- అదానీ ఎంటర్‌ప్రైజస్, అదానీ గ్రీన్ ఎనర్జీ బోర్డ్ మీటింగ్‌లు
- 2.5 బిలియన్ డాలర్ల సేకరణ ?
న్యూఢిల్లీ: హిండెన్‌బర్గ్ ఎపిసోడ్ తర్వాత మొదటిసారిగా అదానీ గ్రూప్ మళ్లీ డబ్బు వేట మొదలెట్టింది. రెండు కంపెనీల ద్వారా 2 నుంచి 2.5 బిలియన్ డాలర్లు నిధులు సమీకరించాలని ప్లాన్ చేస్తోంది. ఈక్విటీ షేర్ల జారీ లేదా ఇతర మార్గాలలో ఈ డబ్బు సమకూర్చుకోవడానికి అడుగులు వేస్తోంది. అదానీ ఎంటర్‌ప్రైజస్ లిమిటెడ్, అదానీ గ్రూప్ ఎనర్జీ లిమిటెడ్కంపెనీల బోర్డులు నిధుల సమీకరణ ప్రపోజల్స్ పరిశీలించేందుకు ఈ నెల 13 న అహ్మదాబాద్‌లో సమావేశమవుతున్నాయి. ఈ మేరకు స్టాక్ఎక్స్చేంజీలకు ఆ కంపెనీలు సమాచారం పంపించాయి. కచ్చితంగా ఎంత మొత్తం సమీకరించాలనుకుంటున్నాయో ఈ కంపెనీలు రెండూ స్టాక్ ఎక్స్చేంజీల ఫైలింగ్‌లో వెల్లడించలేదు.
కానీ, యూరప్, మిడిల్ ఈస్ట్‌లలోని ఇన్వెస్టర్లు చాలా ఆసక్తి చూపుతున్న నేపథ్యంలో 2–2.5 బిలియన్ డాలర్ల దాకా అదానీ గ్రూప్ సమీకరించొచ్చని సంబంధిత వర్గాలు తెలిపాయి. హిండెన్‌బర్గ్ రిపోర్టు బయటకు వచ్చాక తన భారీ ఫాలోఆన్ పబ్లిక్ ఆఫరింగ్(ఎఫ్‌పీఓ)ను అదానీ గ్రూప్ విత్‌డ్రా చేసుకున్నది. ఇది జరిగి దాదాపు మూడు నెలలు కావస్తోంది. ఆ ఎఫ్‌పీఓకు పూర్తి సబ్స్క్రిప్షన్ వచ్చినప్పటికీ షార్ట్ సెల్లర్ హిండెన్బర్గ్ఆరోపణల నేపథ్యంలో నైతిక విలువలు పాటిస్తూ ఇన్వెస్టర్లకు డబ్బు తిరిగి ఇచ్చేస్తున్నట్లు అదానీ గ్రూప్ అప్పట్లో ప్రకటించింది. ఎఫ్పీఓలో ఒక్కో షేర్‌ను రూ. 3,112 నుంచి రూ. 3,276 కి జారీ చేయాలని అదానీ ఆఫర్ చేసింది. ఇప్పుడు మార్కెట్లో అదే షేరు విలువ రూ. 1,984 కి పడిపోవడం గమనించాలి.
హిండెన్‌బర్గ్ ఆరోపణలు....
అదానీ గ్రూప్‌లో అకౌంటింగ్ ఫ్రాడ్స్, షేర్ల రేట్ల మేనిప్యులేషన్ జరుగుతున్నాయంటూ యూఎస్ షార్ట్ సెల్లర్ హిండెన్‌బర్గ్ ఈ ఏడాది మొదట్లో ఒక రీసెర్చ్ రిపోర్టు బయటపెట్టింది. ఆ రిపోర్టు దెబ్బతో అదానీ గ్రూప్కంపెనీల షేర్లన్నీ భారీగా పడిపోయాయి. ప్రపంచ సంపన్నుల జాబితాలో ముందు వరసలోకి చేరుకున్న అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీ దీంతో చాలా స్థానాలు కిందకి జారిపోయారు. మొత్తం 145 బిలియన్ డాలర్ల సంపద ఆవిరైపోయింది. హిండెన్బర్గ్చేసిన ఆరోపణలన్నీ అవాస్తవాలని అదానీ గ్రూప్ కొట్టిపారేసింది. ఇన్వెస్టర్లలో నమ్మకం పెంచడానికి ఇటీవల కాలంలో ఈ గ్రూప్ కంపెనీలు తాము అంతకు ముందు తీసుకున్న అప్పులను గడువు కంటే ముందుగానే చెల్లించిన విషయం తెలిసిందే.
మార్చిలో వాటా అమ్మిన ప్రమోటర్లు....
మార్చి 2023లో అదానీ గ్రూప్ ప్రమోటర్లు నాలుగు కంపెనీలలో తమ వాటాలలో కొంత భాగాన్ని గ్లోబల్ ఈక్విటీ ఇన్వెస్ట్మెంట్ కంపెనీ జీక్యూజీ పార్ట్నర్స్కు అమ్మేశారు. ఈ అమ్మకం ద్వారా ప్రమోటర్లు రూ. 15,446 కోట్లను సమకూర్చుకున్నారు. మార్కెట్లో తనపై నమ్మకాన్ని తిరిగి పెంచుకోవాలని అప్పటి నుంచీ అదానీ గ్రూప్ తీవ్రంగా కృషి చేస్తోంది. కొత్త ప్రాజెక్టులతో బిజినెస్‌లోనూ దూసుకెళ్లాలనీ ప్లాన్లు వేస్తోంది.
