
ప్రముఖ నటుడు నాజర్ ఇంట్లో విషాదం నెలకొంది. ఆయన తండ్రి మెహబూబ్ బాషా కన్నుమూశారు. 95 ఏళ్ల మెహబూబ్ బాషా కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతూ.. తమిళనాడులోని చెంగల్పట్టులో తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. మెహబూబ్ నగలను పాలిష్ చేస్తూ కుటుంబాన్ని పోషించేవాడు. తండ్రి కోరిక తీర్చేందుకు నాజర్ సినిమాల్లోకి వచ్చారు. మెహబూబ్ మృతి గురించి తెలుసుకున్న పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు సోషల్ మీడియా ద్వారా సంతాపాన్ని తెలియజేస్తున్నారు.
ఇక నటుడిగా, దర్శకుడిగా, నిర్మాతగా, డబ్బింగ్ ఆర్టిస్టుగా సినీ పరిశ్రమలో నాజర్ తనదైన ముద్ర వేశారు. హీరోగా కొన్ని సినిమాల్లోనే నటిస్తూనే.. పలు సినిమాల్లో విలన్, క్యారెక్టర్ రోల్స్ చేసి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. తమిళంతో పాటు తెలుగు, మలయాళం, కన్నడ, ఇంగ్లీష్, హిందీ, బెంగాలీ భాషల్లో కూడా నటించారు. నటీనటుల సంఘం ఎన్నికల్లోనూ రెండోసారి గెలిచి అధ్యక్షుడయ్యారు.
మరోవైపు నిన్న టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు తండ్రి శ్యామ్ సుందర్‌రెడ్డి (86) కన్నుమూశారు. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న సోమవారం సాయంత్రం తుదిశ్వాస విడిచారు. శ్యామ్ సుందర్ రెడ్డి స్వస్థలం నిజామాబాద్ జిల్లాలోని నర్సింగ్‌పల్లి. ఆయనకు దిల్ రాజుతోపాటు మరో ఇద్దరు కుమారులు ఉన్నారు.