కంటెంట్ సినిమాలే నా చాయిస్.. అదే నా లైఫ్ టర్నింగ్ సిచ్యుయేషన్: విష్ణు విశాల్

కంటెంట్ సినిమాలే నా చాయిస్.. అదే నా లైఫ్ టర్నింగ్ సిచ్యుయేషన్: విష్ణు విశాల్

ప్రతి ఒక్కరికీ లైఫ్​లో ఒక గోల్ ఉంటుంది. దాన్ని అచీవ్ చేయడానికి ఎంతైనా కష్టపడాలి అనుకుంటాం. కానీ, పరిస్థితులు అనుకూలించకపోతే, గోల్​ వైపు వెళ్లే దారి మూసుకుపోతే? ఏం చేయాలో తోచక ఆగిపోతారు. కానీ, ఆ తర్వాత కెరీర్​, ఫ్యూచర్​ ఏంటి? అనే ఆలోచన వస్తుంది. అప్పుడు దానికి ఆన్సర్ దొరకడానికి చాలా టైం పడుతుంది. ఆ టైంలో తీసుకున్న డెసిషన్​ ఫ్యూచర్​ని డిసైడ్ చేస్తుంది. కాబట్టి నూటికి నూరు శాతం కాన్ఫిడెంట్​గా కష్టపడాలి. కాస్త లేట్ అయినా సక్సెస్​ మనల్ని వెతుక్కుంటూ వస్తుంది. ఈ ఫిలాసఫీని నమ్ముకుని కంటెంట్ సినిమాలు చేస్తూ ఒక్కో మెట్టు ఎక్కుతున్నాడు విష్ణు విశాల్. 

విష్ణు విశాల్ తండ్రి తమిళనాడులో రిటైర్డ్​ ఐపీఎస్ ఆఫీసర్. విశాల్ మార్కెటింగ్​లో ఎంబీఏ పూర్తి చేశాడు. తర్వాత క్రికెటర్​ అవ్వాలనే కోరికతో టీఎన్​సీఎ లీగ్ గేమ్స్ ఆడాడు. అనుకోని సంఘటనల వల్ల క్రికెట్ కెరీర్​కు గుడ్ బై చెప్పాల్సి వచ్చింది. ఆ టైంలో సినిమాలు ఎక్కువగా చూశాడు. దాంతో తనకు యాక్టింగ్ మీద ఇంట్రెస్ట్​ వచ్చింది. వాళ్ల అంకుల్ హిందీ సినిమాల్లో చిన్న యాక్టర్. ఆయన విశాల్​కు ఇండస్ట్రీ గురించి చెప్పాడు. ఇండస్ట్రీకి వచ్చాక స్క్రీన్​ నేమ్​గా తను పుట్టినప్పుడు పెట్టిన పేరు విష్ణును విశాల్​కి ముందు చేర్చుకున్నాడు.

2022లో ‘ఎఫ్​ఐఆర్​’ అనే సినిమాలో ముస్లిం క్యారెక్టర్ చేశాడు. అయితే అందులో తన పాత్ర కాంట్రవర్సీ కావడంతో మలేసియా, కువైట్, కతార్​లలో సినిమాను బ్యాన్ చేశారు. మన దగ్గర మాత్రం తన యాక్టింగ్‌కి మంచి పేరొచ్చింది. అదే ఏడాది ‘గట్టా కుస్తీ’ అనే ఫ్యామిలీ ఎంటర్​టైనర్​ తీశాడు. తనే ప్రొడ్యూసర్​ కావడంతో హీరో రవితేజ కో ప్రొడ్యూసర్​గా ‘మట్టి కుస్తీ’ పేరుతో తెలుగులో రిలీజ్ చేశారు. ఈ సినిమా రెండు భాషల్లోనూ మంచి టాక్ తెచ్చుకుంది. రజనీకాంత్ కూతురు డైరెక్ట్ చేసిన ‘లాల్​ సలామ్​’లో నటించాడు. అలా కొన్ని సినిమాల్లో నటిస్తూ, కొన్నింటికి ప్రొడ్యూసర్​గానూ వ్యవహరిస్తున్నాడు. త్వరలో ‘మట్టి కుస్తీ 2’ రాబోతుంది. 
‘‘‘అరణ్య’ సినిమాలో రానా చనిపోయాక అడవిని కాపాడేది నేను. అయితే, సినిమా రిలీజ్​కి ముందు నా సెకండాఫ్​ పోర్షన్ కట్ చేశారని తెలిసింది. ‘రాక్షసన్’ సిని మా తర్వాత ఒక ఇంటర్వ్యూ ఇస్తుండగా నాకు ఈ విషయం తెలిసింది. అప్పుడు కూడా నేను ఇంటర్వ్యూ కంటిన్యూ చేశాను. ఐదు రోజులు ప్రొమోషన్స్​లో పార్టిసిపేట్ చేశాను. ఆ విషయం గురించి ఇప్పటికీ డైరెక్టర్​ నాతో చెప్పలేదు. నేను ఆయన్ని అడగలేదు”అని ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు. 

