ఏదైనా సరే, నాకు అవుటాఫ్ ది బాక్స్ పని చేయడం ఇష్టం

ఏదైనా సరే, నాకు అవుటాఫ్ ది బాక్స్ పని చేయడం ఇష్టం

ఆకాశం లాంటి చిరునవ్వు. కళ్లకు తాళాలేసే కర్లీ హెయిర్. హృదయాల్లో నిలిచిపోయే యాక్టింగ్. ఒక హిట్ తర్వాత ఇంకో హిట్. అలా... అన్నా బెన్ నెమ్మదిగా మలయాళీల గుండెల్లో స్పెషల్ ప్లేస్ సొంతం చేసుకుంది. ‘కుంబలంగి నైట్స్’, ‘హెలెన్’, ‘కప్పేళ’, ‘సారా’స్’  ‘నారదన్’  వంటి మలయాళం సినిమాల్లో బోల్డ్ క్యారెక్టర్స్ చేసి,  టాలెంటెడ్ యాక్ట్రెస్​గా ప్రూవ్ చేసుకుంది. అవి ఓటీటీకి వచ్చాక... ఆమె  టాలెంట్ కేరళ నుంచి ప్రపంచం మొత్తం వ్యాపించింది. ‘ఏదైనా సరే, నాకు అవుటాఫ్ ది బాక్స్ పని చేయడం ఇష్టం’ అంటున్న 26 ఏండ్ల యాక్ట్రెస్  అన్నా బెన్ జర్నీ ఇది...

‘‘నా రోల్స్ చాలా జాగ్రత్తగా ఎంచుకుంటా.  నా కెరీర్ ఇంకా మొదటి దశలోనే ఉంది. అందుకే నేను ఈ రంగంలో చేయాల్సిన లాంగ్ జర్నీ గురించి ఆలోచిస్తున్నా. ఒక్కో డైరెక్టర్​కి, ఒక్కో స్టైల్ ఉంటుంది. ప్రతి సెట్ డిఫరెంట్​గా ఉంటుంది. ప్రతి సినిమాకు మనం నేర్చుకునేవి, నేర్చుకోకూడనివి...అని రెండు విషయాలు ఉంటాయి. నన్ను నేను మెరుగుపరుచుకోవడానికి ఈ సూత్రాన్నే ఫాలో అవుతుంటా. ఈ ఏడాది మార్చిలో ‘నారదన్’, ‘నైట్ డ్రైవ్’ రిలీజ్ అయ్యాయి. ఈ రెండు సినిమాలు నాకు మంచి పేరు తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం డైరెక్టర్ రంజన్ ప్రమోద్​తో ఒక యాక్షన్ థ్రిల్లర్ మూవీ చేస్తున్నా. ఇందులో స్టంట్స్, కిక్ బాక్సింగ్ చేయడానికి రెండు నెలలు ట్రైనింగ్ కూడా తీసుకున్నా. దీంతో పాటు ‘ఎన్నిట్టు అవసనం’ అనే ప్రాజెక్టు షూటింగ్ జరుగుతోంది.

‘నారదన్’ హోం వర్క్

మొన్న మార్చిలో  వచ్చిన పొలిటికల్ థ్రిల్లర్ ‘నారదన్’ లో లాయర్ పాత్ర నన్ను గ్లోబల్ ఆడియెన్స్​కి ఇంకా దగ్గర చేసింది.  నిజానికి ఆ రోల్ చేయడం చాలా కష్టం అనిపించింది. ఆ క్యారెక్టర్​ చాలా డిఫరెంట్​గా ఉంటుంది. ఆమెది చాలా పవర్​ఫుల్ పర్సనాలిటీ. అంతకుమించి ఆ క్యారెక్టర్​ స్క్రీన్ టైం చాలా తక్కువ. ఆ తక్కువ టైంలోనే ఆమె ఎవరో ప్రేక్షకులకు అర్థమయ్యేలా నటించడం ఒక ఛాలెంజ్. ఇలాంటి పాత్ర చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. లాయర్ పాత్ర కాబట్టి డైలాగ్ పార్ట్ కూడా చాలా పెద్దగా ఉంటుంది. అంతకుముందు చేసిన సినిమాల్లో డైలాగ్స్ పెద్దగా ఉంటే... డైరెక్టర్స్, రైటర్స్ దగ్గరకు వెళ్లి,  లైన్స్ చిన్నవిగా చేయించుకునేదాన్ని. ఈ సినిమాలో అది కుదరలేదు. అందుకే వాటికోసం నేను చాలా హోంవర్క్ చేయాల్సి వచ్చింది. నేను అనుకున్నది పర్ఫెక్ట్​గా వచ్చేవరకు నాకు సంతృప్తి ఉండదు. అందుకే, నేను ఆ లైన్స్ అన్నీ రాసుకొని, నేర్చుకున్న తర్వాతే మూవీ సెట్​లో అడుగుపెట్టేదాన్ని.

