
తన చిన్నప్పుడే వాళ్ల ఫ్యామిలీ విదేశంలో స్థిరపడింది. కానీ, తన కల నెరవేర్చుకోవడం కోసం తిరిగి స్వదేశానికి వచ్చాడు. ఒకప్పుడు సినిమా సెలబ్రెటీల కోసం పనిచేశాడు. ఇప్పుడు తనే సెలబ్రెటీగా మారాడు. అతనే కరణ్వీర్ మల్హోత్రా. నాటకాల్లో నటనకు మెరుగుపెట్టుకుని, వెండి తెరపై తనను నటుడిగా నిరూపించుకోవాలనే తాపత్రయంతో ముందుకెళ్తున్నాడు. ఈ క్రమంలో అటు సినిమాలు, ఇటు వెబ్ సిరీస్‌లు చేస్తూ.. ఇప్పుడిప్పుడే గుర్తింపు తెచ్చుకుంటోన్న కరణ్ జర్నీ ఇది.
జితేంద్ర, బెట్టీల మొదటి సంతానం కరణ్వీర్ మల్హోత్రా. తనకు పంతొమ్మిదేండ్లు ఉన్నప్పుడు వాళ్ల ఫ్యామిలీ మెల్బోర్న్కు షిఫ్ట్ అయింది. చదువు పూర్తయ్యాక మెల్‌బోర్న్‌లోనే ఒక ఫ్యాక్టరీలో వాళ్ల నాన్నతో కలిసి పనిచేశాడు. ఫ్యాక్టరీ వర్కర్గా బాక్సులు ప్యాక్ చేయడం తన డ్యూటీ. పొద్దున్నే నాలుగైదు గంటలకు లేవడం, ఫ్యాక్టరీలో పన్నెండు గంటలు పనిచేయడం.
ఇదే డైలీ రొటీన్.. కావడంతో విసిగిపోయిన కరణ్‌కు..‘లైఫ్ అంటే ఇది కాదు.. ఇంకేదో ఉంది’ అనిపించేది. అప్పుడే నటన వైపు తన ఆసక్తి మళ్లింది. నాటకాల్లో నటించాలనే ఆలోచన వచ్చింది. అలా ఒక ఇండిపెండెంట్ థియేటర్ గ్రూపులో చేరాడు. అక్కడ యాక్టింగ్ నేర్చుకుని.. ఎన్నో షోల్లో పర్ఫార్మెన్స్ ఇచ్చాడు.
ప్లకార్డులు పట్టుకుని..
సినిమాల్లో నటించాలని.. మెల్బోర్న్ నుంచి యాక్టింగ్ వర్క్‌షాప్ కోసం కరణ్ ఢిల్లీకి వచ్చాడు. అప్పుడు ‘‘ఒక కాస్టింగ్ డైరెక్టర్ యాక్టింగ్ ఇంట్రెస్ట్ ఉంటే ఒక పాత్రకు ఆడిషన్ ఇస్తావా?’’అని అడిగాడు. అది వర్కవుట్ కాలేదు. కానీ, తర్వాత మరో కాస్టింగ్ డైరెక్టర్ కరణ్‌ని చూసి ఆడిషన్ చేశాడు. అలా ‘వాట్ ఆర్ ది ఆడ్స్?’అనే సినిమాలో అవకాశం దక్కింది. యాక్టింగ్ మీద ఇష్టంతో అప్పటికే మూడేండ్లుగా ఇంటికి దూరంగా ఇండియాలో ఉండిపోయాడు.
అప్పటి సంగతులు గుర్తుచేసుకుంటూ.. ‘‘నేను తిరిగి ఇండియా వచ్చినప్పుడు నాకు ఉండడానికి చోటు లేదు. దాంతో ప్రొడక్షన్ హౌస్‌లోనే ఒక ఏడాదిపాటు నివాసం ఉన్నా. ఆ టైంలో ప్రొడ్యూసర్స్ నాకు చాలా హెల్ప్ చేశారు. మెల్బోర్న్లో ఉన్నప్పుడు అక్కడ జరిగే ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్స్‌కి వచ్చేసెలబ్రెటీల కోసం పొద్దున్నే వెళ్లి ప్లకార్డులు పట్టుకుని నిల్చునేవాడిని.
