- ప్రతి కుటుంబానికి న్యాయం చేస్తాం కలెక్టర్ బదావత్ సంతోష్
అచ్చంపేట, వెలుగు: నక్కల గండి డిండి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ లో ఇండ్లు కోల్పోయిన నిర్వాసితులకు రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుందని నాగర్కర్నూల్ కలెక్టర్ బదావత్ సంతోష్ హామీ ఇచ్చారు. శుక్రవారం అడిషనల్ కలెక్టర్ అమరేందర్ తో కలిపి మర్లపాడు తండాలో ముంపు బాధితులతో సమావేశం నిర్వహించారు. ముంపు బాధితుల అవసరాలు, అభిప్రాయాలు, పునరావాసంపై ఉన్న సందేహాలను అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ నక్కలగండి ప్రాజెక్టు ముంపునకు గురయ్యే నక్కలగండి తండా, మర్లపాడు తండా, కేశ్య తండా, మన్నేవారిపల్లి గ్రామాల ప్రజలకు పునరావాసం స్పీడప్ చేయడానికి జిల్లా యంత్రాంగం సిద్ధంగా ఉందని తెలిపారు. సీఎం ఆదేశాలతో తాము ముంపు ప్రభావం, పునరావాస పనులు, పంట నష్టాన్ని పరిశీలిస్తున్నామని చెప్పారు. స్థానికుల అభిప్రాయం ప్రకారం అనువైన స్థలాన్ని ఎంపిక చేసేందుకు అందుబాటులో ఉన్న భూములను పరిశీలిస్తున్నామని తెలిపారు.
ప్రభుత్వ భూమి అందుబాటులో లేకుంటే, అచ్చంపేట సమీపంలోని హాజీపూర్ వద్ద ఇప్పటికే గుర్తించిన స్థలంలో పునరావాస కాలనీలు నిర్మించేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. పునరావాస కాలనీల్లో అన్ని సౌలతులు కల్పిస్తామని చెప్పారుర. మర్లపాడు గ్రామస్తులు తమకు సంక్షేమ పథకాలు అందడం లేదని తెలియజేయగా, అర్హులకు పథకాలు అందేలా అందేలా చూస్తామని కలెక్టర్ హామీ ఇచ్చారు. అనంతరం భారీ వర్షాలతో దెబ్బ తిన్న పత్తి, వరి పంటలను పరిశీలించి నష్టం వివరాలు అడిగి తెలుసుకున్నారు. అచ్చంపేట ఆర్డీవో మాధవి, తహసీల్దార్ సైదులు పాల్గొన్నారు.
