- హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మరింత బలోపేతం
- త్వరలో హీల్ ఇన్ ఇండియా, హీల్ బై ఇండియా పోర్టల్స్
- ఆగస్టు 15న ప్రారంభించనున్న ప్రధాని మోడీ
- ఫారినర్లకు ఇండియన్ ట్రీట్మెంట్
న్యూఢిల్లీ: దేశంలో మెడికల్ టూరిజాన్ని మరింత బలోపేతం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ‘హీల్ ఇన్ ఇండియా’, ‘హీల్ బై ఇండియా’ అనే రెండు కొత్త ప్రాజెక్టులను త్వరలో లాంచ్ చేయబోతున్నది. ఆన్లైన్ పోర్టల్ రూపంలో సాగే ఈ సేవల కోసం పలు మంత్రిత్వ శాఖల అధికారులు 36 గంటల పాటు 50 స్టేక్ హోల్డర్స్‌తో చర్చలు జరిపారు. వారి ప్రజెంటేషన్స్ను అర్థం చేసుకున్నారు. పోర్టల్ ద్వారా కలిగే లాభాలతో పాటు ఎదురయ్యే సమస్యలపైనా చర్చించారు. ఈ 2 పెద్ద ప్రాజెక్టులను త్వరగా ప్రారంభించాలనే ఆలోచనలో కేంద్రం ఉంది. వన్ స్టాప్ టెక్ హెవీ పోర్టల్ అయిన ‘హీల్ ఇన్ ఇండియా’ ద్వారా మెడికల్ టూరిజాన్ని విశ్వ వ్యాప్తం చేయాలని నిర్ణయించింది. ఇక్కడ వైద్య రంగంలో సేవలు అందిస్తున్న డాక్టర్లు, ఆరోగ్య కార్యకర్తలు మరింత అభివృద్ధి చెందేందుకు ‘హీల్ బై ఇండియా’ ప్రాజెక్టును తీసుకొస్తున్నది. ఏ దేశానికైనా వెళ్లి వైద్య రంగంలో సేవ చేసే అవకాశం కల్పిస్తున్నది.
హీల్ ఇన్ ఇండియా
ఇండియాలో మెరుగైన వైద్య సేవలు ఎక్కడ అందుతాయి? ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది? వంటి కీలక సమాచారంతో ‘హీల్ ఇన్ ఇండియా’ ఆన్లైన్ పోర్టల్‌ను కేంద్రం ప్రారంభించనుంది. ఫారినర్స్ కోసం తెస్తున్న ఈ పోర్టల్ డ్యాష్ బోర్డులో ట్రీట్మెంట్, ప్యాకేజీ, లోకేషన్స్ కనిపిస్తాయి. అక్కడే వీసా, ట్రావెల్ టికెట్ బుకింగ్ చేసుకునే ఆప్షన్ ఉండనుంది. ఈ పోర్టల్ అందుబాటులోకి వస్తే.. దళారుల అవసరం ఉండదని, ఖర్చు కూడా తగ్గుతుందని అధికారులు చెప్తున్నారు. మెడికల్ టూరిజంలో భాగంగా 17 నగరాల్లో హెల్త్ ఇన్‌ఫ్రాస్ర్టక్చర్‌ను అప్‌గ్రేడ్ చేసేందుకు కృషి చేస్తున్నట్టు వివరించారు.
హీల్ బై ఇండియా
ఇండియన్ హెల్త్‌కేర్ వర్కర్ల కోసం ‘హీల్బై ఇండియా’ అనే సెపరేట్ పోర్టల్‌ను కేంద్రం ప్రారంభించనుంది. విదేశాలకు వెళ్లి వైద్య సేవలు అందించాలనుకునేవాళ్లకు ఈ పోర్టల్ ఉపయోగపడనుంది. ఫారిన్లో అవకాశాల గురించిన పూర్తి ఇక్కడ అందుబాటులో ఉంటుంది. ఆరోగ్య మంత్రిత్వ శాఖ 42 అనుబంధ హెల్త్ కేర్ సర్వీసెస్‌లను గుర్తించింది. పోర్టల్ ద్వారా ఫారిన్లో జాబ్ కోసం దరఖాస్తు చేసుకునే అర్హులను ఇవి గుర్తించి వారికి పూర్తి సమాచారం అందజేస్తుంది. ఇండియాను వరల్డ్స్ బెస్ట్ మెడికల్ టూరిజం హబ్‌గా మార్చేందుకు ప్రయత్నిస్తున్నట్టు అధికారులు వివరించారు. అన్ని అనుకున్నట్టు జరిగి.. ఆగస్టు 15న ప్రధాని నరేంద్ర మోడీ ‘హీల్ ఇన్ ఇండియా’, ‘హీల్ బై ఇండియా’ పోర్టల్స్‌ను ప్రారంభిస్తారని వివరించారు. పోర్టల్స్ ఏర్పాటుపై మూడు రోజుల పాటు సాగిన మీటింగ్‌లో విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ, ఏవియేషన్, ఆయూష్ మంత్రిత్వ శాఖ, టాప్ హాస్పిటల్స్ ప్రతినిధులు, టూరిజం, ఎంబసీ అధికారులు పాల్గొన్నారు.