వాళ్లను పికప్ చేసుకుని రూంకి తీసుకెళ్లేవాడిని. కానీ, తర్వాత నేను అక్కడి నుంచి వస్తుంటే నిర్మాతలు నాకోసం ఎయిర్‌పోర్ట్‌లో ప్లకార్డులు పట్టుకోవడం చూసి ఎగ్జైట్ అయ్యాను. ఒక సర్కిల్ కంప్లీట్ చేశా అనిపించింది” అని తన మనసులోని మాటలు పంచుకున్నాడు.
ఇండస్ట్రీకి వచ్చాక..
‘‘షూటింగ్ ఉంటే పది లేదా పన్నెండు గంటలు అక్కడే సరిపోతుంది. కాబట్టి వేరే పనులు చేసే టైం ఉండదు. షూటింగ్ పూర్తయ్యాక సెలవు రోజుల్లో నా టైం నాకు ఉంటుంది. అప్పుడు పుస్తకాలు చదవడం, మూవీస్ చూడడం, వర్కవుట్స్ చేయడం, ఫ్యామిలీతో కాసేపు టైం స్పెండ్ చేయడం వంటివి చేస్తుంటా’’.
అమ్మ సపోర్ట్..
అతనికి తల్లితో అటాచ్మెంట్ చాలా ఎక్కువ. చిన్నప్పుడు తన స్కూల్లో వాళ్లమ్మ టీచర్‌గా ఉండేది. ఆమె గురించి ఓ సందర్భంలో ఇలా చెప్పాడు. ‘‘మా అమ్మ ఆర్మీ బ్యాక్‌గ్రౌండ్ నుంచి వచ్చింది. దాంతో నా చదువు విషయంలో చాలా జాగ్రత్త తీసుకునేది. మా అమ్మే నా బెస్ట్ ఫ్రెండ్. ఆమెతో ఏదైనా మాట్లాడతాను. అమ్మ నన్ను కొన్నిసార్లు తిడుతుంది. జాగ్రత్తలు చెప్తుంది. సలహాలు ఇస్తూ ఉంటుంది. నా లైఫ్‌లో బిగ్గెస్ట్ సపోర్ట్ మా అమ్మే’’.
‘సెలక్షన్ డే’తో మొదలు..
చిన్నప్పటినుంచి కరణ్‌కు క్రికెట్ అంటే చాలా ఇష్టం. తనకు ఇష్టమైన క్రికెటర్ ధోని అని చెప్తుంటాడు. పన్నెండేండ్ల వయసులో ధోనిని కూడా కలిశాడు. ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే.. కరణ్ తన డెబ్యూ చేసిన సిరీస్ ‘సెలక్షన్ డే’..అందులో జావెద్ అన్సారీ అనే క్రికెటర్ పాత్ర పోషించాడు. అందులో స్కూల్ క్రికెట్ టీంకి కెప్టెన్, బ్యాట్స్‌మెన్‌గా కనిపించాడు.
మరో సినిమా ‘ది ఫర్గాటెన్ ఆర్మీ’లో.. ఫొటోజర్నలిస్ట్ పాత్రలో నటించాడు. ఆ టైంలో ‘‘డైరెక్టర్ ఇచ్చిన ఇన్పుట్స్ నాకు బాగా హెల్ప్ అయ్యాయి. తన సొంత అనుభవాలు చెప్తూ.. ఎలా నటించాలో వివరంగా చెప్పేవాడు. ‘సెలక్షన్ డే’ సినిమాకు కూడా దీంతోపాటే డబ్బింగ్ చెప్పా. అప్పుడు టైం అలా కలిసి వచ్చింది. కాకపోతే ముందు అదే రిలీజ్ కావడంతో ‘సెలక్షన్ డే’నా డెబ్యూ అయింది”అని చెప్పుకొచ్చాడు.