ఫ్యామిలీ అంతా ఆర్టిస్టులే

మా ఫ్యామిలీ అంతా ఆర్టిస్టులే. చిన్నప్పటి నుంచి ఆ వాతావరణంలో పెరిగా. నాన్న బెన్నీ పి. నయరంబలం, అమ్మ ఫుల్జా. నాన్న స్క్రిప్ట్ రైటర్. ‘ఆకాశ గంగ’  ‘కళ్యాణరామన్’ ‘ చొట్ట ముంబై’ వంటి సూపర్ హిట్ సినిమాలకు పని చేశాడు. నాన్న రాసిన సినిమాల్లో ‘కళ్యాణరామన్’ నా ఫేవరెట్ మూవీ.  నాన్నతో కలిసి చిన్నప్పుడు సెట్స్​కి వెళ్తుండేదాన్ని. అప్పుడు నాకు ఎలాంటి  బాధ్యత లేకపోవడం వల్ల కావచ్చు, సెట్స్ చాలా సరదాగా అనిపించేవి.  బహుశా ఆ ఎక్స్​పీరియెన్స్​ వల్లే ఇప్పుడు నేను సెట్స్​లో రిలాక్స్​డ్​గా ఉండగలుగుతున్నా. మా అమ్మ డ్రాయింగ్ వేస్తుంది. చెల్లి సంగీతం వైపు ఉంది. కూడా డ్రాయింగ్ వేస్తా. యాక్టింగ్​లోకి రాకముందు... నేను కొచ్చిలోని సెయింట్ థెరిసా కాలేజీలో గ్రాడ్యుయేషన్ లో ఫ్యాషన్ డిజైనింగ్ కోర్సు చేశా. పోస్టు గ్రాడ్యుయేషన్​ చేయాలనే కోరిక ఉంది. కొవిడ్ వల్ల రెండేండ్లు ఖాళీగా వెళ్లి పోయాయి. ఇప్పుడేమో సినిమాల బిజీ షెడ్యూల్ వల్ల టైం దొరకడం లేదు. వదుతలలో ఉన్న చిన్మయ విద్యాలయంలో స్కూల్​ చదువు పూర్తి చేశా. స్కూల్ డేస్​లోనే  స్క్రిప్ట్ రాస్తుండేదాన్ని. స్క్రిప్ట్ రాయడమనేది ప్రస్తుతం నేను చేస్తున్న పనికి పూర్తిగా భిన్నమైంది. ఫ్యూచర్​లో రాస్తానేమో తెలియదు. కానీ, ఇప్పుడు రాయడానికి మాత్రం నేను రెడీగా లేను. మంచి యాక్టర్​గా పేరు తెచ్చుకోవాలనేది నా లక్ష్యం

మొదటి అవకాశం కుంబలంగి

సినిమా ఇండస్ట్రీతో పరిచయం ఉన్న ఫ్యామిలీయే అయినా సినిమా అవకాశం అంత ఈజీగా రాలేదు.  ప్రణవ్ మోహన్​లాల్ నటించిన ‘ఇరుపతియొన్నాం నూట్టాండు’ సినిమాకు మొదటిసారి ఆడిషన్​కి వెళ్లా. కానీ, అందులో ఛాన్స్ రాలేదు. తర్వాత ‘కుంబలంగి నైట్స్’ ఆడిషన్​కి వెళ్లా. నాలుగు రౌండ్లు పూర్తయ్యాక నేను సెలక్ట్ అయ్యానని చెప్పారు. అప్పుడు చాలా టెన్షన్ పడ్డా.  కుంబలంగిలో నేను చేసిన బేబీమోల్ క్యారెక్టర్ వ్యక్తిగతంగా నా క్యారెక్టర్​కి  కొంచెం దగ్గరగా ఉంటుంది. అందుకే, దాన్ని చెయ్యడం చాలా ఈజీ అయింది.  సినిమాల్లోకి రాకముందు మ్యూజిక్ వీడియోల్లో చేసేదాన్ని. కెమెరా ఫేస్ చేయడానికి నాకది చాలా ఉపయోగపడింది. నా సెకండ్ మూవీ ‘హెలెన్’  మాత్రం చాలెంజింగ్​గా అనిపించింది. ఈ సినిమా షూటింగ్​ ఫ్రీజర్​లో చేశాం. అలా షూటింగ్ చేయడం చాలా కష్టం. ఒకరకంగా చెప్పాలంటే రిస్క్ తీసుకున్నాం. కానీ, షూటింగ్​ జరిగినంతసేపు సెట్​లో డాక్టర్లను ఉన్నారు. దానివల్ల సేఫ్ గా ఫీలయ్యాం. అలా టీమ్ ఎఫర్ట్స్ వల్ల ‘హెలెన్’ పెద్ద సక్సెస్ అయింది. తర్వాత చేసిన  ‘కప్పేళా’ మూవీకి  కేరళ స్టేట్ ఫిల్మ్ అవార్డ్స్​లో బెస్ట్ యాక్ట్రెస్ అవార్డు అందుకున్నా.

