ప్రభుత్వ భూమి కబ్జా కాకుండా చర్యలు చేపడతాం : కలెక్టర్ గౌతమ్

ప్రభుత్వ భూమి కబ్జా కాకుండా చర్యలు చేపడతాం :  కలెక్టర్ గౌతమ్

శామీర్ పేట, వెలుగు: మేడ్చల్ జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ భూములను కాపాడాల్సిన బాధ్యత అధికారులు, తహసీల్దార్లపై ఉందని కలెక్టర్ గౌతమ్ తెలిపారు. మంగళవారం అంతాయిపల్లిలోని కలెక్టరేట్​లో జిల్లా అడిషనల్ కలెక్టర్ విజయేందర్‌‌ రెడ్డి, రెవెన్యూ అధికారిణి హరిప్రియ, ఆర్డీవోలు, ఆయా మండలాల తహసీల్దార్లతో ఆయన ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా గౌతమ్ మాట్లాడుతూ..  జిల్లాలో ప్రభుత్వ భూములు కబ్జాకు గురికాకుండా అవసరమైన చర్యలు తీసుకోవాలన్నారు.

ప్రస్తుతం ఎక్కడైనా సర్కారు భూములు ఇతరుల స్వాధీనంతో ఉన్నట్లయితే వెంటనే నోటీసులు జారీ చేసి వాటిని ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకోవాలన్నారు. జిల్లాలో ఎక్కడెక్కడ ప్రభుత్వ భూములు ఉన్నాయనే వివరాలను తెలుసుకొని వాటిని ఎవరైనా కబ్జా చేసినట్లయితే వెంటనే పోలీసు బలగాలతో సంబంధిత ప్రదేశంలో ప్రభుత్వ భూమి అని సూచించేలా బోర్డుతో పాటు కంచె ఏర్పాటు చేయాల్సిందిగా తహసీల్దార్లకు సూచించారు. కబ్జాదారులు ఇబ్బందులకు గురి చేస్తే తన దృష్టికి తీసుకురావాలన్నారు.  సమావేశంలో ఆర్డీవోలు రాజేశ్‌ కుమార్‌‌ శ్యామ్‌ ప్రకాశ్‌, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.