ఒమిక్రాన్‌​పై  రాష్ట్రాలు, యూటీలకు కేంద్రం అడ్వైజరీ

ఒమిక్రాన్‌​పై  రాష్ట్రాలు, యూటీలకు కేంద్రం అడ్వైజరీ
  • పండుగ సీజన్‌‌‌‌లో జనం గుమిగూడకుండా చూడండి: కేంద్రం
  • హెల్త్ సిస్టమ్స్‌‌‌‌ సిద్ధంగా ఉన్నాయో లేదో చూసుకోండి
  • ఆక్సిజన్, మందులు రెడీగా ఉంచుకోవాలని సూచన

న్యూఢిల్లీ: కొత్త వేరియంట్ ఒమిక్రాన్ సహా కరోనా కేసులు పెరుగుతుండటంతో కేంద్రం సోమవారం అన్ని రాష్ట్రాలు, యూటీలకు అడ్వైజరీ జారీ చేసింది. లోకల్, జిల్లా అడ్మినిస్ట్రేషన్.. అక్కడి పరిస్థితుల ఆధారంగా కంటెయిన్‌‌‌‌‌‌‌‌మెంట్ చర్యలు తీసుకోవాలని సూచించింది. పండుగ సీజన్‌‌‌‌‌‌‌‌లో జనం గుమిగూడకుండా చూసేందుకు స్థానికంగా అవసరమైతే ఆంక్షలు విధించాలని చెప్పింది. “నిర్లక్ష్యం వద్దు.. కేసులు పెరగకుండా అడ్డుకునేందుకు టెస్ట్, ట్రాక్, ట్రీట్, వ్యాక్సినేషన్, కరోనా రూల్స్ పాటించడం కొనసాగించాలి. కొత్త వేరియంట్ నేపథ్యంలో మరింతగా ఫోకస్ పెట్టాలి” అని అడ్వైజరీలో కేంద్ర హోంశాఖ సెక్రటరీ అజయ్ భల్లా సూచించారు. ఈ నెల 21న కేంద్ర ఆరోగ్య శాఖ జారీ చేసిన గైడ్‌‌‌‌‌‌‌‌లైన్స్‌‌‌‌‌‌‌‌ను ఫాలో కావాలని స్పష్టంచేశారు. 

కొత్త వేరియంట్ సవాళ్లు విసురుతోంది..

‘‘దేశంలో యాక్టివ్ కేసులు భారీగా తగ్గిపోయాయి. కానీ కొత్త వేరియంట్ ఒమిక్రాన్.. డెల్టా కంటే మూడు రెట్లు వేగంగా వ్యాప్తి చెందుతుంది. దేశంలో కంటెయిన్‌‌‌‌‌‌‌‌మెంట్ చర్యలకు సవాళ్లు విసురుతోంది” అని అజయ్ భల్లా పేర్కొన్నారు. దేశంలో 19 రాష్ట్రాలు, యూటీల్లో ఇప్పటిదాకా 578 ఒమిక్రాన్ కేసులు నమోదైనట్లు చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా 116 దేశాలకు ఈ కొత్త వేరియంట్ పాకిందని తెలిపారు. ఒమిక్రాన్ వ్యాప్తి మొదలయ్యాక అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్, ఇటలీ, స్పెయిన్, రష్యా, సౌత్​ ఆఫ్రికా, వియత్నాం, ఆస్ట్రేలియా తదితర దేశాల్లో కేసులు భారీగా పెరిగినట్లు వెల్లడించారు.

ప్రజలకు సమాచారమివ్వండి
కొత్త వేరియంట్ నుంచి వచ్చే సవాళ్లను ఎదుర్కొనేందుకు హెల్త్ సిస్టమ్స్‌‌‌‌‌‌‌‌ బలోపేతం అయ్యాయా లేదా అనేది రాష్ట్రాలు నిర్ధారించుకోవాలని అజయ్ భల్లా సూచించారు. ఆక్సిజన్ సరఫరా ఎక్విప్‌‌‌‌‌‌‌‌మెంట్స్‌‌‌‌‌‌‌‌ ఏర్పాటు చేసుకోవాలని, పూర్తిగా అందుబాటులోకి తీసుకురావాలని, ఎమర్జెన్సీ మందుల బఫర్ స్టాక్‌‌‌‌‌‌‌‌ ఉంచుకోవాలని స్పష్టం చేశారు. కొత్త వేరియంట్ వ్యాప్తి కారణంగా జనంలోకి తప్పుడు సమాచారం వెళ్లే ప్రమాదం ఉందని, ఇది ఆందోళనకు దారి తీస్తుందని, ప్రభుత్వం ఎప్పటికప్పుడు మీడియా సమావేశాలు ఏర్పాటు చేసి సమాచారం ఇస్తుండాలని వివరించారు.

ఒక్కరోజే 156 ఒమిక్రాన్ కేసులు

రికార్డు స్థాయిలో ఒక్కరోజే 156 ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. దీంతో కొత్త వేరియంట్ కేసుల సంఖ్య 578కి పెరిగిందని కేంద్ర ఆరోగ్య శాఖ సోమవారం చెప్పింది. ఇందులో 151 మంది కోలుకున్నారని, లేదా దేశం విడిచి వెళ్లిపోయారని తెలిపింది. ఢిల్లీలో అత్యధికంగా 142, మహారాష్ట్రలో 141, కేరళలో 57, గుజరాత్‌‌‌‌‌‌‌‌లో 49, రాజస్థాన్‌‌‌‌‌‌‌‌లో 43, తెలంగాణలో 56 కేసులు రికార్డయ్యాయి. ఇక దేశంలో కొత్తగా6,531 మంది కరోనా బారిన పడ్డారు. 315 మంది చనిపోయారు. ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య 75,841కి చేరింది. మొత్తం కేసులు 3,47,93,333కి, డెత్స్ 4,79,997కి పెరిగాయి. రికవరీ రేటు 98.40కి చేరింది. దేశంలో ఇప్పటిదాకా 141.70 కోట్ల వ్యాక్సిన్ డోసులు వేశారు.

ఆస్ట్రేలియాలో తొలి ఒమిక్రాన్ డెత్

ఆస్ట్రేలియాలోని న్యూ సౌత్ వేల్స్ రాష్ట్రంలో తొలి ఒమిక్రాన్ డెత్ నమోదైంది. వెస్టర్న్ సిడ్నీకి చెందిన 80 ఏళ్ల వ్యక్తి కొత్త వేరియంట్ బారిన పడి చనిపోయార ని ఆఫీసర్లు చెప్పారు. ఆయన ఫుల్ వ్యాక్సిన్ వేసుకున్నారని, కానీ ఇతర హెల్త్ సమస్యలు ఉన్నాయని తెలిపారు.