కబ్జారాయుళ్లపై కాంగ్రెస్​ సర్కారు యాక్షన్​

కబ్జారాయుళ్లపై కాంగ్రెస్​ సర్కారు యాక్షన్​
  • ప్రజావాణి ఫిర్యాదులతో బీఆర్ఎస్​ కార్పొరేటర్లపై కేసులు
  • మొన్న ఖమ్మం, వరంగల్‍.. నేడు కరీంనగర్‍ సిటీలో
  • నాడు ఎమ్మెల్యేల అండతో  చెలరేగిన బీఆర్ఎస్​ నేతలు
  • ప్రభుత్వం మారడంతో పెరుగుతున్న ఫిర్యాదులు
  • కరీంనగర్​లో భూకబ్జా కేసుల విచారణకు సిట్​ ఏర్పాటు
  • బీఆర్ఎస్ కార్పొరేటర్ సహా మరొకరి అరెస్ట్

వరంగల్/కరీంనగర్, వెలుగు : గత సర్కారు హయాంలో ప్రభుత్వ, ప్రైవేటు​భూములను యథేచ్ఛగా కబ్జా పెట్టిన బీఆర్​ ఎస్​ ప్రజాప్రతినిధులు, ఆ పార్టీ నేతలపై కొత్త సర్కారు చర్యలు ప్రారంభించింది. కాంగ్రెస్​అధికారంలోకి రాగానే  భూబాధితులంతా ప్రజావాణికి క్యూ కడ్తున్నారు. ఇలా వస్తున్న ఫిర్యాదులపై అధికారులు రంగంలోకి దిగారు. బీఆర్ఎస్ హయాంలో ఆ పార్టీ లీడర్లు, ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లు, ఇతర ప్రజాప్రతినిధులు హైదరాబాద్​ మొదలుకొని అన్ని జిల్లాల్లో భూఆక్రమణలకు పాల్పడ్డారనే ఆరోపణలున్నాయి. ప్రభుత్వ, ప్రైవేటు భూములన్న తేడా లేకుండా ఖాళీగా కనిపించిన భూములను తప్పుడు డాక్యుమెంట్లతో కబ్జా చేశారని, సెటిల్‍మెంట్‍ పేరుతో  బెదిరించి లాక్కున్నారనే ఆరోపణలు ఉన్నాయి. వీటిపై ప్రజావాణికి, పోలీస్​స్టేషన్లకు గతంలో పెద్ద ఎత్తున ఫిర్యాదులు వెల్లువెత్తినా అధికారులు పట్టించుకోలేదు. 

గత నెలలో సర్కారు మారగానే  ప్రజావాణిలో సామాన్యులు పెట్టుకుంటున్న దరఖాస్తులపై ఆఫీసర్లు దృష్టి పెట్టారు. గత మూడు వారాల్లో ఉమ్మడి ఖమ్మం, వరంగల్‍ జిల్లాల్లో పలువురు బీఆర్‍ఎస్‍ కార్పొరేటర్లు కబ్జా కేసుల్లో అరెస్ట్ అయ్యారు. కరీంనగర్ లో బీఆర్ఎస్ లీడర్ల భూ ఆక్రమణలపై ప్రజావాణికి ఫిర్యాదులు వెల్లువెత్తుతుండటంతో కేసుల దర్యాప్తు కోసం పోలీస్​కమిషనర్​అభిషేక్ మహంతి ప్రత్యేకంగా ఏసీపీ మాధవి నేతృత్వంలో ఎకనామిక్ అఫెన్సెస్ వింగ్ ఏర్పాటు చేశారు. ఈ క్రమంలోనే నగరంలోని భూ వివాదాల్లో తలదూర్చుతున్న ఓ కార్పొరేటర్ తోపాటు, ఓ బీఆర్ఎస్ నేతను, మరో వ్యక్తిని బుధవారం కరీంనగర్ వన్ టౌన్ పోలీసులు అరెస్టు చేశారు. వీరితోపాటు రేకుర్తి, సీతారాంపూర్ ఏరియాల్లో భూకబ్జా ఆరోపణలు ఎదుర్కొంటున్న మరో ఇద్దరు కార్పొరేటర్లను కూడా అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. పోలీసుల చర్యలతో బాధితులు సంతోషం వ్యక్తం చేస్తుండగా.. కబ్జాదారుల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి.  
 
