- ములుగు ఎస్పీ రాంనాథ్ కేకన్
- ఇటుక బట్టీ ఓనర్ ఇబ్బంది పెడుతున్నాడని సోషల్ మీడియాలో పోస్టు
- స్పందించి సొంత రాష్ట్రానికి పంపిన ఎస్పీ
ములుగు, వెలుగు: బతుకుదెరువు కోసం వచ్చిన వలస కార్మికులను ఇబ్బంది పెడితే చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని ములుగు ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్ హెచ్చరించారు. తాము ఇంటికి వెళ్లకుండా ఓనర్ ఇబ్బంది పెడుతున్నాడని, తమను ఆదుకోవాలని కార్మికులు సోషల్ మీడియా ద్వారా చేసిన వీడియో వైరల్ కాగా ఎస్పీ స్పందించారు. శుక్రవారం ములుగు మున్సిపాలిటీ పరిధిలోని బండారుపల్లిలోని కేఎంకే బ్రిక్స్ బట్టీ వద్దకు వెళ్లి కార్మికులతో మాట్లాడారు. తమను అక్రమంగా నిర్బంధించి ఇండ్లకు వెళ్లకుండా యజమాని ఇబ్బంది పెడుతున్నాడని తెలిపారు.
ఇటుక బట్టీ యజమానితో మాట్లాడగా, ఎలాంటి ఇబ్బంది పెట్టలేదని సొంత రాష్ట్రానికి వెళ్లేందుకు వాహనం సైతం ఏర్పాటు చేశానని ఎస్పీకి వివరించారు. కార్మికుల పట్ల అమానుషంగా వ్యవహరిస్తే సహించేది లేదన్నారు. బతుకుదెరువు కోసం వచ్చే కార్మికులకు ప్రత్యేక చట్టాలు ఉన్నాయని, వాటిని వినియోగించుకోవాలన్నారు. లేబర్ యాక్ట్ ప్రకారం వారి హక్కులను హరిస్తే చర్యలు తప్పవని తెలిపారు. సొంత రాష్ట్రానికి వెళ్లే కార్మికులకు అండగా ఉంటామని భరోసా కల్పించారు. ఎస్పీ వెంట డీఎస్పీ ఎన్.రవీందర్, ఎస్సై యు.ఉపేందర్ ఉన్నారు.
