సీనియర్ నటి జమున (86) కన్నుమూత

సీనియర్ నటి జమున (86) కన్నుమూత

సీనియర్ నటి జమున (86) కన్నుమూశారు. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె.. హైదరాబాద్‌లోని తన స్వగృహంలో తుదిశ్వాస విడిచారు. ఉదయం 11 గంటలకు జమున భౌతిక కాయాన్ని   ఫిలింనగర్ ఛాంబర్ కు తీసుకురానున్నారు.

నేపథ్యం

1936 ఆగస్ట్ 30న హంపిలో జమున జన్మించారు. తల్లిదండ్రులు నిప్పని శ్రీనివాసరావు, కౌసల్యాదేశి. తండ్రి వ్యాపార రీత్యా.. జమున బాల్యమంతా గుంటూరు జిల్లా దుగ్గిరాలలో గడిచింది. జమున తల్లి ఆమెకు శాస్త్రీయ సంగీతం, హార్మోనియంలలో శిక్షణ ఇప్పించారు. అంతే కాదు మా భూమి అనే నాటకంలోనూ జమున కీలక పాత్ర పోషించి, అందర్నీ మెప్పించారు. అలా ఆమె అభినయం నచ్చి 16 ఏళ్ల వయసులోనే పుట్టిల్లు (1953) అనే సినిమాలో ఆమెకు నటిగా అవకాశం వచ్చింది. ఈ సినిమాతోనే ఆమె సినీ ఇండస్ట్రీకి పరిచయమయ్యారు. సీనియర్ ఎన్టీఆర్, అక్కినేని, జగ్గయ్య వంటి అలనాటి అగ్రహీరోల సరసన నాయికగా నటించిన జమున...  తనకంటూ ఓ ఇమేజ్ ను సొంతం చేసుకున్నారు. సత్యభామా కలాపంతో ప్రేక్షక జన హృదయాల్లో జమున నిలిచిపోయారు.  అలా అంచలంచెలుగా ఎదిగి తెలుగు, కన్నడ, తమిళ, హిందీ భాషల్లో కలిపి ఆమె 198 సినిమాల్లో నటించారు.

వ్యక్తిగత జీవితం

1965లో జూలూరి రమణారావును జమున వివాహం చేసుకున్నారు. ఆయన శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయంలో జువాలజీ ప్రొఫెసర్ గా పనిచేశారు. 2014 నవంబరు 10లో రమణారావు గుండెపోటుతో మరణించారు. కాగా జమున, రమణారావు దంపతులకు కుమారుడు వంశీకృష్ణ, కూతురు స్రవంతి ఉన్నారు. వారు ప్రస్తుతం హైదరాబాద్ లో ఉంటున్నారు.

నటించిన సినిమాలు..

బంగారు పాప, వద్దంటే డబ్బు, దొంగ రాముడు, సంతోషం, మిస్సమ్మ, తెనాలి రామకృష్ణ, చిరంజీవులు, చింతామణి, భాగ్యరేఖ, మా ఇంటి మహాలక్ష్మి, గులేబకావళి కథ, గుండమ్మ కథ, పూజాఫలం, బొబ్బిలి యుద్ధం, దొరికితే దొంగలు, కీలు బొమ్మలు, తోడు నీడ, శ్రీకృష్ణ తులాభారం, వినాయకచవితి, లేత మనసులు, చదరంగం లాంటి మంచి సినిమాల్లో నటించి గొప్ప పేరు కూడగట్టుకున్నారు. ఆమెకు బాగా గుర్తింపు తెచ్చిన పాత్ర సత్యభామ. ఆ పాత్రలో ఆమెను తప్ప ఇంకెవరినీ ఊహించుకోలేమన్నట్టుగా జమున జీవించారు. మిస్సమ్మ సినిమా జమున సినీ కెరీర్‌కు మంచి టర్నింగ్ పాయింట్‌ అని చెప్పవచ్చు. కాగా ఆమె నటించిన చివరి చిత్రం రాజపుత్ర రహస్యం.

అవార్డులు

  • 1968: ఉత్తమ సహాయ నటిగా ఫిలింఫేర్ అవార్డు - మిలన్
  • 1964: ఉత్తమ సహాయ నటిగా ఫిలింఫేర్ అవార్డు - మూగ మనసులు
  • 2008: ఎన్.టి.ఆర్ జాతీయ పురస్కారం
  • 2021 సెప్టెంబర్ 17న హైదరాబాద్‌లోని జేఆర్‌సీ కన్వెన్షన్‌ హాలులో జరిగిన సాక్షి మీడియా 2019, 2020 ఎక్స్‌లెన్స్‌ అవార్డుల కార్యక్రమంలో జమున జీవితసాఫల్య పురస్కారం అందుకున్నారు.

రాజకీయాల్లోనూ..

జమున 1980లో కాంగ్రెస్ పార్టీలో చేరారు. రాజమండ్రి నియోజకవర్గం నుంచి 1989లో లోక్ సభకు ఎంపిగా ఎన్నికయ్యారు. ఆ తరువాత రాజకీయల నుండి తప్పుకున్నా.. 1990లో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) తరపున ప్రచారం చేశారు.