ఖమ్మంలో కార్పొరేటర్​ ఇల్లు నేలమట్టం 

బీఆర్ఎస్‍ కు చెందిన ఖమ్మం కార్పొరేటర్‍ పగడాల శ్రీవిద్య భూకబ్జాలకు పాల్పడినట్టు వచ్చిన ఫిర్యాదులపై పోలీసులు కేసు నమోదు చేశారు. సెక్షన్‍ 420, 467, 468, 471 కింద టూటౌన్‍ పోలీస్‍ స్టేషన్​లో కేసు పెట్టారు. ఖమ్మం ఎన్‍ఎస్పీ క్యాంప్‍ ఏరియాలో సర్వే నంబర్‍ 92లో రూ. కోట్ల విలువైన 415 చదరపు గజాల స్థలాన్ని  కబ్జా చేసిన ఆమె..  59 జీఓ కింద రెగ్యులరైజ్‍ చేసుకున్నారు. దీనిపై ఖమ్మం కలెక్టర్‍ వీపీ గౌతమ్‍ సైతం ఎంక్వైరీకి ఆదేశించారు. ఫేక్‍ డాక్యుమెంట్లతో రెగ్యులరైజ్​ చేసినట్టు తేలడంతో కలెక్టర్ ఆదేశాలతో అధికారులు రిజిస్ట్రేషన్ ​క్యాన్సిల్‍ చేసి.. కేసు నమోదు చేశారు. వరంగల్​ తూర్పు మాజీ ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్‍కు సన్నిహితుడైన రిటైర్డ్​ఎక్సైజ్‍ సీఐ దిడ్డి నరేందర్ పై మిల్స్​కాలనీ పీఎస్​లో భూకబ్జా, బెదిరింపు, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదైంది. నరేందర్‍ 2012లో తన భూమిని సాకరాశికుంటకు చెందిన పులిశేరు సమ్మయ్య అనే వ్యక్తికి  రూ.10 లక్షలకు అమ్మాడు. జాగా స్వాధీనం చేయాలని సమ్మయ్య ఎన్నిసార్లు అడిగినా ఎమ్మెల్యే అండతో పట్టించుకోలేదు. నన్నపునేని ఓడిపోవడంతో సమ్మయ్య తాజాగా ఆఫీసర్లకు ఫిర్యాదు చేశాడు. దీంతో దిడ్డి నరేందర్​పై పోలీసులు వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.  13వ డివిజన్‍ కార్పొరేటర్‍ సురేశ్​ జోషిపైనా భూకబ్జాల ఫిర్యాదులు రాగా కేసు నమోదైంది. గ్రేటర్ ​పరిధిలోని మరో ముగ్గురు, నలుగురు కార్పొరేటర్ల కబ్జాలపైనా పోలీసులు ఎంక్వైరీ చేస్తున్నారని, త్వరలోనే అరెస్ట్​లు ఉండవచ్చని తెలుస్తోంది.
 
మాజీ ఎమ్మెల్యే గండ్రకు నోటీసులు 

భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి చెరువు శిఖం భూమిని ఆక్రమించి, అందులో రూ.10 కోట్ల విలువైన మూడంతస్తుల బిల్డింగ్‍ కడుతున్నట్టు ఫిర్యాదు రావడంతో మున్సిపల్‍ ఆఫీసర్లు  డిసెంబర్‍ 20న నోటీసులు ఇచ్చారు. గొరంట్లకుంట చెరువు శిఖం సర్వే నంబర్‍ 209లో గండ్ర.. కమర్షియల్​ కాంప్లెక్స్​నిర్మాణం చేపట్టారు. అప్పట్లో ఆయన అధికార పార్టీ ఎమ్మెల్యే కావడంతో అధికారులు సైలెంట్​గా ఉన్నారు. ప్రభుత్వం మారడంతో 22.38 గుంటల స్థలంలో నిర్మాణాలు ఆపాలంటూ నోటీసులు ఇచ్చారు. సరైన వివరణ ఇవ్వకుంటే మున్సిపల్‍ యాక్ట్ 2019 సెక్షన్‍178(2), (8), 181 ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించడంతో నిర్మాణాలు నిలిచిపోయాయి. 

త్వరలోనే మరికొందరి అరెస్టు..?

భూకబ్జా కేసుల విచారణకు కరీంనగర్‌‌ సీపీ అభిషేక్‌‌ మహంతి ఏర్పాటు చేసిన సిట్‌‌పనిలో వేగం పెంచింది. బీఆర్ఎస్ సర్కార్ హయాంలో ఆ పార్టీ కార్పొరేటర్లు, ఇతర లీడర్లు చేసిన దందాలపై ప్రత్యేక దృష్టి సారించింది. బాధితుల నుంచి వస్తున్న ఫిర్యాదులపై లోతుగా ఎంక్వైరీ చేసి కబ్జాదారులపై చర్యలు చేపడుతోంది. ఇప్పటికే రేకుర్తి, సీతారాంపూర్ ఏరియాల్లో కట్టిన ఇళ్లను దౌర్జన్యంగా కూల్చిన, భూకబ్జాలకు పాల్పడిన ఓ కార్పొరేటర్ తోపాటు మరో కార్పొరేటర్ భర్తను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. వీరు చేసిన కబ్జాలపై పూర్తి స్థాయిలో విచారణ జరిపి ఒకటి, రెండు రోజుల్లో అరెస్టు చూపనున్నట్లు సమాచారం.  

రిటైర్డ్ ఉద్యోగి రెండేండ్ల వ్యధకు ఉపశమనం.. 