క్రికెటర్ అవ్వాలనుకున్నా

చిన్నప్పటినుంచి నేను ఐపీఎస్​ కొడుకులానే పెరిగా. మా సిస్టర్​ బిట్స్ పిలానీలో ఇంజనీరింగ్ చేసింది. తనే నాకు ఎలా చదవాలో గైడెన్స్ ఇచ్చేది. అలా నాకు మంచి మార్కులు వచ్చేవి. అయితే, పదమూడేండ్ల వయసు నుంచే క్రికెట్ మీద ఇంట్రెస్ట్ ఉండడంతో క్రికెటర్ అవ్వాలనుకున్నా. కానీ, కాలు ఇంజూరీ అయినప్పుడు తిరిగి నేను క్రికెట్​ ఆడే అవకాశం లేదు. అప్పుడే యాక్టింగ్ మీద ఇంట్రెస్ట్ వచ్చింది. ఏదైనా సాధించాలి అనుకుంటే మధ్యలో వదిలేయకూడదు అని అప్పుడే నిర్ణయించుకున్నా. మా నాన్న నా కోసం ప్రొడ్యూసర్​ దగ్గరికి వెళ్లి అవకాశం అడిగారు. ఇండస్ట్రీలోకి వెళ్తానంటే ఎవరైనా ఇలా చేస్తారా? అనిపిస్తుంటుంది. ఇప్పుడు ఆయనే నా ప్రొడక్షన్ చూసుకుంటున్నారు. 

►ALSO READ | గడ్డివాముకి కుక్క కాపలా.. స్వార్థం ఉంటే ఆకలితో మాడాల్సిందే.. ఎద్దు.. కుక్క కథ

యాక్టింగ్ కాకపోతే

యాక్టింగ్​లోకి రాకపోతే ఇంకేం చేయాలో కూడా నాకు తెలీదు. ఇన్నాళ్లకు నేను ఇండస్ట్రీ వ్యక్తిని అనిపిస్తుంది. ఎందుకంటే ఆడియెన్స్​కి ఒక సినిమాలో కాకపోతే మరో సినిమాతో కనెక్ట్ అవుతాం. వాళ్లకు నచ్చితే యాక్టర్​ని సెలబ్రేట్ చేయడానికి రెడీగా ఉంటారు. అయితే, దానికంటే ముందు ఇండస్ట్రీ యాక్సెప్ట్ చేయాలి. ప్రొడ్యూసర్, స్టార్స్ ఎవరైనా యాక్టర్​గా గుర్తించి సెలబ్రేట్ చేయడం ఇంపార్టెంట్. ‘ఎఫ్ఐఆర్’ తర్వాతే ఇండస్ట్రీ నన్ను గుర్తించింది. అప్పటిదాకా ఎన్ని మంచి సినిమాలు చేసినా, ఇండస్ట్రీ హిట్స్ ఇచ్చినా నన్ను ఇండస్ట్రీలో ఎవరూ దగ్గరకి తీసుకోలేదు. అప్పుడు చాలా బాధ అనుభవించా. ఇప్పుడు చేసే ప్రాజెక్ట్స్ చూసి ఇండస్ట్రీ మొత్తం రియలైజ్ అవుతోంది. నేను చేస్తుంది కరెక్ట్ అని నన్ను ఆదరిస్తుందనే నమ్మకం బలంగా ఉంది. 

లైఫ్​ టర్నింగ్ సిచ్యుయేషన్

ఒక అమ్మాయిని కాలేజీ టైంలో ప్రేమించా. నాలుగేండ్లు రిలేషన్​షిప్​లో ఉన్నాం. పెండ్లి చేసుకుందాం అనుకునే టైంకి ఆమెకి క్యాన్సర్ ఉందని తెలిసింది. ఆమెకి సరైన ట్రీట్​మెంట్ అందాలని మా నాన్న తన ఇన్​ఫ్లుయెన్స్​ ఉపయోగించి వైద్యం చేయించారు. నేను అప్పటికే రెండు సినిమాలు డిజాస్టర్ అయి కెరీర్​లో కూడా డౌన్​లో ఉన్నాను. తనకు మంచి ట్రీట్​మెంట్ ఇవ్వాలని, మా నాన్నలా అందరూ గుర్తించే పొజిషన్​కి వెళ్తే మనవాళ్లని కాపాడుకోవచ్చు అనిపించింది. అప్పుడు నేను చేయగలిగింది ఒక్కటే మంచి సినిమాలు చేసి ఒక స్థాయికి వెళ్లాలని, అందుకోసం చాలా కష్టపడ్డాను. పెండ్లి చేసుకున్నాక తనకు ఆరునెలలకు ఒకసారి ట్రీట్​మెంట్ ఇప్పించేవాళ్లం. పర్సనల్, ప్రొఫెషనల్​గా చాలా క్లిష్ట పరిస్థితుల్ని ఎదుర్కొన్నా. అయితే, నా కెరీర్​లో బిజీగా ఉండడం వల్ల తనని పట్టించుకోవట్లేదని ఫీలయింది. కానీ, నేను అంత కష్టపడేది తనకోసమే అని అర్థం చేసుకోలేకపోయింది. అప్పడు ‘రాక్షసన్’ రూపంలో నాకు బిగ్ హిట్ వచ్చింది. దాన్ని ఎంజాయ్ చేసేలోపే మాకు విడాకులయ్యాయి. పెండ్లి చేసుకునేటప్పుడు నేను, నా ఫ్యామిలీ ఎప్పటికీ తోడుంటాం అని చెప్పాను. కానీ అది ఇలా ఎండ్ అవుతుందని ఊహించలేదు. ఇప్పుడు మా నాన్న రిటైర్ అయ్యారు. మా ఇంట్లో నేను మాత్రమే సంపాదిస్తున్నాను. లైఫ్ అంటే ఇలా ఉంటుంది. నేను ముందుకు వెళ్లాలి అని డిసైడ్ అయ్యాను. ఇప్పటికీ డిప్రెషన్​ నుంచి బయటికి రాలేదు. జ్వాలా నా లైఫ్​లోకి వచ్చినప్పుడు కూడా లవ్, మ్యారేజ్ మీద ఇంట్రెస్ట్ లేదని చెప్పాను. ఆ తర్వాత ఇద్దరం పెండ్లి చేసుకున్నాం. ఇప్పుడు నా మొదటి భార్యతో కూడా మంచి రిలేషన్​ ఉంది. 

