జియాఖాన్ ఆత్మహత్య కేసు .. నిర్దోషిగా సూరజ్ పంచోలి

జియాఖాన్ ఆత్మహత్య కేసు .. నిర్దోషిగా సూరజ్ పంచోలి

జియాఖాన్ ఆత్మహత్య కేసులో నటుడు ఆదిత్య పంచోలీ కుమారుడు సూరజ్ పంచోలీ నిర్దోషిగా విడుదలయ్యారు . సూరజ్‌ వల్లే జియాఖాన్‌ ఆత్మహత్యకు పాల్పడిందన్న ఆరోపణలకు తగిన సాక్ష్యాలు లభ్యం కాకపోవడంతో ప్రత్యేక సీబీఐ కోర్టు అతన్ని నిర్దోషిగా ప్రకటించింది.  25 ఏళ్ల జియాఖాన్ 2013లో ముంబైలోని తన ఇంట్లో ఉరి వేసుకుని చనిపోయింది.  అయితే చివరగా  జియా రాసిన ఆరు పేజీల లేఖ ఆధారంగా సూరజ్ పంచోలిని పోలీసులు అరెస్టు చేశారు.   

జియాఖాన్ మృతికి ప్రియుడు సూరజ్ పంచోలీ కారణమని జియా తల్లి రబియా ఖాన్ ఆరోపించారు. 2013 అక్టోబరులో సీబీఐ విచారణ కోరుతూ ఆమె  బాంబే హైకోర్టును ఆశ్రయించింది. తన కూతురిది ఆత్మహత్యకాదని హత్యని ఆమె ఆరోపించారు. దీంతో బాంబే హైకోర్టు ఆదేశాల మేరకు జూలై 2014లో మహారాష్ట్ర పోలీసుల నుంచి ఈ కేసు సీబీఐకి బదిలీ అయ్యింది.  ఈ కేసులో 22 మంది సాక్ష్యులను ప్రాసిక్యూషన్‌ విచారణ చేపట్టింది. గత వారం సీబీఐ స్పెషల్ కోర్టులో ఇరుపక్షాల వాదనలు పూర్తవ్వడంతో తాజగా ఈ కేసులో సీబీఐ కోర్టు తుది తీర్పును వెల్లడించింది. ఈ తీర్పును జియాఖాన్‌ తల్లి రబియా సవాల్‌ చేసే అవకాశం ఉంది.

బాలీవుడ్‌ మెగాస్టార్‌ అమితాబ్‌ బచ్చన్‌ నటించిన ‘నిశబ్ద్‌’తో బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది జియా. ఆమె చేసింది మూడు చిత్రాలే అయినప్పటికీసెన్సేషన్‌గా మారింది. నిశబ్ద్‌తో పాటు అమీర్‌ ఖాన్‌ గజిని, హౌజ్‌ఫుల్‌ లాంటి సక్సెస్‌ఫుల్‌ చిత్రాల్లో జియాఖాన్‌ నటించింది. 2013, జూన్‌ 3న ముంబైలోని తన ఇంట్లో ఉరి వేసుకుని చనిపోయింది