అదానీ - హిండెన్‌బర్గ్‌ వివాదంపై విచారణకు.. ఆరుగురితో కమిటీ

అదానీ - హిండెన్‌బర్గ్‌ వివాదంపై విచారణకు.. ఆరుగురితో కమిటీ
  • కమిటీకి సుప్రీం మాజీ జడ్జి జస్టిస్​ ఏఎం సప్రే నేతృత్వం 
  • సభ్యుల్లో కేవీ కామత్, నందన్​ నీలేకని కూడా.. 
  • సెబీ దర్యాప్తును 2 నెలల్లోగా ముగించాలని ఆదేశం
  • అదానీ షేర్ల ధరలను మానిప్యులేట్​ చేశారా
  • అనే కోణంలో ఎంక్వైరీ చేయాలని నిర్దేశం

న్యూఢిల్లీ: అదానీ గ్రూప్​– హిండెన్‌‌బర్గ్‌‌ రీసెర్చ్​ వివాదంపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. అమెరికా షార్ట్​ సెల్లింగ్​ కంపెనీ హిండెన్‌‌బర్గ్‌‌ రీసెర్చ్ నివేదిక జనవరి 24న విడుదలైన ​అనంతరం  స్టాక్​ మార్కెట్​లో చోటుచేసుకున్న పరిణామాలు, అదానీ గ్రూప్​ స్టాక్స్​లో భారీ హెచ్చుతగ్గులపై  దర్యాప్తు చేయాలని స్టాక్​ మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీకి గురువారం ఆర్డర్స్​ ఇచ్చింది.  ఈ వ్యవహారంపై విచారణ జరిపేందుకు ఆరుగురు నిపుణులతో కూడిన కమిటీని నియమించింది. సుప్రీంకోర్టు మాజీ జడ్జి జస్టిస్​ ఏఎం సప్రే నేతృత్వం వహించనున్న ఈ కమిటీలో ఎస్​బీఐ మాజీ చైర్​పర్సన్​ ఓ.పీ.భట్​, ఐసీఐసీఐ బ్యాంక్​ నాన్​ ఎగ్జిక్యూటివ్​ చైర్​పర్సన్​ కె.వి.కామత్​తో పాటు ఇన్ఫోసిస్​ చైర్మన్​ నందన్​ నిలేకని, ప్రముఖ కార్పొరేట్​ లాయర్​ సోమశేఖర్​ సుందరేశన్​, రిటైర్డ్​ జడ్జి జేపీ దేవ్​ధర్​ సభ్యులుగా ఉంటారని వెల్లడించింది. ఈ ప్యానెల్‌‌కు అన్ని విధాలా  సహకారాన్ని అందించాలని కేంద్ర ప్రభుత్వం, ఆర్థిక చట్టబద్ధమైన సంస్థలు, సెబీ చైర్‌‌ పర్సన్‌‌ను సుప్రీంకోర్టు చీఫ్​జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ ​పీఎస్​ నరసింహ, జస్టిస్​జె.బి.పర్దీవాలాతో కూడిన బెంచ్ ఆదేశించింది.   కమిటీ సభ్యులకు ఇవ్వాల్సిన గౌరవ భత్యాన్ని సెబీ చైర్​పర్సన్​ నిర్ణయిస్తారని బెంచ్​ పేర్కొంది.  నిపుణుల కమిటీకి లాజిస్టికల్​ సపోర్ట్​ అందజేసేందుకు కేంద్ర ఆర్థిక శాఖ కార్యదర్శి ఒక సీనియర్​ ఆఫీసర్​ను నోడల్​ ఆఫీసర్​గా నియమించాలని నిర్దేశించింది. హిండెన్​ బర్గ్​ నివేదిక విడుదలైన అనంతరం స్టాక్​ మార్కెట్​లో చోటుచేసుకున్న హెచ్చుతగ్గుల కారణంగా ఎంతోమంది ఇన్వెస్టర్లు నష్టపోయారంటూ లాయర్లు ఎం.ఎల్​.శర్మ, విశాల్​తివారీ, మధ్యప్రదేశ్​ కాంగ్రెస్​ నేత జయా ఠాకూర్​, ముకేశ్​కుమార్​నాలుగు పబ్లిక్​ ఇంట్రెస్ట్​ లిటిగేషన్ల (పిల్) ను దాఖలు చేశారు. స్టాక్​ మార్కెట్​ ఇన్వెస్టర్ల ప్రయోజనాలను పరిరక్షించాలని కోరారు. వాటిని విచారించిన సుప్రీంకోర్టు బెంచ్​.. దర్యాప్తునకు నిపుణుల కమిటీని ఏర్పాటు చేస్తూ గురువారం ఈమేరకు నిర్ణయాన్ని వెలువరించింది.

ఫిబ్రవరి 17న.. 

హిండెన్ బర్గ్–అదానీ వ్యవహారంలో కేంద్రానికి ఫిబ్రవరి 17న సుప్రీంకోర్టు షాకిచ్చింది. కేంద్రం సూచించిన నిపుణుల కమిటీని ధర్మాసనం తిరస్కరించింది. సీల్డ్ కవర్​లో పేర్లు అందజేయడాన్ని తప్పుబట్టిన న్యాయస్థానం ఈ అంశంలో పూర్తి పారదర్శకతను కోరుకుంటున్నట్లు చెప్పింది. ఒకవేళ సీల్డ్ కవర్​ను కోర్టు అంగీకరిస్తే ప్రభుత్వం నియమించిన కమిటీకి ఓకే చెప్పినట్లు అవుతుందని చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్ అభిప్రాయపడ్డారు. అదానీ ఇష్యూలో తామే కమిటీ వేస్తామని స్పష్టం చేశారు. ఈనేపథ్యంలోనే సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని బెంచ్​సొంతంగా నిపుణుల కమిటీని ప్రకటించింది.

సత్యమే గెలుస్తది: గౌతమ్​ అదానీ

సుప్రీంకోర్టు ఆదేశాలపై అదానీ గ్రూప్​ చైర్మన్​ గౌతమ్​ అదానీ స్పందించారు. సత్యమే గెలుస్తుందని ఆయన స్పష్టం చేశారు. సుప్రీంకోర్టు ఆదేశాలను స్వాగతిస్తున్నట్లు చెప్పారు. కోర్టు విధించిన గడువులోగా నిజం నిగ్గుతేలుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు. ఈమేరకు ఆయన ట్వీట్​ చేశారు. హిండెన్​ బర్గ్​ రీసెర్చ్​ చేసిన ఆరోపణలను గౌతమ్​అదానీ మొదటి నుంచీ తోసిపుచ్చుతున్నారు. ఆ ఆరోపణలపై వివరణ ఇస్తూ అదానీ గ్రూప్​413 పేజీల సమాచారాన్ని కూడా ఇదివరకే విడుదల చేసింది.