ఆదిలాబాద్, వెలుగు: కేసుల దర్యాప్తులో సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించాలని ఎస్పీ అఖిల్ మహాజన్ సూచించారు. ఆదిలాబాద్ రూరల్ పోలీస్స్టేషన్ ను శుక్రవారం ఆయన తనిఖీ చేశారు. ఠాణా ఆవరణలో పరిశుభ్రతపై దృష్టి సారించాలని, మొక్కలు నాటాలని చెప్పారు. అనంతరం రికార్డులను పరిశీలించారు. సిబ్బంది క్రమశిక్షణతో ఉండి, విధుల్లో సమయపాలన పాటిస్తూ నిజాయితీగా ఉండాలన్నారు.
గ్రామాలను సందర్శిస్తూ సైబర్ క్రైం, రోడ్ సేఫ్టీ క్లబ్, పోలీస్అక్క, మహిళల భద్రత, షీటీం, మాదకద్రవ్యాలపై అవగాహన కల్పించాలని పేర్కొన్నారు. విలేజ్ పోలీస్ ఆఫీసర్లు ప్రజలతో మమేకం కావాలని సూచించారు. కార్యక్రమంలో ఆదిలాబాద్ డీఎస్పీ జీవన్ రెడ్డి, రూరల్ సీఐ ఫణిదర్, ఎస్సై విష్ణువర్ధన్ పాల్గొన్నారు.
