ముంబై: బాలీవుడ్ సీనియర్ యాక్టర్ గోవింద తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. మంగళవారం (నవంబర్ 11) రాత్రి తన నివాసంలో ఆయన కుప్పకూలాడు. వెంటనే అప్రమత్తమైన కుటుంబ సభ్యులు హుటాహుటిన ఆయనను ముంబైలోని క్రిటికల్ కేర్ ఆసుపత్రికి తరలించారు. హెల్త్ కండిషన్ క్రిటికల్‌గా ఉండటంతో ఐసీయూలో ట్రీట్మెంట్ అందించారు వైద్యులు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని.. ఎలాంటి ప్రమాదం లేదని సమాచారం. బుధవారం (నవంబర్ 12) గోవింద హెల్త్ బులెటిన్ విడుదల చేయనున్నారు డాక్టర్స్.
కాగా, 60 ఏళ్ల గోవింద తన నటనతో దేశవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్నారు. తమ అభిమాన నటుడు అస్వస్థతకు గురయ్యాడని తెలియడంతో గోవింద అభిమానులు ఆందోళన చెందుతున్నారు. ఆయన త్వరగా కోలుకుని తిరిగి క్షేమంగా ఇంటికి వెళ్లాలని ప్రార్థనలు చేస్తున్నారు. గోవింద హెల్త్ కండిషన్‌పై పలువురు బాలీవుడ్ ప్రముఖులు ఆరా తీస్తున్నారు.
గోవింద ఆరోగ్య పరిస్థితిపై ఆయన స్నేహితుడు లలిత్ బిందాల్ మీడియాతో మాట్లాడారు. మంగళవారం (నవంబర్ 11) రాత్రి తన నివాసంలో గోవింద అకస్మాత్తుగా కుప్పకూలిపోయారని తెలిపారు. వెంటనే అతడిని క్రిటికల్ కేర్ ఆసుపత్రికి తరలించామన్నారు. ప్రస్తుతం గోవింద ఆరోగ్యం నిలకడగా ఉందని.. వైద్యులు అతడిని పర్యవేక్షిస్తున్నారని తెలిపారు.
