కొత్త ద‌ర్శకుల్లో చాలా ప్రతిభ ఉంది

కొత్త ద‌ర్శకుల్లో చాలా ప్రతిభ ఉంది

సందీప్ మాధ‌వ్‌, గాయత్రి ఆర్‌. సురేష్ జంట‌గా న‌టించిన‌ చిత్రం 'గంధ‌ర్వ'. ఫ‌న్నీ ఫాక్స్ ఎంట‌ర్‌టైన్‌మెంట్ బేన‌ర్ పై యఎస్‌.కె. ఫిలిమ్స్ సురేష్ కొండేటి స‌హ‌కారంతో యాక్షన్ గ్రూప్ స‌మ‌ర్పిస్తున్న చిత్రమిది. అప్సర్ ని ద‌ర్శకుడిగా ప‌రిచ‌యం చేస్తూ సుబాని నిర్మించారు. సెన్సార్ పూర్తయి జూలై8న విడుద‌ల కాబోతుంది. ఈ  సంద‌ర్భంగా గంధ‌ర్వలో కీల‌క పాత్ర పోషించిన డైలాగ్ కింగ్ సాయికుమార్‌ మీడియా స‌మావేశంలో ప‌లు విష‌యాలు తెలియ‌జేశారు.

గంధ‌ర్వ క‌థ చెప్పగానే మీరెలా ఫీల‌య్యారు?
ద‌ర్శకుడు అప్సర్ ఆర్మీ మ‌నిషి. ఏదో కొత్తద‌నంలో ఆయ‌న‌లో క‌నిపించింది. నాకు ద‌ర్శకుడు వీర‌శంక‌ర్ ఫోన్ చేశాడు. అప్సర్ అనే కొత్త ద‌ర్శకుడు క‌థ చెబుతాడు విన‌మ‌న్నారు. నేను ఈ మ‌ధ్య క‌న్నడ‌లో `రంగీ త‌రంగా` చేశాను. ఆస్కార్ దాకా వెళ్ళింది. నేను ఆ సినిమా చేశాక కొత్తవాడితో ఎలా చేశావ్! అని న‌న్ను చాలామంది అడిగారు. క‌థ‌ను న‌మ్మాను అన్నాను. అలాగే ఎస్‌.ఆర్‌. క‌ళ్యాణ‌మండ‌పం కూడా అలానే జ‌రిగింది. ఇప్పుడు గంధ‌ర్వ క‌థ‌కూడా అంతే. చాలా కొత్తగా క‌థ వుంది. మ‌న‌సావాచా క‌ర్మనా మ‌న ప‌ని మ‌నం చేసుకుంటూ పోతే త‌ప్పకుండా హిట్ వ‌స్తుంది. గంధ‌ర్వలోనూ అంతా కొత్తవారైనా క‌థ‌లోని ఎమోష‌న్స్‌, ఫీలింగ్స్ చాలా అద్భుతంగా వున్నాయి. క‌లికాలంలో ఓ సీన్ వుంటుంది. నాన్న చనిపోయాడు అనుకుంటాం. తిరిగి వ‌స్తే ఎలా వుంటుంద‌నే ఆస‌క్తిక‌రంగా అనిపిస్తుంది. గంధ‌ర్వలో అలానే ఉంటుంది. ఈ పాయింట్‌ను ద‌ర్శకుడు అద్భుతంగా ప్రెజెంట్ చేశాడు.
 
చాలా పాత్రలు పోషించిన మీకు గంధ‌ర్వ ఎంత మేరకు కొత్తగా అనిపించింది?
నేను పోలీస్ స్టోరీ చేసి 25 ఏళ్ల‌యింది. ఈరోజుకీ ఇంకా అదే ప్రేక్షకులు గుర్తుపెట్టుకుని ప‌లుక‌రిస్తున్నారు. ఇప్పుడు సీక్వెల్ చేయ‌డానికి క‌మ‌ల్ హాస‌న్ విక్రమ్ సినిమా కిక్ ఇచ్చింది. అండ‌ర్ ప్లే, డ్రామా.. ఇలా ప్రతీదీ నేను చేశాను. అలాంటి కొత్త ప్రయ‌త్నమే గంధ‌ర్వ సినిమాలోని నా పాత్ర వుంటుంది. 

గంధ‌ర్వలో 1971-2021 అని వుంది. దానికి మీ పాత్రకు సంబంధం ఉందా?
నేను ఇంత‌కుముందు ఇప్పుడు చేయ‌బోయే సినిమాలోని పాత్రలు కూడా భిన్నంగా చేస్తున్నవే. ధ‌నుష్ చిత్రం `స‌ర్‌`లో నెగెటివ్ పాత్ర చేస్తున్నా. అలాగే ద‌స‌రాలో ఊహించ‌ని ట్విస్ట్ నా పాత్రలో వుంటుంది. ఇప్పుడు గంధ‌ర్వలో కూడా ఎవ‌రూ ఊహించ‌ని ట్విస్ట్ నా పాత్రలో వుంది. నేను పొలిటీషియ‌న్‌. సీఎం అవ్వాల‌నుకుంటాను. సరిగ్గా ఆ టైంలో నా తండ్రి అంటూ సందీప్ మాధ‌వ్ నా జీవితంలోకి వ‌స్తాడు. త‌ను యంగ్‌లో ఉంటాడు. మా అమ్మకు, ఈయ‌న‌కు వున్న రిలేష‌న్ ఏమిట‌ని.. మీడియా హైలైట్ చేస్తుంది. క‌థ‌లో ట్విస్ట్ అదే. 1971-2021 టైం ట్రావెల్‌లో జ‌రిగే క‌థ కాబ‌ట్టి అలా పెట్టారు. 

