
తమ సినిమాల్ని ఓటీటీలో రిలీజ్ చేయాలా, థియేటర్‌లో విడుదల చేయాలా అనే డైలమా ఇప్పటికీ చాలామంది నిర్మాతల్లో ఉంది. కానీ సూర్య మాత్రం ఎప్పుడూ కన్‌ఫ్యూజ్ అవ్వలేదు. ‘ఆకాశమే నీ హద్దురా’ చిత్రాన్ని డిజిటల్ రిలీజ్ చేసి సక్సెస్ అయ్యాడు. ఆ నమ్మకంతోనే తాను నిర్మించిన నాలుగు సినిమాలను అమెజాన్ ప్రైమ్‌లో రిలీజ్ చేస్తున్నట్టు నిన్న ప్రకటించాడు. ‘నాలుగు అందమైన కథలు. సెప్టెంబర్ నుంచి మొదలుపెట్టి నెలకొకటి చొప్పున మీ ముందుకు తీసుకొస్తున్నాను. మీ విషెస్, సపోర్ట్ నాకు కావాలి’ అంటూ ట్వీట్ చేశాడు సూర్య. ఆ నాలుగింటిలో మొదట రానున్న చిత్రం ‘రామె ఆండాళుమ్ రావణె ఆండాళుమ్’. రమ్య పాండియన్, వాణీ భోజన్, మురుగన్ వడివేల్ నటించిన ఈ చిత్రాన్ని అరిసిల్ మూర్తి డైరెక్ట్ చేశాడు. సెప్టెంబర్‌లో ఈ చిత్రం రిలీజ్ కానుంది. అక్టోబర్‌లో ‘ఉడన్ పిరప్పే’ వస్తుంది. శశికుమార్, జ్యోతిక లీడ్ రోల్స్ చేయడంతో ఈ మూవీపై మంచి అంచనాలున్నాయి. సూర్య నటిస్తున్న ‘జై భీమ్’ నవంబర్‌లో దీపావళి కానుకగా విడుదలవనుంది. జ్ఞానవేల్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రం తమిళనాడులో జరిగిన రియల్ ఇన్సిడెంట్స్ ఆధారంగా తెరకెక్కుతోంది. గిరిజనుల కోసం పోరాడిన అడ్వకేట్ చంద్రు పాత్రలో సూర్య కనిపించనున్నాడు. ఇక డిసెంబర్‌లో ‘ఓ మై డాగ్’ ప్రేక్షకుల ముందుకు రానుంది. అరుణ్ విజయ్ తన కొడుకు ఆర్నవ్‌తో కలిసి నటించిన ఈ చిత్రానికి సరోవ్ షణ్ముగమ్ దర్శకుడు. బలమైన కథలతో ఫేమస్ ఆర్టిస్టులతో తెరకెక్కుతున్న సినిమాలివి. వీటిని వరుసగా రిలీజ్ చేసి ఓటీటీ ప్రేక్షకులకు పెద్ద ఫీస్టే ఇవ్వనున్నాడు సూర్య.