ఢిల్లీతోపాటు అనేక నగరాల్లో ఎయిర్ కాలుష్యం పెరిగిపోయింది. మరీ ముఖ్యంగా చలికాలంలో ఎయిర్ క్వాలిటీ తగ్గుతోంది. అలాగని ఎయిర్ ఫిల్టర్లు వాడదామంటే చాలా ఖర్చుతో కూడుకున్నపని. ఆ ఖర్చుని తగ్గించేం దుకే ఆయుష్ తక్కువ ఖర్చుతో గాలిని శుద్ధి చేసే టెక్నాలజీని తీసుకొచ్చాడు. తన స్టార్టప్ క్లయిరో ద్వారా ఏసీల్లో బిగించగలిగే ఎయిర్ ఫిల్టర్లను తయారుచేసి ఎంతోమంది స్వచ్ఛమైన గాలి పీల్చుకునేలా చేశాడు. ఇంతకీ ఆయుష్ ఈ స్టార్టప్ ఎందుకు పెట్టాడు? అసలు ఈ ఆలోచన ఎందుకొచ్చింది?
ఆ యుష్ వాళ్ల నాన్న కౌశల్ ఝా ఒక ప్రభుత్వ ఉద్యోగి. వయసు యాభై ఏండ్లకు పైగానే ఉంటుంది. 2017లో అతన్ని చత్తీస్‌గఢ్‌లోని భిలాయ్ నుంచి ఢిల్లీకి ట్రాన్స్ఫర్ చేశారు. అక్కడికి వెళ్లిన రెండు నెలలకు కౌశల్‌కు ఛాతి నొప్పి వచ్చింది. హాస్పిటల్‌కు తీసుకెళ్తే డాక్టర్లు నాలుగు రోజులు ట్రీట్‌మెంట్ ఇచ్చి డిశ్చార్జ్ చేశారు. అప్పుడు బెంగళూరులో పనిచేస్తున్న ఆయుష్ తండ్రిని చూసేందుకు ఢిల్లీకి వెళ్లాడు. క్రమం తప్పకుండా జాగింగ్, వ్యాయామాలు చేసే వాళ్ల నాన్నకు అలా ఎందుకు జరిగిందని ఆరా తీస్తే.. ఢిల్లీలోని తీవ్రమైన వాయు కాలుష్యమే కారణమని తెలిసింది. కాలుష్యం వల్ల కౌశల్ ఊపిరితిత్తులు దెబ్బతిన్నాయి. డాక్టర్లు ఇంట్లో తప్పనిసరిగా ఎయిర్ ప్యూరిఫైయర్ వాడాలని లేదంటే ఢిల్లీ నుంచి మకాం మార్చాలని సలహా ఇచ్చారు. చేస్తున్న ఉద్యోగం వదిలి ఢిల్లీ నుంచి వెళ్లిపోవడమనేది కుదరని పని.
అందుకే ఫ్యామిలీ కోసం ఒక మంచి ఎయిర్ ప్యూరిఫైయర్ కొనాలని నిర్ణయించుకున్నాడు ఆయుష్. ఘజియాబాద్‌లో వాళ్లు ఉంటున్న త్రీ బీహెచ్‌కే ఫ్లాట్ మొత్తానికి ఒక ఎయిర్ ప్యూరిఫైయర్ వాడితే సరిపోదని అతనికి తెలిసింది. అప్పుడే అతనికి ఎయిర్ ప్యూరిఫైయర్లు ఎలా పనిచేస్తాయి? వాటి వల్ల లాభమేంటి? .. లాంటి విషయాలన్నీ తెలుసుకున్నాడు. దాంతో వాటి మీద కొంత ఇంట్రస్ట్ పెరిగింది. అదే తర్వాత ఎయిర్ ప్యూరిఫైయర్ల స్టార్టప్ పెట్టేందుకు దారితీసింది.