డిజిటల్ మీడియం ఒక వరం..
‘‘నేను థియేటర్ బ్యాక్‌గ్రౌండ్ నుంచి సినిమాల్లోకి వచ్చాను. ఇండిపెండెంట్ థియేటర్ డ్రామాలు చాలా చేశా. నా వరకు ప్రతి ప్రాజెక్ట్‌కి పాత్ర, స్టోరీలైన్ ఇంపార్టెంట్. డిజిటల్ మీడియంకి రీచ్ ఎక్కువ ఉంటుందనేది నా ఫీలింగ్. ఉదాహరణకు ఆస్ట్రేలియాలో ఉండే నా ఫ్రెండ్స్ హిందీ మూవీస్ చూడరు. కానీ, నెట్‌ఫ్లిక్స్, అమెజాన్‌లో వచ్చే షోలు మాత్రం మిస్ కాకుండా చూస్తారు. అలా చూసుకుంటే డిజిటల్ మీడియంలో నాకు అవకాశం రావడం వరంలా భావిస్తున్నా’’.
అంధేరా..
‘అంధేరా’ముంబైలో జరిగే కథ. ఈ సిరీస్ ఒక సూపర్ నేచురల్ పవర్ మీద ఆధారపడి ఉంటుంది. ఇందులో పాత్రలన్నీ కూడా అందుకు తగ్గట్టే బిహేవ్ చేస్తుంటాయి. అయితే, ఒక రోజులో చాలాసేపు షూటింగ్ చేయాల్సి వస్తుంది.
అలాంటప్పుడు ‘‘అందరూ ఒక మూడ్‌ని మెయింటెయిన్ చేస్తుంటారు. కానీ, మేం అలా లేము. డైరెక్టర్ కట్ చెప్పగానే పక్కకు వెళ్లిపోయి ఫన్నీ జోక్స్ వేసుకుంటూ చిల్ అయ్యేవాళ్లం. ఎవరైనా స్క్రిప్ట్ గురించి తెలియనివాళ్లు వచ్చి చూస్తే అక్కడ కామెడీ సీన్స్ షూట్ చేస్తున్నారేమో అనుకుంటారు. కానీ, అక్కడ సీరియస్‌గా, ఎమోషనల్‌గా.. ఏదో ఉంది అన్నట్లే నటిస్తుంటాం’’.
ద వెయిట్ ఈజ్ వర్త్!
‘‘నేను అనుకున్నది సాధించడానికి పదేండ్లు పట్టింది. మొత్తానికి నా ఎదురుచూపులకు ఫలితం దక్కింది. ఒకప్పుడు పోస్టర్లు పట్టుకుని తిరిగా.. ఇప్పుడు నా పోస్టర్ బయట కనిపిస్తుంటే నా మనసు ఉప్పొంగిపోతుంది. ఇంతకాలానికి నా కల నెరవేరినందుకు గర్వంగా ఉంది. యాక్టర్ కాకపోయి ఉంటే ఇండియన్ ఆర్మీలోకి వెళ్లేవాన్నేమో. నాకు ఇంకా పెద్ద పెద్ద డ్రీమ్స్ ఉన్నాయి. వాటిని ఏదో ఒకరోజు సాధిస్తాను. ఇప్పుడైతే యాక్టింగ్ కెరీర్ కంటిన్యూ చేస్తాను”.
కరణ్వీర్.. అంధేరాతో పాటు, ఇండియన్ పోలీస్ ఫోర్స్ సిరీస్, ది ఫర్గాటెన్ ఆర్మీ - ఆజాదీ కే లియే, సెలెక్షన్స్ డే, జావేద్ వంటి తదితర సినిమాల్లో నటించి మెప్పించాడు.