గ్రామాలను దత్తత తీసుకున్నప్పుడు నాన్ లోకల్ కాదా?

గ్రామాలను దత్తత తీసుకున్నప్పుడు నాన్ లోకల్ కాదా?

హైదరాబాద్: మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ అధ్యక్ష పదవి కోసం పోటీకి దిగాలనేది హఠాత్తుగా తీసుకున్న నిర్ణయం కాదని, ఒక ఏడాది నుంచి ఈ ఆలోచనతో ఉన్నట్లు విలక్షణ నటుడు ప్రకాశ్‌‌ రాజ్ చెప్పారు. గత మూడు నెలల నుంచి సాటి నటులతో కలసి తీవ్రంగా సమాలోచనలు జరిపానన్నారు. సున్నితమైన కళాకారులు ఉన్న అసోసియేషన్ అందరికీ ఓ వినోదంలా మారిందన్నారు. అందుకే ఓ విజన్‌తో అసోసియేషన్‌ను ముందుకు తీసుకెళ్లాలని అనుకుంటున్నట్లు చెప్పారు. ప్యానెల్‌లో ఎవరెవరు ఉండాలి, చిత్తశుద్ధితో పని చేయగలమా అనే విషయాలపై చర్చలు జరుపుతున్నామని తెలిపారు. 

‘నటులందరూ సున్నితమైన వాళ్లు. ‘మా’ ఎన్నికలను ఒక పోరుగా చూడొద్దని మీడియాను కోరుతున్నాం. మేం నిశ్శబ్దంగా పని చేయాలని అనుకుంటున్నాం, అసోసియేషన్‌ను నిర్మించాలనుకుంటున్నాం. ‘మా’లో సుస్థిరత నెలకొల్పాలని భావిస్తున్నాం. అయితే కొన్ని విషయాల్లో మేం స్పష్టత కోరుకుంటున్నాం. ఎవరెవరు పని చేస్తారో మేం తెలుసుకోవాల్సి ఉంది. మేం పదవుల కోసం పోరాడట్లేదు. మా ప్యానెల్‌లో ఉన్న శ్రీకాంత్, జయసుధ, అనసూయ, సనా, ప్రగతి, ఉత్తేజ్ లాంటి వాళ్లు నేను తప్పులు చేస్తే నన్ను బయటకు పంపేస్తారు. వాళ్లలో ప్రశ్నించేతత్వం ఉంది’ అని ప్రకాశ్ రాజ్ పేర్కొన్నారు. 

చిరంజీవిని ఎందుకు లాగుతున్నారు?

‘మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ఎన్నికల విషయంలో చిరంజీవిని ఎందుకు లాగుతున్నారో అర్థం కావడం లేదు. అసోసియేషన్‌లో ఉన్న వాళ్లందరమూ కలిసే ఉంటాం. ఇది ఓ పార్టీ కాదు. ఒక విషయం నేను కొత్తగా వింటున్నా. లోకల్, నాన్ లోకల్ అంటున్నారు. అసలు మనం ఏ దేశంలో ఉంటున్నాం? ఏ సూర్యుడు లోకల్ ఇక్కడ? సినిమా అనేదే ఓ భాష, పరిభాష. కళాకారులు లోకల్ కాదు, నటులంతా యూనివర్సల్. లోకల్, నాన్ లోకల్ గురించి గత ఎన్నికల్లో ఎందుకు లేవనెత్తలేదు? దీని వెనుక ఉన్న ఎజెండా ఏంటనేది మీడియానే విశ్లేషించాలి. నా అసిస్టెంట్‌లకు ఇళ్లు కొనిచ్చినప్పుడు, రెండు గ్రామాలను దత్తత తీసుకున్నప్పుడు నాన్ లోకల్ అనలేదు. 9 నంది అవార్డులు వచ్చినప్పుడు, జాతీయ అవార్డు అందుకున్నప్పుడు నాన్ లోకల్ అనలేదు కానీ ఇప్పుడు హఠాత్తుగా నాన్ లోకల్ అంటున్నారు. ఇలాంటి సంకుచిత భావనలు సరికాదు. ‘మా’ అసోసియేషన్‌కు ఓ గౌరవం ఉంది. ఇది కోపంతో పుట్టిన అసోసియేషన్ కాదు. ఆవేదనతో పుట్టిన సినిమా బిడ్డల ప్యానెల్. అందుకే మాను ప్రక్షాళన చేయాలనుకుంటున్నాం. నటులు కూడా అర్హత చూసి ఓటు వెయ్యాలని కోరుతున్నాం. ప్రణాళికలు రూపొందించి ఓట్లు అడుగుతాం. ‘మా’ బిల్డింగ్ ఎలా కడతామనేది కూడా అందరికీ వివరిస్తాం. ఎన్నికల డేట్ ప్రకటించేంత వరకు మేం మీడియా ముందుకు రాబోం’ అని ప్రకాశ్‌రాజ్ స్పష్టం చేశారు.