ఖర్చు తగ్గుతుంది
కమర్షియల్ కంపెనీలు క్లీన్ ఎయిర్ టెక్నాలజీల్లో పెట్టుబడి పెట్టేందుకు ముందుకురావడంలేదని ఆయుష్ తెలుసుకున్నాడు. అందుకే ఆ రంగంలో విప్లవాత్మకమైన మార్పులు రావడం లేదు. దానివల్ల ఇప్పుడున్న టెక్నాలజీతో 3 లక్షల చదరపు అడుగుల స్థలంలో గాలిని శుద్ధి చేయడానికి రూ. 2 కోట్ల వరకు ఖర్చవుతుంది. కాబట్టి, అంతకంటే తక్కువ ఖర్చుతో ప్రొడక్ట్‌ని అందుబాటులోకి తీసుకురావాలి అనుకున్నాడు. అప్పటికే ఆయుష్ లా కోర్సు పూర్తి చేశాడు. స్టార్టప్‌ల్లో పనిచేసిన అనుభవం కూడా ఉంది. దాంతో తన ఫ్రెండ్ ఉదయన్ బెనర్జీతో కలిసి క్లయిర్కో(క్లీన్ ఎయిర్ కంపెనీ) పేరుతో ఒక స్టార్టప్ పెట్టి, రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ప్రారంభించాడు. ప్రోటోటైప్, వర్కింగ్ మోడల్‌ను తయారుచేయడానికే అతను అప్పటివరకు దాచుకున్న డబ్బు మొత్తం ఖర్చు అయిపోయింది. ఆ తర్వాత 2019 మేలో ఏంజెల్‌లిస్ట్ ఇన్వెస్టర్లు నుంచి కంపెనీకి రూ. 50 లక్షలు వచ్చాయి. ఆ డబ్బుతో 2020 జనవరి నాటికి ఏసీలకు బిగించగలిగే పూర్తిస్థాయి ఎయిర్ ఫిల్టర్‌ని తయారు చేయగలిగాడు.
ఒకేలా పనిచేస్తాయి
‘‘గాలిని బయటినుంచి గదిలోకి లాగడానికి ఎయిర్ ఫిల్టర్‌లో ఫ్యాన్ ఉంటుంది. కాకపోతే.. దాని వెనక ఉన్న ఫిల్టర్ కాలుష్య కారకాలను గ్రహించి శుభ్రమైన గాలిని మాత్రమే లోపలికి పంపుతుంది. అయితే.. ఎయిర్ కండిషనర్లు కూడా దాదాపు ప్యూరిఫైయర్ల మాదిరిగానే పనిచేస్తాయి. కాబట్టి అదే సూత్రాన్ని వాటికి కూడా వర్తింపజేయాలనే ఆలోచన వచ్చింది. అలా చేస్తే ఏసీలు గదిని చల్లబరుస్తూనే గాలిని శుభ్రం చేయగలుగుతాయి” అంటూ తనకు స్టార్టప్ ఆలోచన ఎలా వచ్చిందో వివరించాడు ఆయుష్.
కొత్త టెక్నాలజీ
ఆయుష్ తయారుచేసిన నానో ఎయిర్ ఫిల్టర్ల ధర మార్కెట్‌లో దొరికే ఇతర ఎయిర్ ప్యూరిఫైయింగ్ సొల్యూషన్ల కంటే చాలా తక్కువ. దీనిద్వారా 3 లక్షల చదరపు అడుగుల ఆఫీస్ స్పేస్‌లో గాలిని శుద్ధి చేయడానికి రూ. 3 లక్షలు మాత్రమే ఖర్చవుతుంది. ఇంట్లో ఉండే ఏసీల్లో ఈ ఫిల్టర్లను అమర్చుకుంటే సరిపోతుంది. ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ (ఏక్యూఐ) పార్టిక్యులేట్ మ్యాటర్ (పీఎం) 10, పీఎం 2.5ని ఇది 90 శాతం వరకు ఫిల్టర్ చేయగలదు. అంతేకాదు.. వీటి పనితీరు, ఫిల్టర్లను ఎప్పుడు మార్చాలో ఖచ్చితంగా గుర్తించేందుకు ఐవోటీ (ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్) వ్యవస్థని డెవలప్ చేశారు. ఇది గాలి నాణ్యతను రియల్‌టైం మానిటరింగ్ చేస్తుంటుంది. ఈ కంపెనీ మరో ప్రత్యేకత ఏంటంటే హామీ ఇచ్చిన ఎయిర్ క్వాలిటీ ఇవ్వలేకపోతే డబ్బు తీసుకోరు.
నెలకు రూ. 30 లక్షలు
కంపెనీ పెట్టినప్పటినుంచి అభివృద్ధి చెందుతూనే ఉంది. “మేము ప్రతి నెలా దాదాపు 30 శాతం వృద్ధిని సాధిస్తున్నాం. ప్రస్తుతం ఢిల్లీ, బెంగళూరుతోపాటు హైదరాబాద్‌లోని మాల్స్, ఆఫీస్‌ల్లో సర్వీసులు అందిస్తూ నెలకు రూ. 30 లక్షలు సంపాదిస్తున్నాం. మా టెక్నాలజీ వల్ల ఇప్పుడు ప్రతిరోజూ 15 లక్షల మంది స్వచ్ఛమైన గాలి పీల్చుకుంటున్నారు. త్వరలో పుణె, చెన్నై, ముంబైలో కూడా సర్వీసులు ఇచ్చేందుకు ప్లాన్ చేస్తున్నాం” అన్నాడు ఆయుష్.
