గ్రామపంచాయతీలు, వార్డులలో రిజర్వేషన్ ప్రక్రియను చేపట్టాలి : కలెక్టర్ కె. హైమావతి

గ్రామపంచాయతీలు, వార్డులలో రిజర్వేషన్ ప్రక్రియను చేపట్టాలి :  కలెక్టర్ కె. హైమావతి

సిద్దిపేట రూరల్, వెలుగు:  రాష్ట్ర ఎన్నికల సంఘం నిబంధనలకు అనుగుణంగా జిల్లాలోని 508 గ్రామ పంచాయతీలు, 4,508 వార్డుల్లో రిజర్వేషన్ ప్రక్రియను వెంటనే చేపట్టాలని జిల్లా కలెక్టర్ కె. హైమవతి ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో పంచాయతీరాజ్ శాఖ అధికారులు, సిబ్బందితో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆమె ఈ మేరకు  ఆదేశాలు జారీ చేశారు. 

 ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లకు 2011 జనాభా లెక్కలు, బీసీ రిజర్వేషన్లకు సీఈపీ సర్వే ఆధారంగా మొత్తం 50 శాతం మించకుండా రిజర్వేషన్లు కేటాయించాలని, ఈ ప్రక్రియను సంబంధిత డివిజన్ల ఆర్డీవోల నేతృత్వంలో పూర్తి చేయాలని కలెక్టర్ సూచించారు. గ్రామ వార్డు సభ్యుల రిజర్వేషన్ కూడా సీఈపీ సర్వే ఆధారంగానే నిర్ణయించాలని ఆదేశించారు. సమావేశంలో జడ్పీ సీఈవో రమేష్, డీపీవో విజయ్ కుమార్, ఆర్డీవోలు సదానందం, చంద్రకళ, డీఆర్డీవో జయదేవ్ ఆర్య  పాల్గొన్నారు.

రోడ్డు భద్రతపై పకడ్బందీ చర్యలు .. 

జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణకు పకడ్బందీ చర్యలు చేపట్టాలని, ప్రతి వాహనదారుడి ప్రాణం కాపాడే బాధ్యత అధికారులదని కలెక్టర్ కె. హైమవతి తెలిపారు. శుక్రవారం రోడ్డు భద్రత కమిటీ, మాదక ద్రవ్యాల నియంత్రణపై సంబంధిత శాఖల అధికారులతో నిర్వహించిన సమీక్షలో ఆమె మాట్లాడారు. 

రోడ్ల పక్కన వంగి ఉన్న చెట్ల కొమ్మలను తొలగించాలని, కొమురవెల్లి కమాన్ వద్ద ప్రమాదాలు నివారించేందుకు బస్‌‌‌‌బే ఏర్పాటుకు భూసేకరణ వేగవంతం చేయాలని ఆదేశించారు. మాదక ద్రవ్యాల అక్రమ రవాణా అరికట్టేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని, పాఠశాలల చుట్టుపక్కల 100 యార్డ్స లోపు  మత్తుపదార్థాలు అమ్మితే  పోలీసులకు సమాచారం అందించాలని డీఈవోను ఆదేశించారు.

పీహెచ్‌‌సీలో సిబ్బంది గైర్హాజరుపై ఆగ్రహం.. 

రూరల్ మండలం చింతమడకలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని కలెక్టర్ ఆకస్మిక తనిఖీ చేశారు. ఔట్‌‌పేషెంట్ రిజిస్టర్, అటెండెన్స్ రిజిస్టర్ పరిశీలించారు. మెడికల్ ఆఫీసర్‌‌తో సహా చాలామంది సిబ్బంది గైర్హాజరు కావడంతో  ఆగ్రహం వ్యక్తం చేశారు. అనుమతి లేకుండా సెలవు తీసుకుని, విధులను నిర్లక్ష్యం చేస్తే జీతం కోతతో పాటు కఠిన చర్యలు తీసుకోవాలని డీఎంఅండ్‌‌హెచ్‌‌ఓకు ఫోన్ చేసి తెలిపారు.