అఖిల్ రాజ్, తేజస్విని జంటగా సాయిలు కంపాటి దర్శకత్వంలో వేణు ఊడుగుల, రాహుల్ మోపిదేవి నిర్మించిన చిత్రం ‘రాజు వెడ్స్ రాంబాయి’. వంశీ నందిపాటి, బన్నీ వాస్ విడుదల చేశారు. మంగళవారం ఈ చిత్రం సక్సెస్ సెలబ్రేషన్స్‌ను నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన హీరో శ్రీ విష్ణు మాట్లాడుతూ ‘మనం నిజాయితీగా పనిచేస్తే దేవుడు విజయాన్ని తప్పకుండా అందిస్తాడు. ఈ టీమ్‌కు అలాంటి విజయాన్ని ఇచ్చాడు. వేణు ఊడుగుల దగ్గర ఇలా మట్టి నుంచి పుట్టిన కథలు చాలా ఉన్నాయి. అవి ఇండస్ట్రీకి అవసరం.
తను డైరెక్షన్ చేస్తూనే ఇలా సాయిలు లాంటి కొత్త దర్శకులతో సినిమాలు చేయించాలని కోరుకుంటున్నా’ అని అన్నారు. డైరెక్టర్ బాబీ టీమ్‌కు శుభాకాంక్షలు తెలిపారు. నిర్మాత వేణు ఊడుగుల మాట్లాడుతూ ‘ఈ సినిమా కోసం అవమానాలు పడ్డాం. రిలీజ్ ముందు ఓ నిర్మాతకు చూపిస్తే తన ఫ్రెండ్స్‌తో వచ్చి ఇంటర్వెల్‌కు చెప్పా పెట్టకుండా వెళ్లిపోయారు. అది మా క్రియేటివిటీని అవమానించడమే. పైగా ఇదేం సినిమా ఆడదంటూ నెగిటివ్ ప్రచారం చేశారు. కానీ ఈరోజు ప్రేక్షకులు మా చిత్రాన్ని గుండెల్లో పెట్టుకున్నారు. సాయిలు తెలుగు ఇండస్ట్రీకి ఒక వెట్రిమారన్, మారి సెల్వరాజ్ అవుతాడు’ అని చెప్పారు. మూవీ టీమ్‌తో పాటు నటులు శివాజీ రాజా, అనితా చౌదరి, రైటర్స్ కోన వెంకట్, బీవీఎస్ రవి, ఈటీవీ విన్ ప్రతినిధులు సాయికృష్ణ, నితిన్, మ్యూజిక్ డైరెక్టర్ సురేష్ బొబ్బిలి, లిరిసిస్ట్ మిట్టపల్లి సురేందర్ తదితరులు పాల్గొన్నారు.
