దేశవ్యాప్తంగా కోట్ల మంది స్ట్రీట్ వెండార్లకు ఆర్థిక భద్రత కల్పించే పథకంగా కేంద్రం తీసుకొచ్చిందే పీఎం స్వనిధి స్కీమ్. కరోనా మహమ్మారి సమయంలో జీవనోపాధి కష్టాల్లో ఉన్న చిన్నచిన్న వ్యాపారులకు ప్రోత్సాహం ఇచ్చేందుకు 2020లో దీనిని మోడీ సర్కార్ ప్రవేశపెట్టింది. 2030 వరకు ఈ స్కీమ్ అందుబాటులో ఉండనుంది. ఈ స్కీమ్ ద్వారా దాదాపు కోటి 10 లక్షల మందికి లబ్ధి చేకూరింది ఇప్పటి వరకు.
కేవలం రుణ సాయం మాత్రమే కాకుండా భవిష్యత్తులో వీధి వ్యాపారులు తమ వ్యాపారానికి తక్షణ సహాయం పొందటానికి క్రెడిట్ కార్డు సదుపాయాన్ని కూడా అందుబాటులోకి తీసుకురాబడింది. స్కీమ్ కింద అర్హులైన చిన్న వ్యాపారులు ఇప్పుడు రూపే క్రెడిట్ కార్డులను రూ.30వేల లిమిట్ తో అందుకుంటున్నారు.
పీఎం స్వనిధి ఎలా పనిచేస్తుంది..?
పీఎం స్వనిధి స్కీమ్ కింద చిన్న వీధి వ్యాపారులకు ప్రారంభ దశలో మెుదటి సారి రూ.10వేలు లోన్ అందిస్తారు. కానీ ఆగస్టులో ప్రకటించిన మార్పుల ప్రకారం.. ఆ మొత్తాన్ని రూ.15వేలకు పెంచారు. రెండవ విడతలో ఇచ్చే రూ.20వేల లోన్ అమౌంట్ రూ.25వేలకు పెంచబడింది. అలాగే మూడో విడతగా ఇచ్చే రూ.50వేల రుణం మాత్రం ఎలాంటి మార్పులు లేకుండా అలాగే కొనసాగించబడుతోంది.
రూపే క్రెడిట్ కార్డు సౌకర్యం..
ప్రస్తుతం నిబంధనల మార్పుతో రుణాన్ని సకాలంలో తిరిగి చెల్లించిన వ్యాపారులకు యూపీఐతో అనుసంధానమైన రూపే క్రెడిట్ కార్డు ఇవ్వాలని కేంద్రం నిర్ణయించి కొత్త సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ కార్డుతో స్ట్రీట్ వెండార్లు అత్యవసర పరిస్థితుల్లో తక్షణ రుణాలు పొందగలరు. రూ.30వేల లిమిట్ కలిగిన కార్డులను రిటైల్ అండ్ హోల్ సేల్ లావాదేవీలకు వినియోగించినప్పుడు రూ.16వందల వరకు క్యాష్ బ్యాక్ ప్రోత్సాహాన్ని కూడా ప్రభుత్వం అందిస్తోంది.
గతంలో ఈ స్కీమ్ నగరాల్లోని లైసెన్స్డ్ వ్యాపారులకు మాత్రమే వర్తించేది. కానీ ఇప్పుడు ప్రభుత్వం దాని పరిధిని సెమీ అర్బన్ ప్రాంతాలకు కూడా విస్తరించింది. ఈ పథకాన్ని గృహనిర్మాణ పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ (MoHUA), ఆర్థిక సేవల విభాగం(DFS) సంయుక్తంగా అమలు చేస్తున్నారు. బ్యాంకులు, ఆర్థిక సంస్థల ద్వారా వ్యాపారులకు రుణాలు పొందటాన్ని సులభతరం చేశాయి.
