పేర్కొంది. పౌరులకు రాజ్యాంగం కల్పించిన ఆస్తిహక్కును కాలరాయలేరని తెలిపింది. ఈమేరకు సుప్రీంకోర్టు జడ్జి జస్టిస్ పీఎస్ నరసింహ, జస్టిస్ అరవింద్ కుమార్ ల బెంచ్ వ్యాఖ్యానించింది. కోల్ కతా మునిసిపల్ కార్పొరేషన్ వేసిన పిటిషన్ ను బెంచ్ కొట్టివేసింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 300(ఏ) ప్రకారం ప్రతిఒక్క వ్యక్తికి ఆస్తిహక్కు ఉంటుందని, ఆ హక్కుకు భంగం కలిగించరాదని పేర్కొంది. ప్రైవేటు వ్యక్తుల నుంచి రాష్ట్ర ప్రభుత్వాలు గానీ, స్థానిక ప్రభుత్వాలు గానీ భూములు స్వాధీనం చేసుకోవాలనుకుంటే విధివిధానాలను పాటించాలని సూచించింది.
‘‘ఏ వ్యక్తి నుంచి అయితే భూమిని స్వాధీనం చేసుకోవాలనుకుంటున్నారో ఆ వ్యక్తికి ముందుగా సమాచారం ఇవ్వాలి. భూ సేకరణకు సదరు యజమాని చెబుతున్న కారణాలను వినాలి, అభ్యంతరాలను చట్టబద్ధంగా పరిష్కరించుకోవాలి. ఏ కారణం కోసం భూమిని తీసుకోవాలనుకుంటున్నారో వివరించాలి. భూమిని ప్రజా అవసరాల కోసం తీసుకోవాలనుకుంటే ఆ విషయం గురించి ప్రైవేటు వ్యక్తికి తెలియజేయాలి. భూ సేకరణ ప్రక్రియ పూర్తిచేశాక బాధితులకు పునరావాసం కల్పించడం, పరిహారం ఇవ్వడం చేయాలి. స్వాధీనం చేసుకున్న భూమిని నిర్దేశిత సమయంలోపు వినియోగించాలి” అని బెంచ్ వివరించింది. పై వాటిలో ఏ ఒక్క అంశాన్ని పూర్తిచేయకపోయినా బాధితులు కోర్టుకు వెళ్లొచ్చని తెలిపింది.
ఏంటి కేసు?
కోల్ కతాలోని నార్కేల్ దంగా నార్త్ రోడ్డులో ఒక వ్యక్తికి చెందిన భూమిని పార్కు నిర్మించడానికి కోల్ కతా మునిసిపల్ కార్పొరేషన్ బలవంతంగా స్వాధీనం చేసుకుంది. దీనిపై బాధితుడు హైకోర్టులో కేసు వేశారు. కార్పొరేషన్ కు వ్యతిరేకంగా హైకోర్టు తీర్పు చెప్పింది. ఈ తీర్పును కార్పొరేషన్.. సుప్రీంకోర్టులో సవాల్ చేయగా కార్పొరేషన్ పిటిషన్ ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. హైకోర్టు ఇచ్చిన తీర్పు కరెక్టే అని పేర్కొంది. ఒక వ్యక్తి భూమిని స్వాధీనం చేసుకునే ముందు సరైన ప్రక్రియ చేపట్టాలని రాజ్యాంగం చెబుతోందని సుప్రీంకోర్టు బెంచ్ తెలిపింది. బాధితుడికి పరిహారం ఇచ్చి బలవంతంగా అతని భూమి తీసుకోవడం రాజ్యాంగ విరుద్ధమని స్పష్టం చేసింది.