గ్యాస్ ఏజెన్సీల వద్ద క్యూ..రూ.500కే గ్యాస్​ పంపిణీపై కొసాగుతున్న కసరత్తు

గ్యాస్ ఏజెన్సీల వద్ద క్యూ..రూ.500కే గ్యాస్​ పంపిణీపై కొసాగుతున్న కసరత్తు
  • అర్హులను గుర్తించడానికే ఈ–కేవైసీ అంటున్న డీలర్లు
  • ఇంకా విడుదల కాని రాష్ట్ర ప్రభుత్వ మార్గదర్శకాలు

హైదరాబాద్,వెలుగు: గ్రేటర్ ​సిటీ పరిధిలో అర్హులైన గ్యాస్​ వినియోగదారులను గుర్తించే ప్రక్రియకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఆయా గ్యాస్ ​కంపెనీలు అర్హులైన వారిని గుర్తించేందుకు ఈ– కేవైసీ నమోదుకు ఆదేశించాయి. దీంతో సిటీలోని వివిధ ఆయిల్​కంపెనీల గ్యాస్​ డీలర్లు వినియోగదారుల నుంచి ఈ– కేవైసీలు తీసుకుంటున్నారు. అయితే, ఇది కేంద్రప్రభుత్వం సబ్సిడీలను అనర్హులకు కాకుండా అర్హులైన వారికి చెందుతుందా? లేదా తెలుసుకునేందుకు కేవైసీ సేకరిస్తున్నట్టు కొందరు డీలర్లు చెబుతున్నారు. ఈ డేటా ఆధారంగానే రాష్ట్ర ప్రభుత్వం కూడా రూ. 500కు గ్యాస్ స్కీమ్ వర్తింజేస్తుందని పేర్కొంటున్నారు.

దీంతో ప్రతిరోజూ కేవైసీ నమోదు చేసుకునేందుకు పెద్ద సంఖ్యలో వినియోగదారులు బారులు తీరుతున్నారు. కేవైసీలో ఆధా ర్అప్​డేట్​ చేసుకోవడంతో పాటు, బయోమెట్రిక్, ఐరిస్​, ప్రస్తుత చిరునామాలను నమోదు చేసుకుంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించినట్టుగా 500కే గ్యాస్​ సరఫరా పథకానికి కూడా అర్హులను ఎంపిక చేయాల్సిందిగా ఆయా కంపెనీలను కోరిన నేపథ్యంలో ప్రస్తుతం భారత్ గ్యాస్, హెచ్​పీ, ఇండేన్​ గ్యాస్​ డీలర్లు కస్టమర్ల నుంచి కేవైసీ సేకరిస్తున్నారు. ఇదిలా ఉండగా కాంగ్రెస్​ ప్రభుత్వం రూ. 500 గ్యాస్ పథకం ఎప్పటి నుంచి అమల్లోకి తెస్తుందని జనం ఆసక్తితో ఎదురు చూస్తున్నారు ఇప్పటి వరకూ ఎలాంటి మార్గదర్శకాలు రాలేదని  డీలర్లు చెబుతున్నారు.