అదానీ షేర్లు ఢమాల్

అదానీ షేర్లు ఢమాల్

న్యూఢిల్లీ :  అదానీ గ్రూపు లంచం ఇచ్చిందనే ఆరోపణలపై అమెరికా తన దర్యాప్తును వేగవంతం చేసిందంటూ వచ్చిన వార్తలతో అదానీ గ్రూప్‌‌లోని మొత్తం పది లిస్టెడ్ స్టాక్‌‌లు సోమవారం నష్టాల్లో ముగిశాయి.   రాజస్థాన్ ప్రభుత్వ యాజమాన్యంలోని విద్యుత్ పంపిణీ సంస్థ అయిన జైపూర్ విద్యుత్ వితరణ్​ నిగమ్ లిమిటెడ్ నుంచి ఆలస్య చెల్లింపు సర్‌‌చార్జిగా రూ. 1,300 కోట్లకు పైగా చెల్లించాలని

కోరుతూ అదానీ పవర్​కు వ్యతిరేకంగా రాజస్థాన్ లిమిటెడ్ చేసిన పిటిషన్‌‌ను సుప్రీంకోర్టు కొట్టివేసిన తర్వాత గ్రూప్ సంస్థల షేర్లు కూడా క్షీణించాయి. బీఎస్‌‌ఈలో అదానీ టోటల్ గ్యాస్ స్టాక్ 4.35 శాతం, అదానీ ఎనర్జీ సొల్యూషన్స్ 3.40 శాతం, అంబుజా సిమెంట్స్ 2.81 శాతం, ఏసీసీ 2.43 శాతం పడిపోయాయి. ఎన్డీటీవీ షేర్లు 2.08 శాతం, అదానీ విల్మార్ 2.05 శాతం క్షీణించగా, అదానీ గ్రీన్ ఎనర్జీ 1.67 శాతం

 అదానీ పోర్ట్స్ 1.24 శాతం, అదానీ ఎంటర్‌‌ప్రైజెస్ 0.71 శాతం, అదానీ పవర్ 0.35 శాతం క్షీణించాయి. మీడియా నివేదికల ప్రకారం, యూఎస్ ప్రాసిక్యూటర్లు .. అదానీ గ్రూపు లంచం ఇచ్చిందీ లేనిదీ తెలుసుకోవడానికి దర్యాప్తును విస్తృతం చేశారు.  ఇదిలా ఉంటే సోమవారం బీఎస్​ఈ సెన్సెక్స్ 104.99 పాయింట్లు లాభంతో 72,748.42 వద్ద ముగిసింది. నిఫ్టీ 32.35 పాయింట్లు పెరిగి 22,055.70 వద్ద ముగిసింది.