పాత్ర కోసం..

‘వెన్నిల కబడ్డీ కుళు’ అనే సినిమాలో అవకాశం. అది స్పోర్ట్స్ డ్రామా కావడంతో కబడ్డీ ఆడాల్సి ఉంటుంది. అందుకోసం మూడు నెలలు ట్రైనింగ్ తీసుకున్నాడు. తెల్లగా ఉన్న తన బాడీ నల్లగా మారాలని గంటలు గంటలు ఎండలో కూర్చునేవాడు. రోజుకు ఐదు గంటలు కబడ్డీ శిక్షణ తీసుకునేవాడు. ఆ సినిమా రిలీజ్​ అయి పాజిటివ్ రివ్యూస్ అందుకుంది. విజయ్ అవార్డ్స్​కు కూడా బెస్ట్ డెబ్యూ యాక్టర్​గా నామినేట్ అయ్యాడు. ఆ తర్వాత మరో సినిమా ‘ద్రోహి’లో ఒక పాత్ర కోసం15 కిలోలు బరువు పెరిగాడు. ఇలా పాత్రల కోసం ఏం చేయడానికైనా రెడీగా ఉంటాడని నిరూపించుకున్నాడు. ఇటు యాక్షన్​ సినిమాల్లో నటిస్తూనే కామెడీ కూడా చేస్తుంటాడు. ‘ఇంద్రు నేత్రు నాలై’ అనే సైన్స్ ఫిక్షన్ కామెడీ​ మూవీలో నటించాడు. ఆ మూవీ సూపర్ హిట్ కావడంతో మరింత ఫేమ్ సంపాదించుకున్నాడు. 

స్క్రిప్ట్స్​ సెలక్షన్

అవకాశం వచ్చిందని చేసుకుంటూ వెళ్లిపోలేదు. ఎంపిక చేసుకోవడంలో చాలా జాగ్రత్తగా ఉంటాను. అన్ని రకాల జానర్స్​ చేయగలను అని నిరూపించడానికి ఈ టైంలో ఏ స్క్రిప్ట్​ అవసరం అని ఆలోచిస్తాను. ప్రొడ్యూసర్​గా కూడా నేను చాలా కాన్ఫిడెంట్​గా స్క్రిప్ట్స్​ సెలక్ట్ చేసుకుంటాను. ఇప్పటివరకు నాకు పెద్ద డైరెక్టర్​తో పనిచేయాలనే ఆలోచన లేదు. యాక్టర్​గా స్లోగా ఉన్నా, ప్రొడ్యూసర్​గా చాలా స్పీడ్​గా పనిచేస్తా. సినిమా నా నుంచి చాలా తీసుకుంది. నాకు తిరిగి చాలా ఇచ్చింది. ఇప్పుడు నేను ఎంతోమందికి అవకాశాలు ఇచ్చే పొజిషన్​లో దేవుడు నన్ను ఉంచాడు అనిపిస్తుంటుంది. నేను నమ్మిన కంటెంట్ బేస్డ్ మూవీలు చాలామంది ప్రొడ్యూసర్స్ రిజెక్ట్ చేశారు. సరైన ప్రొడ్యూసర్​ దగ్గరకు వెళ్లడం సవాలుగా ఉండేది. ఆ సినిమాలు సక్సెస్ అయ్యాక, నా కంటెంట్ ఆడియెన్స్​కి నచ్చుతుంది. కాబట్టి నేనే ప్రొడక్షన్ స్టార్ట్ చేయాలి అనుకున్నా. ఇప్పుడు ఓటీటీ వచ్చాక కంటెంట్​ ఉంటేనే జనాలు చూస్తున్నారు. నాకు టైం వచ్చింది అనిపిస్తుంది.