కరీంనగర్ భగత్ నగర్ లో తనకున్న పాత ఇంటిని కూల్చివేసి కొత్త ఇంటి నిర్మించుకునేందుకు టీఎస్ బీపాస్​లో అన్ని పర్మిషన్లు తీసుకున్నప్పటికీ ఇల్లు కట్టుకోనీయకుండా12వ డివిజన్ కార్పొరేటర్ తోట రాములు అండతో చీటి రామారావు అనే వ్యక్తి ఇబ్బందులు పెడుతున్నారంటూ కొత్త రాజిరెడ్డి అనే సింగరేణి రిటైర్డ్ ఉద్యోగి రెండేళ్లుగా కలెక్టర్, మున్సిపల్ కార్పొరేషన్, పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరుగుతున్నారు. ల్యాండ్ అమ్మాలని కొన్నేళ్లుగా స్థానిక కార్పొరేటర్ తనను బెదిరిస్తున్నాడని, మాట వినకపోవడంతో రాష్ట్ర మాజీ మంత్రి కేటీఆర్ సమీప బంధువైన చీటి రామారావుకు 2018లో ఫేక్ డాక్యుమెంట్లతో రిజిస్ట్రేషన్ చేయించి తనపైకి ఉసిగొల్పాడని రెండేళ్లలో జిల్లాలో పని చేసిన కలెక్టర్లకు, వన్ టౌన్ పోలీసులకు అనేకమార్లు ఫిర్యాదు చేశారు. ప్రతి సోమవారం కలెక్టరేట్ లో నిర్వహించే గ్రీవెన్స్ సెల్ లో రాజిరెడ్డి ఫిర్యాదు తప్పనిసరిగా ఉండేది. అయితే అప్పటి బీఆర్ఎస్ సర్కార్ అండతో కబ్జాదారులపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఈ క్రమంలోనే కాంగ్రెస్ సర్కార్ ఏర్పాటయ్యాక ఇటీవల హైదరాబాద్​లో ప్రజాపాలనకు హాజరై సీఎం రేవంతర్ రెడ్డికి కూడా ఫిర్యాదు చేశారు. 

దీంతో అక్కడి నుంచి పోలీసులకు వచ్చిన ఆదేశాలతో సిట్ బృందం విచారణ జరిపి సీపీకి నివేదిక సమర్పించింది. కరీంనగర్ సీపీ అభిషేక్ మహంతిని కూడా కలిసి రాజిరెడ్డి తన గోడు వెళ్లబోసుకున్నాడు. డిసెంబర్ 20న వన్ టౌన్ పోలీస్ స్టేషన్​లో కేసు నమోదు చేసి ఎకనామిక్ అఫెన్సెస్ వింగ్ సాయంతో విచారించగా.. చీటి రామారావు, తోట రాములు ఉద్దేశపూర్వకంగా రాజిరెడ్డి ఇంటి స్థలాన్ని ఆక్రమించుకోవాలనే దురుద్దేశంతో హద్దులు మార్చి తప్పుడు ధ్రువపత్రాలు సృష్టించారని తేలింది. కబ్జాలో ప్రధాని సూత్రధారిగా ఉన్న చీటి రామారావును ఏ1గా, బీఆర్ఎస్ కార్పొరేటర్ తోట రాములును ఏ2గా, వారికి సహకరించిన నిమ్మశెట్టి శ్యాంను ఏ3గా పేర్కొంటూ ఐపీసీ సెక్షన్ 447, 427 r/w 34 కింద కేసు నమోదు చేసినట్లు కరీంనగర్ వన్ టౌన్ సీఐ జె.సరిలాల్ వెల్లడించారు. వీరిని అరెస్టు చేసి కరీంనగర్ సెకండ్ అడిషనల్ ఫస్ట్ క్లాస్ జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ కోర్టులో హాజరుపరచగా, వారికి ఈ నెల 31వరకు రిమాండ్ విధించారు. 


సంతోషంగా ఉంది.. 

నా స్థలంలో నేను ఇల్లు కట్టుకునేందుకు పర్మిషన్ తెచ్చుకుంటే కార్పొరేటర్ తోట రాములు, చీటి రామారావు, నిమ్మశెట్టి శ్యాం కట్టుకోకుండా అనేకసార్లు అడ్డుకున్నారు. న్యాయం చేయాలని నేను, నా భార్య రెండేండ్లుగా ఎక్కని గడపలేదు, కలవని ఆఫీసర్ లేడు. కాం గ్రెస్ గవర్నమెంట్ రాగానే ప్రజాభవన్​కు వెళ్లి ప్రజాపాలనలో నా సమస్యపై ఆధారాలతో ఫిర్యా దు చేసిన. అక్కడి నుంచి ఇంత త్వరగా స్పందన వస్తుందనుకోలేదు. చాలా సంతోషంగా ఉంది. మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా నాకు న్యాయం జరగడంలో సహకరించారు. 

‑ కొత్త రాజిరెడ్డి, సింగరేణి రిటైర్డ్​ ఎంప్లాయ్, కరీంనగర్​