మే 23న చెన్నైలో శరత్‌ బాబు అంత్యక్రియలు

మే 23న చెన్నైలో శరత్‌ బాబు అంత్యక్రియలు

నటుడు శరత్‌ బాబు అంత్యక్రియలు మంగళవారం (మే 23న) చెన్నైలో జరగనున్నాయి. టాలీవుడ్‌ సీనియర్‌ నటుడైన శరత్‌ బాబు సోమవారం (మే 22న) అనారోగ్య సమస్యలతో కన్నుమూశారు. హైదరాబాద్ ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. శరీరంలో ఇన్‌ఫెక్షన్‌ పెరగడంతో ఊపిరితిత్తులు, కాలేయం, కిడ్నీలు వంటి మల్టీపుల్ ఆర్గాన్స్ దెబ్బతిన్నాయి. వైద్యులు చేసిన ప్రయత్నాలు విఫలం కావడంతో ఆయన కన్నుమూశారు. శరత్‌ బాబు భౌతిక కాయాన్ని ఫిల్మ్‌ చాంబర్‌కు తరలించారు. పలువురు అభిమానులు, సినీ ప్రముఖులు సంతాపం ప్రకటించారు. ఆయనతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. ఆ తర్వాత ఆయన పార్థీవ దేహాన్ని చెన్నైకి తరలించారు.  మంగళవారం అక్కడే అంత్యక్రియలు నిర్వహించనున్నారు.

శరత్ బాబుతో ప్రత్యేక అనుబంధం : చిరంజీవి

శరత్‌ బాబు మృతి పట్ల మెగాస్టార్ చిరంజీవి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశఆరు. ఆయన మరణ వార్త తనను తీవ్రంగా కలచి వేసిందన్నారు. హుందాతనంతో ఉట్టిపడే నటనతో అభిమానుల గుండెల్లో స్థానం సంపాదించుకున్నారని కొనియాడారు. ఆయనతో తనకు ప్రత్యేక అనుబంధం ఉందని, చాలా సినిమాల్లో తన సహ నటుడిగా ఉన్నారని గుర్తు చేసుకున్నారు. 

సంతాపం ప్రకటించిన పవన్‌ కల్యాణ్‌

శరత్ బాబు మృతికి జనసేన అధినేత, సినీ నటుడు పవన్‌ కల్యాణ్‌ సంతాపం ప్రకటించారు. ఆయన మరణవార్త తెలిసి దిగ్భ్రాంతికి లోనయ్యానని తెలిపారు. కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న శరత్ బాబు కోలుకుంటారు అనుకున్నానని, కానీ అలా జరగలేదన్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నానన్నారు. శరత్ బాబుతో తనకు చెన్నైలో చిత్ర పరిశ్రమ ఉన్న రోజుల నుంచీ పరిచయం ఉందని, తన మొదటి చిత్రం ‘అక్కడ అమ్మాయి – ఇక్కడ అబ్బాయి’లో ముఖ్య పాత్ర పోషించారని, ‘వకీల్ సాబ్’ చిత్రంలోనూ నటించారన్నారు. తెలుగు చిత్రాల్లో ఆయన తనదైన నటనను చూపించారని పవన్‌ కల్యాణ్‌ పేర్కొన్నారు.

శరత్‌ బాబు మృతి విచారకరం : మురళీ మోహన్‌

శరత్‌ బాబు మృతి విచారకరమని సీనియర్‌ నటుడు మురళీ మోహన్‌ అన్నారు. ఆసుపత్రిలో శరత్ బాబు భౌతికకాయాన్ని ఆయన సందర్శించారు. మనందరి అభిమాన నటుడు శరత్ బాబు మృతి చెందడం తీవ్ర విచారకరమన్న ఆయన.. శరత్ బాబు బతకడం కష్టమని సందేహిస్తూనే ఉన్నామని, కానీ ఇంత త్వరగా వెళ్లిపోతాడని మాత్రం అనుకోలేదన్నారు.

శరత్ బాబు మృతి తెలుగు సినీ పరిశ్రమకు తీరని లోటని నటుడు పోసాని కృష్ణ మురళీ అన్నారు. ఆయన పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నానన్నారు. మొదటిసారి ఆయనను తన స్వగ్రామంలో చూశానన్నారు. ఆసుపత్రిలో శరత్ బాబు చికిత్స తీసుకుంటున్న సమయంలో ఆరోగ్యంపై ఆరా తీశామని, క్షేమంగా కొలు కుంటారని అనుకున్నా తుది శ్వాస విడిచారన్నారు.

https://twitter.com/KChiruTweets/status/1660646079166128137