- ఇండిగో నిర్వహణ లోపమే సంక్షోభానికి కారణం
- దీన్ని తేలిగ్గా తీసుకోబోమని రాజ్యసభలో వెల్లడి
- ప్యాసింజర్లకు ఇప్పటి వరకు రూ.827 కోట్లు రీఫండ్
న్యూఢిల్లీ: ఇండిగో సంక్షోభానికి ఆ సంస్థ నిర్వహణ లోపమే కారణమని సివిల్ ఏవియేషన్ మినిస్టర్ కె.రామ్మోహన్ నాయుడు స్పష్టం చేశారు. దీనిపై ఇప్పటికే దర్యాప్తు జరుగుతున్నదని, ఇండిగోపై కఠిన చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. భవిష్యత్తులో మరే ఎయిర్‌లైన్ సంస్థ ఇలాంటి తప్పులు చేయకుండా తమ చర్యలు ఉంటాయని తెలిపారు.
ఇండిగో సంక్షోభంపై కాంగ్రెస్ ఎంపీ ప్రమోద్ తివారీ సోమవారం రాజ్యసభలో ప్రశ్న లేవనెత్తారు. ఆటోమేటిక్ మెసేజ్ స్విచ్చింగ్ సిస్టమ్ (ఏఎంఎస్‌ఎస్)లో సాంకేతిక లోపంతోనే సంక్షోభం తలెత్తిందా? అని ఆయన ప్రశ్నించారు. దీనికి రామ్మోహన్ నాయుడు సమాధానమిస్తూ.. ఇండిగో సంక్షోభానికి ఏఎంఎస్‌ఎస్ కారణం కాదని స్పష్టం చేశారు. ఆ సంస్థ నిర్వహణ లోపం వల్లనే సంక్షోభం తలెత్తిందని వెల్లడించారు.
కొత్త ఫ్లైట్ డ్యూటీ టైమ్ లిమిటేషన్స్ (ఎఫ్‌డీటీఎల్) రూల్స్‌ను, సిబ్బంది రోస్టర్ విధానాన్ని అమలు చేయడంలో ఇండిగో పూర్తిగా విఫలమైందని తెలిపారు. ‘‘2025 ఏప్రిల్‌లో హైకోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు కొత్త ఎఫ్‌డీటీఎల్ రూల్స్ తెచ్చాం. మొత్తం 22 రూల్స్‌కు గాను జులై 1 నుంచి 15 అమల్లోకి తీసుకొచ్చాం. మిగతావి నవంబర్ 1 నుంచి అమలు చేస్తున్నాం. అప్పటి నుంచి అన్ని ఎయిర్‌లైన్ సంస్థలతో డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నది. కొత్త రూల్స్ అమలుకు ముందు ఇండిగో సహా అన్ని ఎయిర్‌లైన్ సంస్థలతోనూ సమావేశం నిర్వహించాం. అప్పుడు ఇండిగో ఎలాంటి అభ్యంతరాలు లేవనెత్తలేదు.
ఈ నెల 1న కూడా ఇండిగో ప్రతినిధులతో మీటింగ్ నిర్వహించాం. ఆ టైమ్‌లో వాళ్లు లేవనెత్తిన సందేహాలకు సమాధానాలు ఇచ్చాం. కానీ ఆ సమయంలో ఎలాంటి సమస్యలను మా దృష్టికి తేలేదు. ఈ సంక్షోభానికి ఇండిగో నిర్వహణ లోపమే కారణం. దీన్ని మేం తేలిగ్గా తీసుకోవడం లేదు. ఇప్పటికే దర్యాప్తుకు ఆదేశించాం. సంస్థపై కఠిన చర్యలు తీసుకుంటాం. భవిష్యత్తులో మరే ఇతర సంస్థలు ఇలాంటి తప్పులు చేయకుండా ఆ చర్యలు ఉంటాయి” అని వెల్లడించారు. ఏవియేషన్ రంగంలోకి
కొత్త సంస్థలు రావాల్సిన అవసరం ఉందని, అందుకోసం ప్రయత్నాలు చేస్తామని తెలిపారు. కాగా, మినిస్టర్ జవాబుతో ప్రతిపక్ష సభ్యులు సంతృప్తి చెందలేదు. సభ నుంచి వాకౌట్ చేశారు.
సగం బ్యాగులు అప్పగింత..
ప్యాసింజర్లకు ఇప్పటి వరకు రూ.827 కోట్లను ఇండిగో రీఫండ్ చేసిందని సివిల్ ఏవియేషన్ మినిస్ట్రీ వెల్లడించింది. నవంబర్ 21 నుంచి డిసెంబర్ 7 వరకు రద్దయిన ఫ్లైట్లకు సంబంధించి మొత్తం రూ.827 కోట్లను ప్రయాణికులకు చెల్లించిందని తెలిపింది. ఇందులో డిసెంబర్ 1 నుంచి 7 వరకు రద్దయిన ఫ్లైట్లకు సంబంధించిన రీఫండ్ అమౌంటే రూ.569.65 కోట్లు అని చెప్పింది. నవంబర్ 21 నుంచి డిసెంబర్ 7 వరకు రద్దయిన ఫ్లైట్ల టికెట్లు 9,55,591 కాగా, అందులో డిసెంబర్ 1 నుంచి 7 వరకు రద్దయిన ఫ్లైట్ల టికెట్లు 5,86,705 అని పేర్కొంది. ఇక ఇప్పటి వరకు 4,500 లగేజీ బ్యాగులను ప్యాసింజర్లకు ఇండిగో తిరిగి అప్పగించిందని తెలిపింది. మరో 4,500 లగేజీ బ్యాగులను ప్రయాణికులకు అప్పగించాల్సి ఉందని, వాటిని వచ్చే
36 గంటల్లో అందజేస్తుందని వివరించింది.
500కు పైగా విమానాలు రద్దు..
ఇండిగో విమానాల రద్దు ఇంకా కొనసాగుతున్నది. ఆ సంస్థ సోమవారం 500కు పైగా ఫ్లైట్లను రద్దు చేసింది. బెంగళూరులో 150, ఢిల్లీలో 143, హైదరాబాద్‌లో 112, ముంబైలో 98, చెన్నైలో 56 విమానాలను రద్దు చేసింది.

