డిప్యూటీ డీఎంహెచ్ఓ ఆఫీసులు ఎత్తేస్తున్రు

డిప్యూటీ డీఎంహెచ్ఓ ఆఫీసులు ఎత్తేస్తున్రు
  • పీపీ యూనిట్, కుష్టు వ్యాధి నియంత్రణ యూనిట్ కూడా.. 
  •  సంగారెడ్డి జిల్లా వైద్య ఆరోగ్యశాఖలో రేషనలైజేషన్

సంగారెడ్డి, వెలుగు : సంగారెడ్డి జిల్లా వైద్య ఆరోగ్యశాఖలో రేషనలైజేషన్ దిశగా అడుగులు ముందుకు పడుతున్నాయి. డిప్యూటీ డీఎంహెచ్ఓ ఆఫీసులతోపాటు పీపీ యూనిట్, కుష్టు వ్యాధి నియంత్రణ యూనిట్ ను కూడా ఎత్తేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ నేపథ్యంలోనే జిల్లాలోని సదాశివపేట, కోహిర్, నారాయణఖేడ్ డిప్యూటీ డీఎంహెచ్ఓ ఆఫీసులను  ఎత్తివేయాలని నిర్ణయించినట్టు మెడికల్, హెల్త్​ సిబ్బంది చెప్తుతున్నారు.  ప్రస్తుతం ఈ  విభాగాల్లో పనిచేస్తున్న వైద్య ఉద్యోగులు, సిబ్బందికి ఖాళీగా ఉన్న చోట, కొత్తగా ఏర్పాటు కానున్న మెడికల్ కాలేజీలు, అనుబంధ ఆస్పత్రుల్లో సర్దుబాటు చేయాలని భావిస్తున్నారు. నిర్వహణ భారాన్ని తగ్గించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. 

ఎక్కడ.. ఎంతమంది ఉద్యోగులు..

జిల్లాలోని మూడు డివిజన్లలోని  డిప్యూటీ డీఎంహెచ్ఓ ఆఫీసుల్లో మొత్తం 21 మంది రెగ్యులర్ ఉద్యోగులు పనిచేస్తున్నారు. డిప్యూటీ డీఎంహెచ్ఓ, డీపీఎంఓ, సీహెచ్ఓ, హెల్త్ ఎడ్యుకేటర్, పీఎంఓఓ, సీనియర్ అసిస్టెంట్, ఎల్ డీ కంప్యూటర్ ఆపరేటర్ పోస్టులు ఉన్నాయి. ఇదిలా ఉంటే వైద్య ఆరోగ్య శాఖ పరిధిలో కొనసాగుతున్న పోస్ట్ పార్టమ్ (పీపీ యూనిట్ల) తోపాటు జిల్లా కేంద్రంలోని కుష్టు వ్యాధి నియంత్రణ విభాగం యూనిట్లు కూడా మూసివేసే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. సంగారెడ్డి ఎంసీహెచ్, జహీరాబాద్, జోగిపేట ఏరియా ఆసుపత్రుల్లో పీపీ యూనిట్లు ఉన్నాయి. ఆయా ఆసుపత్రుల్లో మెడికల్ ఆఫీసర్లతో కలిపి దాదాపు 20 మంది ఏఎన్ఎంలు ఇతర సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారు. 

పీపీ యూనిట్లలో చిన్న పిల్లల వ్యాక్సినేషన్, కుటుంబ నియంత్రణ ఆపరేషన్ల నిర్వహణ కొనసాగుతుంది. కాగా చిన్నపిల్లల వ్యాక్సినేషన్, కుటుంబ నియంత్రణ నిర్వహణ బాధ్యతలను అదే ఆసుపత్రి వైద్య సిబ్బందికి అప్పగించి పీపీ యూనిట్లను ఎత్తివేయనున్నారు.  అయితే పీపీ యూనిట్లలో పనిచేసే వైద్య సిబ్బందిని అవసరమైన పీహెచ్ సీ, యూపీహెచ్ సీ, బస్తి దవాఖానాల్లో సర్దుబాటు చేసే ప్లాన్ చేస్తున్నారు. ఇక సంగారెడ్డిలోని కుష్టు వ్యాధి నియంత్రణ విభాగం యూనిట్ లో మెడికల్ ఆఫీసర్ తోపాటు స్టాఫ్ నర్సులు ముగ్గురు, ఫీజియోథెరపీస్ట్,  ఎఫ్ఎన్ఓ, ఎంఎన్ఓ, ల్యాబ్ టెక్నీషియన్, రెండు రెగ్యులర్ స్వీపర్ పోస్టులు ఉన్నాయి. జిల్లాలో కుష్టు రోగులు పెద్దగా లేకపోవడంతో ఆ శిగానికి పెద్దగా పని లేదు.అయితే ఈ ఆలోచనలను వైద్య ఆరోగ్యశాఖ ఉద్యోగులు, సిబ్బంది వ్యతిరేకిస్తున్నారు.