ముంబై: అదానీ గ్రూప్ ఫ్లాగ్షిప్ కంపెనీ అదానీ ఎంటర్ ప్రైజస్ లిమిటెడ్ క్యూ 4 రిజల్ట్స్ అదరగొరట్టాయి. మార్చి 2023 క్వార్టర్లో కంపెనీ నికర లాభం డబులై రూ. 722.48 కోట్లకు చేరింది. అంతకు ముందు ఏడాది క్యూ 4 లో ఈ నికర లాభం రూ. 304.32 కోట్లే. తాజా మార్చి క్వార్టర్లో కంపెనీ రెవెన్యూ కూడా 26 శాతం పెరిగి రూ. 31,346 కోట్లకు చేరింది. అంతకు ముందు ఏడాది మార్చి క్వార్టర్లో అదానీ ఎంటర్‌ప్రైజస్ లిమిటెడ్ రెవెన్యూ రూ. 24,866 కోట్లు. అదానీ ఎయిర్‌పోర్ట్స్ మార్చి 2023 క్వార్టర్లో 2.14 కోట్ల మంది ప్యాసింజర్లను హ్యాండిల్ చేసింది. మార్చి 2022 క్వార్టర్‌తో పోలిస్తే ఇది 74 శాతం ఎక్కువ. రోడ్లు, ఎయిర్‌పోర్టుల బిజినెస్‌లలో విస్తరణ వల్లే నికర లాభం రెట్టింపయిందని అదానీ ఎంటర్‌ప్రైజస్ లిమిటెడ్ తెలిపింది. కంపెనీ మరోసారి తన పనితీరుతో సక్సెస్‌ఫుల్‌గా నిలబడిందని, ప్రపంచంలోని సక్సెస్ఫుల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫౌండరీస్లో ఒకటిగా మారిందని అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీ చెప్పారు. షేర్హోల్డర్లకు రూ. 1.20 చొప్పున డివిడెండ్‌ను ఇచ్చేందుకు డైరెక్టర్ల బోర్డు అంగీకరించింది. ఆగస్టు 27, 2001 నుంచి మొత్తం 22 డివిడెండ్లను షేర్హోల్డర్లకు కంపెనీ ఇచ్చింది. అదానీ ఎంటర్‌ప్రైజస్ షేర్ ప్రస్తుతం
రూ. 1,925 వద్ద ట్రేడవుతోంది.. మయన్మార్ పోర్టు అమ్మకం....
అదానీ గ్రూప్‌లోని మరో కంపెనీ అదానీ పోర్ట్స్ అండ్ స్పెషల్ ఎకనమిక్ జోన్ లిమిటెడ్ (ఏపీ ఎస్ఈజెడ్) తన చేతిలోని మయన్మార్ పోర్టును 30 మిలియన్ డాలర్లకు అమ్మేసింది. కిందటేడాది మే నెలలోనే మయన్మార్ పోర్టు విక్రయానికి షేర్ పర్చేజ్ అగ్రిమెంట్‌ను ఏపీఎస్ఈజెడ్ కుదుర్చుకుంది. ఈ షేర్ పర్చేజ్ అగ్రిమెంట్లో కొన్ని ప్రత్యేకమైన కండిషన్లు ఉన్నాయి. అవసరమైన అనుమతులు రావడంలో తీవ్ర జాప్యం జరుగుతుండటం వల్ల ఈ ప్రాజెక్టు ఛాలెంజ్‌గా మారిందని ఏపీఎస్ఈజెడ్ ఒక స్టేట్మెంట్లో తెలిపింది. ఇండిపెండెంట్ వాల్యుయేషన్ తర్వాత బయ్యర్, సెల్లర్ మధ్య ఒప్పందం కుదిరిందని, ఈ ఒప్పందం కింద 30 మిలియన్ డాలర్లను మూడు వర్కింగ్ డేస్‌లో బయ్యర్ చెల్లించాలని ఏపీఎస్ఈజెడ్ వెల్లడించింది. అక్టోబర్ 2021లో తమ కంపెనీ రిస్క్ కమిటీ రికమెండేషన్‌కు అనుగుణంగానే మయన్మార్ పోర్టు అమ్మకాన్ని చేపట్టినట్లు ఏపీఎస్ఈజెడ్ సీఈఓ కరణ్ అదానీ వెల్లడించారు.
