మర్రి శశిధర్ రెడ్డి కామెంట్స్ ను ఖండించిన అద్దంకి దయాకర్ 

మర్రి శశిధర్ రెడ్డి కామెంట్స్ ను ఖండించిన అద్దంకి దయాకర్ 

హైదరాబాద్ : పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, రాష్ర్ట వ్యవహారాల ఇన్ చార్జ్ మాణిక్కం ఠాగూర్ పై కాంగ్రెస్ సీనియర్ నేత మర్రి శశిధర్ రెడ్డి చేసిన కామెంట్స్ ను అద్దంకి దయాకర్ ఖండించారు. కాంగ్రెస్ పార్టీకి నష్టం కలిగించేలా మాట్లాడకూడదంటూ సూచించారు. తాను ఎంపీ కోమటిరెడ్డి బ్రదర్స్ పై చేసిన వ్యాఖ్యలపై మళ్లీ మళ్లీ స్పందించి.. పార్టీకి నష్టం కలిగించేలా మాట్లాడడం తగదన్నారు. ఆ విషయం సమసిపోయేలా చేయాలి గానీ, పార్టీకి నష్టం కలిగించేలా మాట్లాడవద్దన్నారు. ‘మర్రి చెన్నారెడ్డి కుమారుడిగా మీకు ప్రత్యేక గుర్తింపు ఉంది. సుదీర్ఘ కాలంగా కాంగ్రెస్ తో అనుబంధం ఉంది. అటువంటి మీరు పార్టీకి గౌరవం తగ్గేటట్లు మాట్లాడడం మంచిది కాదు. ఇప్పటికే పార్టీలో అంతర్గత కలహాలతో కాంగ్రెస్ నష్టం పోతుందనే చర్చ కార్యకర్తలో ఉంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ శ్రేణుల్లో మానసిక ధైర్యం, భరోసా ఇవ్వాల్సిన అవసరం మీపై ఎంతైనా ఉంది’ అంటూ అద్దంకి దయాకర్ వ్యాఖ్యానించారు. గతంలో తాము చేసిన కొన్ని వివాదాస్పద కామెంట్స్ ను మళ్లీ తిరగదోడి రచ్చ చేసే విధంగా కాకుండా ఇష్యూ సద్దుమణిగేలా చేస్తే బాగుంటుదని విజ్ఞప్తి చేశారు. 

పార్టీ బలోపేతానికి ముందుకు రండి..

‘ఒక పద్ధతి ప్రకారం బీజేపీ, ఆర్ఎస్ఎస్ చేస్తున్న కుట్రలకు కాంగ్రెస్ పార్టీ నాయకత్వం పావులుగా మారుతుందా అనే చర్చ ప్రజల్లో ఉంది. రాష్ర్టంపై ఓ వైపు బీజేపీ దండయాత్ర .. మరోవైపు ప్రజా సమస్యల పరిష్కారం కోసం రాష్ర్ట ప్రభుత్వంపై మనం పోరాడుతున్నామనే చర్చ ప్రజల్లో ఉంది. ఈ తరుణంలో వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం వల్ల కాంగ్రెస్ పార్టీకి లాభం లేదు ’ అని అద్దంకి దయాకర్ అన్నారు. బీజేపీ, టీఆర్ఎస్ నాయకులు చేస్తున్న రాజకీయ కుట్రలకు కాంగ్రెస్ కార్యకర్తలు గందరగోళానికి గురికాకుండా చూసే బాధ్యత మర్రి శశిధర్ రెడ్డిపై ఉందన్నారు. కాంగ్రెస్ పార్టీలో అంతర్గత కలహాలు సమసిపోయేలా చేసే బాధ్యత తీసుకోవాలని చేశారు. రేవంత్ రెడ్డినో, లేక మరెవరో చెబితే తాను ఎవరిపైనా కామెంట్స్ చేయడం లేదని, తన వ్యాఖ్యలకు తానే బాధ్యత వహిస్తానని చెప్పారు. పార్టీకి సంబంధించిన విషయంలో కాంగ్రెస్ ను రక్షించే  బాధ్యత మర్రి శశిధర్ రెడ్డిపై ఉందని, ఈ విషయంలో ఆయన మరింత ముందుకు రావాలని కోరారు. పార్టీ బలోపేతం కోసం మర్రి శశిధర్ రెడ్డి చెప్పే సూచనలు, సలహాలను పార్టీ అధిష్టానం పరిగణలోకి తప్పకుండా తీసుకుంటుందని చెప్పారు. 

మర్రి శశిధర్ రెడ్డి నిన్న ఏమన్నారంటే..

కాంగ్రెస్​లో కల్లోలానికి రాష్ట్రంలో పార్టీని నడిపిస్తున్న, పర్యవేక్షణ చేస్తున్న వారే కారణమని మాజీ మంత్రి, కాంగ్రెస్​ నేత మర్రి శశిధర్​రెడ్డి మండిపడ్డారు. రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలపై పార్టీ హైకమాండ్​కు తప్పుడు సమాచారం ఇస్తున్నారని ఆరోపించారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. రేవంత్ రెడ్డి పీసీసీ చీఫ్ గా ఉంటూ పార్టీకి నష్టం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర వ్యవహారాల ఇన్‌‌చార్జ్​ మాణిక్కం ఠాగూర్‌‌ వ్యవహార శైలితో పార్టీకి లాభం కంటే నష్టం ఎక్కువ జరుగుతోందన్నారు. ‘‘మాణిక్కం ఠాగూర్‌‌ చేతిలో రేవంత్‌‌రెడ్డి పనిచేస్తున్నట్టు లేదు. ఠాగూరే.. రేవంత్‌‌ చేతిలో పనిచేస్తున్నట్టు ఉంది. రేవంత్​కు ఏజెంట్​​లా ఠాగూర్​ మారినట్లు ఉంది” అని శశిధర్​రెడ్డి విమర్శించారు. రాహుల్‌‌ గాంధీకి తప్పుడు రిపోర్టులు ఇస్తున్నారని ఆరోపించారు. ‘‘సీనియర్లను గోడకేసి కొడుతా అన్నా.. హోంగార్డులతో పోల్చినా అధిష్టానం నుంచి మందలింపు లేదు. ఆఖరికి రాహుల్ నోటి నుంచి కూడా వాళ్లకు నచ్చినట్లు మాట్లాడించుకున్నరు” అని మండిపడ్డారు. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, రాజగోపాల్ రెడ్డి విషయంలో రేవంత్ వ్యవహరించిన తీరు సరిగ్గా లేదన్నారు. 

40 ఏండ్ల రాజకీయ జీవితంలో ఎన్నడూ చూడలే
పార్టీలో జరుగుతున్న పరిణామాలపై తీవ్ర కలత చెందానని, 40 ఏండ్ల రాజకీయ జీవితంలో ఇలాంటి పరిస్థితిని చూడలేదని మర్రి శశిధర్​రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. గ్రూపిజం పెరిగి పార్టీకి తీవ్ర నష్టం జరుగుతోందన్నారు.