రైతే రాజయ్యే రోజు రావాలి

రైతే రాజయ్యే రోజు రావాలి

‘యాక్టర్ కొడుకు యాక్టర్, డాక్టర్ కొడుకు డాక్టర్, పొలిటీషియన్ కొడుకు పొలిటిషీయన్ అవ్వాలనుకుంటారు. కానీ రైతు కొడుకు రైతు అవ్వాలనుకునే రోజు రావాలి. వస్తుందనే నమ్మకం ఉంది’ అన్నారు చిరంజీవి. శర్వానంద్ హీరోగా కిశోర్ దర్శకత్వంలో రామ్ ఆచంట, గోపి ఆచంట నిర్మించిన ‘శ్రీకారం’ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిన్న ఖమ్మంలో జరిగింది. దానికి చీఫ్ గెస్ట్గా హాజరైన చిరంజీవి మాట్లాడుతూ ‘నేటి యువతకి వ్యవసాయం విలువని తెలియజెప్పే చిత్రమిది. తినేవాళ్లు నెత్తిమీద జుట్టంత ఉంటే.. పండించేవాళ్లు మూతిమీద మీసమంత ఉన్నారనే డైలాగ్ నన్ను ఆకట్టుకుంది. ఐటీ జాబ్స్ వదిలి కొందరు కుర్రాళ్లు  వ్యవసాయంపై మమకారంతో తిరిగి వస్తున్నారు. కానీ కొందరు డిజప్పాయింట్ అయ్యి వెనక్కివెళ్లిపోతున్నారు. వ్యవసాయంలో పాత పద్ధతుల వల్లే ఇలా జరుగుతోంది. మోడ్రన్ పద్దతుల్లో వ్యవసాయం చేయగలిగితే కచ్చితంగా రైతే రాజు అని నిరూపించగలం. నెలకు లక్షలు సంపాదించినా రాని తృప్తి వ్యవసాయంలో వస్తుంది. అసలు వ్యవసాయం ఎందుకు చేయాలి అని ఆలోచించేలా చేసే ఇంత మంచి సినిమా పెద్ద సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నా’ అన్నారు. వ్యవసాయం, రైతుల గురించి తీసిన ఈ సినిమా పెద్ద హిట్టవ్వాలన్నారు మంత్రి పువ్వాడ అజయ్ కుమార్. శర్వానంద్ మాట్లాడుతూ ‘నీ సంకల్పం గొప్పదైతే దేవుడు నీ తలరాతను తిరగరాస్తాడని చిరంజీవి గారు నాకు చెప్పిన మాట మర్చిపోలేను.  ఆ సంకల్పమే నన్ను స్టార్ ని చేసింది.  ట్రైలర్ చూసి మీకు ఎలాంటి సపోర్ట్ కావాలో చెప్పు అన్న నా మిత్రుడు రామ్ చరణ్కి థ్యాంక్స్. కావాల్సినంత ప్రేమ, సరిపోయే సెంటిమెంట్, అల్లరి చేసే ఫ్రెండ్స్,  ఏడిపించే నాన్న, నవ్వించే విలన్, అందమైన అమ్మాయి, అన్నం పెట్టే భూమి.. వీటిచుట్టూ తిరిగేదే ఈ సినిమా’ అన్నాడు.  ఇంత మంచి  సినిమాలో పార్ట్ అయినందుకు గర్వపడుతున్నానంది హీరోయిన్ ప్రియా అరుళ్ మోహన్. ‘వ్యవసాయ కుటుంబాల్లో నాన్న పడ్డ కష్టం, అమ్మ మనపై చూపించే ఇష్టం, తోబుట్టువుల ప్రేమ ఎంత సహజంగా ఉంటాయో, ఈ సినిమా కూడా అంతే సహజంగా ఉంటుంది’ అన్నాడు దర్శకుడు. ‘వ్యవసాయం చేద్దామనుకునే కుర్రాడు తనకి ఎదురైన ఇబ్బందులను ఎలా ఫేస్ చేశాడనేది కథ. ఔట్పుట్ చాలా బాగా వచ్చింది. అందరికీ నచ్చుతుంది’ అన్నారు నిర్మాతలు.  లిరిసిస్ట్స్ పెంచల్ దాస్, భరద్వాజ్, డైలాగ్ రైటర్ సాయి మాధవ్ బుర్రా తదితరులు పాల్గొన్నారు. రావు రమేష్, సాయి కుమార్ వీడియో బైట్ ద్వారా విషెస్ చెప్పారు.