పదేండ్ల తర్వాత కేసీఆర్‌‌కు ప్రజలు గుర్తుకొచ్చారు: అద్దంకి దయాకర్

పదేండ్ల తర్వాత కేసీఆర్‌‌కు ప్రజలు గుర్తుకొచ్చారు: అద్దంకి దయాకర్

హైదరాబాద్, వెలుగు: పదేండ్ల తర్వాత కేసీఆర్‌‌కు ప్రజలు గుర్తుకొచ్చారని, రైతుల కోసం ఆయన మొసలి కన్నీరు కారుస్తున్నారని పీసీసీ ప్రధాన కార్యదర్శి అద్దంకి దయాకర్ విమర్శించారు. కేసీఆర్‌‌ను నమ్మే స్థితిలో ప్రజలు లేరన్నారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత కేసీఆర్‌‌కు పొలం బాట పట్టాలని అర్థమైందన్నారు.

మూడు నెలలకే రాజకీయంగా పతనమయ్యాక కేసీఆర్ జనంలోకి రావాలనుకోవడం విచిత్రంగా ఉందన్నారు. అధికారంలో ఉన్నప్పుడు రైతులు ఇబ్బందులు పడినప్పుడు పట్టించుకోని కేసీఆర్.. ఓడిపోగానే పర్యటనలు చేస్తున్నారని విమర్శించారు. అసెంబ్లీకి రాని కేసీఆర్ వచ్చే ఎన్నికల్లో నష్టపోతామని రాజకీయ లబ్ధి కోసం పొలం బాట పట్టారన్నారు. నాడు పండిన పంటలు కొనకపోతే రోడ్ల మీదే ధాన్యం గింజలు మొలకెత్తిన సందర్భాలు ఉన్నాయని ఆయన గుర్తుచేశారు. ఇప్పటికైనా బాధ్యతాయుతమైన ప్రతిపక్ష నేత‌‌గా కేసీఆర్ నడుచుకుంటే బాగుంటుందని హితవు పలికారు. రైతులు, ప్రజలను ఆదుకునే బాధ్యతను సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వం‌‌లోని కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుంటుందని చెప్పారు.