
‘శివ’ మొదలు ఇప్పటి వరకు తన కెరీర్‌లో ఎన్నో కొత్త తరహా కాన్సెప్టుల్ని టచ్ చేసిన నాగార్జున, ఇప్పుడో భారీ యాక్షన్ మూవీలో నటిస్తున్నారు. ప్రవీణ్ సత్తారు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం ఫిబ్రవరిలో ప్రారంభమైంది. లాక్‌డౌన్ వల్ల ఆగిన షూటింగుని త్వరలో తిరిగి స్టార్ట్ చేయబోతున్నారు. ఈ మూవీలో చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్‌గా నటిస్తున్నారు నాగార్జున. ఆయన పాత్రను ఎంతో స్టైలిష్‌గా డిజైన్ చేశాడట ప్రవీణ్. త్వరలోనే నాగ్‌పై హై ఓల్టేజ్ యాక్షన్ సీక్వెన్స్ తీసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఈ సీన్స్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్‌లో ఉంటాయని చెబుతున్నారు. ఇందుకోసం నాగ్ ప్రత్యేకంగా ఇజ్రాయెల్ సెల్ఫ్ డిఫెన్స్ టెక్నిక్స్‌లో ట్రైనింగ్ తీసుకుంటున్నట్టు తెలుస్తోంది. కత్తిసాము, క్రావ్ మాగా లాంటి యుద్ధ విద్యల్లో ఈ ట్రైనింగ్ ఉంటుందట. మొత్తానికి యంగ్ హీరోలకి పోటీనిచ్చేలా పవర్‌ఫుల్ యాక్షన్ సీక్వెన్స్‌తో సర్‌ప్రైజ్ చేయబోతున్నారు నాగార్జున. ఆయనకి జంటగా కాజల్ అగర్వాల్ నటిస్తోంది. నారాయణదాస్ నారంగ్, పి.రామ్మోహన్‌రావు, శరత్ మరార్ కలిసి నిర్మిస్తున్నారు. ఈ సినిమా తర్వాత ‘సోగ్గాడే చిన్నినాయన’ ప్రీక్వెల్ 'బంగార్రాజు'లో నటించబోతున్నారు నాగార్జున. ప్రస్తుతం స్క్రిప్ట్ దశలో ఉన్న ఈ ప్రాజెక్ట్‌పై త్వరలో అనౌన్స్‌మెంట్ రానుంది.