అదానీకి ఊరట.. సెబీ విచారణ చాలు.. సిట్ అవసరం లేదు : సుప్రీంకోర్టు

అదానీకి ఊరట.. సెబీ విచారణ చాలు.. సిట్ అవసరం లేదు : సుప్రీంకోర్టు

అదానీ కంపెనీ షేర్లలో షార్ట్ సెల్లింగ్ జరుగుతుందని.. నిబంధనలకు విరుద్ధంగా వ్యాపార పెట్టుబడులు వస్తున్నాయంటూ హిడెన్ బర్గ్ రీసెర్చ్ సంస్థ నివేదికపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. జనవరి 3వ తేదీ సుప్రీంకోర్టు ధర్మాసనం అదానీ కంపెనీపై దాఖలైన పిటీషన్లపై విచారణ చేసింది. ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేసింది కోర్టు. స్టాక్ మార్కెట్ పరిధిలోని సెబీ విచారణ సరిపోతుందని.. సిట్ విచారణ అవసరం లేదని స్పష్టం చేసింది న్యాయ స్థానం. 

అదానీ గ్రూపులపై ఉన్న 22 కేసుల్లో సెబీ విచారణ పూర్తయ్యిందని.. మిగిలిన రెండు కేసుల్లోనూ విచారణ త్వరగా ముగించాలని సెబీని ఆదేశించింది కోర్టు. భారత పెట్టుబడిదారులు, పారిశ్రామిక వేత్తల ప్రయోజనాలను కాపాడాల్సిన బాధ్యత, బలోపేతం చేయాల్సిన అవసరం కేంద్రంతోపాటు సెబీ పరిగణలోకి తీసుకోవాలని సూచించింది. అదే సమయంలో అదానీ గ్రూపులపై వస్తున్న నివేదికలను పరిశీలించాల్సి అవసరం కూడా ఉందని వ్యాఖ్యానించింది కోర్టు. 

హిండెన్ బర్గ్ నివేదిక ఆధారంగా అదానీ గ్రూప్ చట్టాన్ని ఉల్లంఘించిందా లేదా అనే అంశాన్ని పరిశీలించాలని.. ఆయా సంస్థలపై మార్కెట్ వాచ్ డాగ్ గా వ్యవహరించాల్సిన అవసరం ఉందని.. చట్టం ప్రకారం నడుచుకోవాలని స్పష్టం చేసింది కోర్టు. అదే విధంగా హిండెన్ బర్గ్ నివేదికలోని అంశాలను కోర్టు నిజమైన ఆధారాలుగా పరిగణించాల్సిన అవసరం లేదని కూడా వ్యాఖ్యానించింది. షేర్ల విలువ పెరుగుదల అనేది సెబీ పరిధిలో ఉండదని.. మార్కెట్ వర్గాలు, పెట్టుబడిదారుల విశ్వసనీయతపై ఉంటుందన్న సెబీ తరపు న్యాయ వాదుల వాదనతో ఏకీభవించింది కోర్టు. 

అదానీ గ్రూపుపై ఉన్న మిగతా కేసుల విచారణను మూడు నెలల్లో ముగించాలని కోరుతూనే.. సిట్ విచారణ అవసరం లేదంటూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుతో.. అదానీ కంపెనీకి పెద్ద ఊరట లభించినట్లయింది. సుప్రీంకోర్టు తీర్పు తర్వాత అదానీ కంపెనీ షేర్లు బాగా లాభపడ్డాయి. అదానీ ఎంటర్ ప్రైజెస్, పపర్, పోర్టుల షేర్లు లాభాల్లో నడుస్తున్నాయి.