గంధ‌ర్వ చూశారు క‌దా ఎలా అనిపించింది?
ఇప్పటి జ‌న‌రేష‌న్ ప్రతీదీ ప‌రిశీలిస్తున్నారు. మేథావుల్లా ఆలోచిస్తున్నారు. కంటిన్యూటీ కూడా వేలెత్తి చూపిస్తున్నారు. అందుకే క‌థ‌ను ముగింపులో చాలా జాగ్రత్తగా చెప్పాల‌ని ద‌ర్శకుడితో అన్నాను. ఎక్కడా లాజిక్ మిస్ కాకుండా సినిమాటిక్‌గా ఒప్పించ‌గ‌ల‌గాలి. క్లైమాక్స్‌లో సైంటిఫిక్‌గా ఉంటూనే అంద‌రినీ మెప్పించేలా చేశాడ‌ని నేను సురేష్ కొండేటి ద్వారా విన్నాను. ఆయ‌న సినిమాచూసి సూప‌ర్‌డూప‌ర్ హిట్ అవుతుంద‌న్నారు. ఇదే అభిప్రాయాన్ని డ‌బ్బింగ్ చెప్పిన‌వాళ్ళు సందీప్ మాధ‌వ్‌, జ‌య‌సింహ కూడా చెప్పారు. ఇంట‌ర్‌వెల్‌లో మంచి ట్విస్ట్ ఉంటుంది. ఇందులో అన్ని ఎమోష‌న్స్  ఉంటాయి. ఓ ప‌జిల్ కూడా ఉంటుంది. సేమ్ మా నాన్నలా వుండే సందీప్‌ను చూసి మ‌నిషిని పోలిన మ‌నుషులు ఏడుగురు వుంటార‌నుకుంటాం. అనేది లాజిక్‌గా ద‌ర్శకుడు ముడివిప్పిన విధానం చాలా బాగుంది.

ఈ జ‌న‌రేష‌న్ హీరోల‌తో న‌టించ‌డం ఎలా అనిపిస్తుంది?
సందీప్ చేసిన గ‌త సినిమాలు చూశాను. చాలా టాలెంటెడ్‌. కొత్త జ‌న‌రేష‌న్ అయిన స‌త్యదేవ్, ప్రియ‌ద‌ర్శితో నేను చేస్తున్నా. వారి పెర్ ఫామెన్స్‌కు అనుగుణంగా నేను మార్చుకుని చేస్తున్నా. అలాగే గంధ‌ర్వలో సందీప్‌తో చేశా. టైటిల్‌కు త‌గ్గట్టు కొత్త కాన్సెప్ట్ ఫిలిం.

ఇన్నేళ్ళ కెరీర్‌లో చేయ‌ని పాత్రలేదు. ఇంకా కొర‌త ఉందా?
నేను నాట‌కాలు వేసే నాటినుంచి మేక‌ప్ వేసుకుని ఇప్పటికి 50 ఏళ్ళయింది. న‌టుడిగా, డ‌బ్బింగ్ ఆర్టిస్టుగా యాభై ఏళ్ళ ప్రస్తానం నాది.కొన్ని సినిమాలు చూసిన‌ప్పుడు ఇంకా ఏదో చేయాల‌ని న‌టుడిగా అనిపిస్తుంది. న‌టుడికి సంతృప్తి ఉండ‌దు. మేజ‌ర్ చంద్రకాంత్ షూట్‌లో ఎన్‌.టి.ఆర్‌.కు 72 ఏళ్ళు.  ఆ వ‌య‌స్సులో ఆయ‌న ఓ సీన్‌లో పై నుంచి దూకాలి. డూప్‌ లేకుండా దూకేస్తాన‌ని చేసేశాడు. న‌టుడిగా అంత డెడికేష‌న్ వుండాలి. నేను నేర్చుకుంది అదే. క‌న్నడ‌లో కామెడీ చేశాను. ఇటీవ‌లే పౌరాణికంలో దుర్యోధ‌నుడిగా న‌టించాను. ఇంకా ప‌లు భిన్నమైన పాత్రలు చేయాల‌నుంది. 

కొత్త చిత్రాలు?
త‌మిళంలో `డీజిల్‌` సినిమా చేస్తున్నా. అందులో డీజిల్ మాఫియా లీడ‌ర్‌గా న‌టిస్తున్నాను. ఇందులో మూడు గెట‌ప్‌లుంటాయి. ఇంకా ఓ వెబ్ సీరీస్ చేయ‌బోతున్నా అని సాయి కుమార్ అన్నారు.