పాత్రకి ప్రాణం పోసి...

‘కుంబలంగి నైట్స్’ సక్సెస్ అయ్యాక, నా బాధ్యత పెరిగింది. అప్పటి నుంచి ఏ రోల్  ఒప్పుకున్నా, హోమ్ వర్క్ చేయడం ఒక అలవాటుగా చేసుకున్నా. కానీ, ఎప్పుడూ ఒకేలా, మూస పద్ధతిలో ఉండే క్యారెక్టర్స్ చేయడం ఇష్టం ఉండదు. డిఫరెంట్ క్యారెక్టర్స్ చేయాలి.  స్క్రిప్ట్ బాగుంటే, ఏ రోల్ చేయడానికైనా నేను రెడీ. నేను మెథడ్ యాక్టర్​ని కాదు. నేను ఎన్ని విధాలుగా చెయ్యగలనో, అన్ని విధాలుగా నా క్యారెక్టర్ చేయడానికి ప్రయత్నిస్తా. డ్రామా కంటే కూడా... ఆ క్యారెక్టర్​ నిజజీవితంలో అయితే ఎలా ఉంటుందో... అలానే ఆ క్యారెక్టర్​కి ప్రాణం పోసే ప్రయత్నం చేస్తా.  ఉదాహరణకు ‘కప్పేళా’ చేస్తున్నప్పుడు... నేను లొకేషన్​కి వెళ్లగానే, ఆ సినిమా తాలూకు మూడ్, పల్లెటూరి వైబ్ నాకు వచ్చేవి. అలా, జెస్సీ పాత్రలోకి ఈజీగా వెళ్లిపోయేదాన్ని.

 స్క్రిప్టే  ముఖ్యం

‘కుంబలంగి నైట్స్’, ‘హెలెన్’, ‘కప్పేళా’  నేను మొదట చేసిన ఈ మూడు సినిమాలు డెబ్యూ డైరెక్టర్స్​తోనే చేశా. అందుకని ‘మీరు డెబ్యూ డైరెక్టర్స్​తోనే చేస్తారా?’ అని అడిగేవాళ్లు. అలా అంటే నేను కూడా ఇండస్ట్రీకి కొత్తే! నిజానికి నేను స్క్రిప్ట్ వినడాన్ని చాలా ఎంజాయ్ చేస్తా. నేను చేసిన అన్ని సినిమాల్లోనూ స్క్రిప్ట్స్ మాత్రమే హైలైట్​. వాళ్లు స్టోరీ నెరేట్ చేసిన విధానాన్ని బట్టే, నా క్యారెక్టర్​ను యాక్సెప్ట్ చేస్తా.

ట్రోల్స్ పట్టించుకోను

‘కుంబలంగి నైట్స్’ లో బెబీ మోల్, తరువాత చేసిన ‘హెలెన్’  క్యారెక్టర్​ల మీద చాలామంది మీమ్స్ , ట్రోల్స్ చేశారు. వాటన్నింటినీ క్యారెక్టర్స్​కి వచ్చిన గుర్తింపుగానే తీసుకున్నా. ఇన్​స్టాగ్రామ్​లో కూడా నాకు నెగెటివ్ కామెంట్స్ వస్తుంటాయి. అవేవీ నేను పట్టించుకోను. ఒకవేళ వాటిని పట్టించుకుంటే పాజిటివ్​గా ఉండలేం!

