నాజర్‌‌కు గాయాలు.. ఆసుపత్రికి తరలింపు

నాజర్‌‌కు గాయాలు.. ఆసుపత్రికి తరలింపు

ప్రముఖ సినీ నటుడు నాజర్ కు గాయాలయ్యాయి. తెలంగాణ పోలీస్ అకాడమీలో తమిళ సినిమా షూటింగ్ లో ఆయన పాల్గొన్నారు. మెట్లు దిగుతున్న సమయంలో జారి కిందపడడంతో స్వల్ప గాయాలైనట్లు సమాచారం. వెంటనే చిత్ర యూనిట్ అప్రమత్తమైంది. సమీపంలో ఉన్న ఆసుపత్రికి తరలించారు. ఆయన్ను పరిశీలించిన అనంతరం స్వల్ప గాయాలైనట్లు వైద్యులు వెల్లడించినట్లు సమాచారం. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. నాజర్ గాయపడ్డాడని తెలుసుకున్న అభిమానులు, ఇతర నటులు ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నారు.

నాజర్ తో పాటు సుహాసిని, మొహరీన్, షియాజీ షిండేలు షూటింగ్ పాల్గొన్నారని సమాచారం. ఇక నాజర్ విషయానికి వస్తే... విలక్షణ నటుడిగా ఆయన పేరు గడించారు. తెలుగు, తమిళంతో పాటు వివిధ భాషల్లో నటించారు. ఇటు దక్షిణాది అటు ఉత్తరాదిలోనూ విలన్, కమెడియన్, సపోర్టింగ్ క్యారెక్టర్ ..ఇలా ఎన్నో విభిన్నమైన పాత్రలు పోషిస్తూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. సుదీర్ఘకాలంగా ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి.. ప్రేక్షకుల మన్ననలు, విమర్శకుల ప్రశంసలతో పాటు ఎన్నో అవార్డులను నాజర్ అందుకున్నారు.