సంపన్నుల ప్రపంచంలో గౌతమ్ అదానీ ప్రస్థానం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఎందుకంటే.. 2019 నుండి 2025 మధ్య కాలంలో ఆయన సంపద ఏకంగా 625 శాతం వృద్ధి చెందడం భారత కార్పొరేట్ చరిత్రలోనే ఒక రికార్డుగా నిలిచింది. హిండెన్‌బర్గ్ వంటి ఆరోపణల సుడిగుండాన్ని దాటుకుని, రెట్టింపు ఉత్సాహంతో అదానీ గ్రూప్ మళ్లీ ఎగబాకింది. ఈ అసాధారణ గ్రోత్ వెనుక ఉన్న స్టోరీకి సంబంధించిన వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..
సంపద సునామీ :
2019లో గౌతమ్ అదానీ నికర ఆస్తి విలువ సుమారు 15 బిలియన్ డాలర్లుగా ఉండేది. కానీ 2025 నాటికి అది 100 బిలియన్ డాలర్ల మార్కును దాటి దూసుకుపోతోంది. ఈ ఆరేళ్ల కాలంలో ఆయన సంపద 625 శాతం పెరగడానికి ప్రధాన కారణం అదానీ గ్రూప్ కంపెనీల షేర్ల ధరలు రాకెట్ వేగంతో పెరగడమే. ముఖ్యంగా అదానీ గ్రీన్ ఎనర్జీ, అదానీ టోటల్ గ్యాస్, అదానీ ఎంటర్‌ప్రైజెస్ వంటి సంస్థలు ఇన్వెస్టర్లకు మనీ మెషీన్లులా మారాయి. మధ్యలో హిండెన్‌బర్గ్ రిపోర్ట్స్ వల్ల దాదాపు 60 బిలియన్ డాలర్ల సంపద ఆవిరైనప్పటికీ.. 2024-25 ఆర్థిక సంవత్సరంలో అదానీ మళ్లీ పుంజుకుని ఆసియాలోనే అత్యంత ధనవంతుల రేసులో నిలిచారు.
అదానీ గ్రూప్ విజయ రహస్యం..
అదానీ గ్రూప్ కేవలం ఒక్క రంగానికే పరిమితం కాకుండా పోర్టులు, విమానాశ్రయాలు, డేటా సెంటర్లు, సిమెంట్, గ్రీన్ ఎనర్జీ వంటి కీలక మౌలిక సదుపాయాల రంగాల్లో గుత్తాధిపత్యాన్ని సంపాదించింది. ప్రస్తుతం దేశంలోని 25 శాతం విమాన ప్రయాణికులు అదానీ విమానాశ్రయాల నుంచే వెళ్తుండగా.. దేశంలోని 30 శాతం కార్గో కార్యకలాపాలు అదానీ పోర్టుల ద్వారానే జరుగుతున్నాయి. 2025 నాటికి ఈ గ్రూప్ మొత్తం మార్కెట్ క్యాపిటలైజేషన్ 15 లక్షల కోట్ల రూపాయలు దాటడం గమనార్హం.
Also Read : ట్రంప్ నిర్ణయం కోసం ఇన్వెస్టర్ల ఎదురుచూపు..
భవిష్యత్ లక్ష్యాలు..
అదానీ కేవలం సంపద పెంచుకోవడమే కాకుండా.. 2030 నాటికి ప్రపంచంలోనే అతిపెద్ద రెన్యూవబుల్ ఎనర్జీ ఉత్పత్తిదారుగా ఎదగాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇందుకోసం 75 బిలియన్ డాలర్ల భారీ పెట్టుబడులను ప్రకటించారు. అప్పుల భారాన్ని తగ్గించుకుంటూ.. పారదర్శకతను పెంచుతూ అదానీ గ్రూప్ చేస్తున్న ప్రయాణం ఇన్వెస్టర్లలో నమ్మకాన్ని నింపింది. 2019లో సాధారణ స్థాయిలో ఉన్న ఒక వ్యాపార సామ్రాజ్యం.. 2025 నాటికి ఆర్థిక వ్యవస్థను శాసించే స్థాయికి చేరడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది.
2 శాతం వెల్త్ టాక్స్ విధిస్తే :
అపర కుబేరులైన అంబానీ, అదానీ వంటి వారి సంపదపై కేవలం 2 శాతం వెల్త్ ట్యాక్స్ విధిస్తే.. దేశంలో విప్లవాత్మక మార్పులు తీసుకురావచ్చని తాజా నివేదిక వెల్లడించింది. అంబానీపై 2% పన్ను వేస్తే వచ్చే ఆదాయంతో సుమారు కోటి 85 లక్షల మంది 10వ తరగతి విద్యార్థులకు ఏకంగా మూడుసార్లు ఉచితంగా ల్యాప్‌టాప్‌లు పంపిణీ చేయవచ్చు. లేదంటే ఈ డబ్బుతో 2 కోట్ల 85లక్షల మంది మహిళలకు రెండేళ్లపాటు సార్వత్రిక ప్రసూతి హక్కుల కింద ఆర్థిక సాయం అందించవచ్చు. అదేవిధంగా.. గౌతమ్ అదానీ సంపదపై 2 శాతం పన్ను విధిస్తే దేశవ్యాప్తంగా రెండేళ్లపాటు ప్రాథమిక ఆరోగ్య సేవలను ఉచితంగా అందించడమే కాకుండా.. దాదాపు 87 కోట్ల ఉచిత ఎల్పీజీ సిలిండర్లను పేదలకు పంపిణీ చేయెుచ్చని CFA లెక్కలు స్పష్టం చేస్తున్నాయి.