 ఆ భయం ఉంటుంది

‘నువ్వు ఇప్పటి వరకు చేసిన రోల్స్ చాలా బాగున్నాయ్’ అని ఎవరైనా అంటుంటే.. ముందుముందు నేను చేయబోయే క్యారెక్టర్స్ వాళ్లకు నచ్చుతాయో? లేదో అనే భయం లోలోపల ఉంటుంది. కానీ మంచి స్క్రిప్ట్స్ వస్తున్నప్పుడు, ఆ క్యారెక్టర్స్​ను భయం లేకుండా చేయాలి. ఒకవేళ కానీ భయపడితే... చేతిలో ఉన్న సినిమాలు బాగా చేయలేకపోతే, తర్వాత వచ్చే సినిమాలు కూడా చేయలేం. 

నా స్పేస్​లో ఎప్పుడూ ప్రయోగాలు చేయడానికి ఇష్టపడతా. ఏదైనా సరే  అవుటాఫ్ ది బాక్స్ చేయడమంటే చాలా ఇష్టం. ‘సారా’స్’ లో చేసిన సారా రోల్​ను చాలామంది తమ జీవితంతో పోల్చుకున్నారు. పెళ్లయిన  తర్వాత పేరెంట్స్ నుంచి మొదలుపెడితే చుట్టాలు, పొరుగువాళ్ళ వరకు...  ప్రెగ్నెన్సీ ప్లాన్స్‌‌‌‌‌‌‌‌పై అడిగే  ప్రశ్నలు, సమస్యలమీద ఈ సినిమా ఉంటుంది. ప్రెగ్నెన్సీ ఎంచుకోవడానికి అమ్మాయికి స్వేచ్ఛ ఉంటుందని మెసేజ్ ఇచ్చిన సారా క్యారెక్టర్​కి చాలామంది రిలేట్ అయ్యారు. నాకు ఫోన్​ చేసి మరీ వాళ్ల ఎక్స్​పీరియెన్స్​లను చెప్పారు. ఈ మూవీలో సారా కలలకు రెక్కలు ఇస్తుంది నాన్న పాత్ర. సినిమాలో ‘మీ నాన్నే, నాన్న రోల్ చేయబోతున్నాడ’ని డైరెక్టర్ జూడ్ ఆంథోని జోసెఫ్ చెప్పినప్పుడు చాలా ఎగ్జైట్ ఫీల్​ అయ్యా. నాన్న, నేను ఇద్దరం కలిసి నటించడం ఎప్పటికీ మర్చిపోలేని జ్ఞాపకం. రియల్ లైఫ్​లో కూడా మా పేరెంట్స్ ‘మేం చెప్పినట్టే ఉండాల’ని నన్ను బలవంత పెట్టలేదు. వాళ్లు అలా ఉండటం వల్లనే నేను సొంతంగా నిర్ణయాలు తీసుకోగలుగుతున్నా.

ఇంకేంఆలోచించడం లేదు

మలయాళీ ప్రేక్షకులే కాకుండా మిగతా భాషల ప్రేక్షకులకి నా వర్క్ చేరడానికి కారణం ఓటీటీ ప్లాట్​ఫామ్సే. అలాగని స్పాట్ లైట్​లో ఉండటం కోసం నా మీద నేను ఒత్తిడి పెంచుకోను. పాన్ ఇండియా లెవల్​లో మూవీ ఆడటం అనేది గొప్ప విషయం. సరిహద్దులు చెరిపేసి దక్షిణాది సినిమాలు రాణిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ‘నీది పాన్ ఇండియా రాడర్’ అని నన్ను పొగిడినా పట్టించుకోను. నా దృష్టి అంతా నేను చేస్తున్న పనిమీదే ఉంటుంది. అంతకు మించి ఇంకేం ఆలోచించను.’’

చికెన్ బిర్యానీ ఇష్టం

మా నాన్న, ఫ్యామిలీ కాకుండా ఇంకొందరు ఫ్రెండ్స్ ఉన్నారు. నేను ఏ సినిమా చేసినా.. రిలీజ్ అయ్యాక వాళ్ల దగ్గర ఒపీనియన్ తీసుకుంటా. ఎక్కడ తప్పు చేశా. ఎక్కడ మెరుగుపడాలో తెలుసుకునేందుకు వాళ్లు చెప్పే మాటలు చాలా ఉపయోగపడతాయి. మేమందరం కలిస్తే సినిమాల గురించి కాసేపు మాట్లాడుకుంటాం. ఆ తర్వాత మిగతా జీవితం గురించి, మారుతున్న పరిస్థితుల గురించి... అన్ని విషయాలు డిస్కస్​ చేస్తాం. ఫుడ్​ విషయానికి వస్తే నాకు చికెన్ బిర్యానీ అంటే చాలా ఇష్టం. అది కూడా ఫ్యామిలీ అందరితో కలిసి తినడమంటే ఇంకా ఇష్టం!

::: గుణ