
హీరోయిన్ పూనమ్ కౌర్ మరోసారి తనదైన పోస్టుతో బయటకి వచ్చింది. డైరెక్టర్ త్రివిక్రమ్ ను ఉద్దేశిస్తూ సంచలన పోస్ట్ చేసింది. పలుమార్లు కంప్లైంట్ ఇచ్చినప్పటికీ అతనిపై చర్యలు ఎందుకు తీసుకోవడం లేదంటూ మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (MAA)ను ప్రశ్నించింది.
ఈ మేరకు తన ఇంస్టాగ్రామ్ స్టోరీలో ఓ నోట్ రాసింది. మూవీ ఆర్టిర్ట్స్ అసోసియేషన్ లోని లైంగిక వేధింపుల నిరోధక కమిటీ సభ్యురాలైన నటి ఝాన్సీతో టచ్ లోనే ఉన్నట్లు ఆమె ఓ ఆధారాన్ని కూడా ఈ సందర్భంగా స్టోరీలో బయటపెట్టింది.
పూనమ్ కౌర్ మాటల్లోనే.. “నేను ఈ విషయాన్ని గతంలోనూ చెప్పాను.. ఇప్పుడూ చెబుతున్నాను. నేను ఈమెయిల్ ద్వారా ఫిర్యాదు చేశాను. ఝాన్సీగారితోనూ మాట్లాడాను. నాతో మాట్లాడతానని చెప్పిన ఆమె ఆ తర్వాత ఆలస్యం చేస్తోంది. తనను డిస్టర్బ్ చేయొద్దని, ఇబ్బంది పెట్టవద్దని అంటోంది. నేను ఎవరి పేరూ చెప్పలేని అంటున్నారు. కానీ నేను త్రివిక్రమ్ శ్రీనివాస్ పై ఫిర్యాదు చేశానని స్పష్టంగా చెబుతున్నాను. అతన్ని రాజకీయ నేతలు, ఇండస్ట్రీలోని ఎంతో మంది కాపాడుతున్నారు. నేను మహిళా సంఘంతో మాట్లాడతాను” అని పూనమ్ ఇన్‌స్టా స్టోరీస్లో ఓ పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
గతంలో కూడా పలుమార్లు పూనమ్ కౌర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ తోపాటూ మరో పొలిటీషియన్, హీరోపై సోషల్ మీడియాలో విమర్శలు చేసింది. అయితే, ఈ సారి తన వద్ద ఆధారాలు ఉన్నాయంటూ ఝాన్సీతో చాట్ చేసిన స్క్రీన్ షాట్లను కూడా ఆమె బయటపెట్టడం సంచలనంగా మారింది.
ఇకపోతే, ఇటీవలే ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుని పూనమ్ కలిసింది. అందుకు సంబంధించిన ఫొటో కూడా సోషల్ మీడియాలో వైరల్ అయింది. దాంతో త్రివిక్రమ్‌తో ఉన్న సమస్య సమసిపోయిందని అందరూ అనుకున్నారు. కానీ, ఇప్పడు ఆమె లేటెస్ట్ పోస్ట్‌లు చూస్తుంటే రచ్చ ఇంకా అలానే ఉందని అదెప్పటికీ ఇలానే కొనసాగుతుందని నెటిజన్లు చర్చించుకుంటున్నారు.