- తెలంగాణ అటవీ శాఖ ప్రధాన సంరక్షణ అధికారి డా. సి. సువర్ణ
సిద్దిపేట, వెలుగు : సిద్దిపేట జిల్లా ములుగు మండలం కేంద్రంలోని అటవి కళాశాల , పరిశోధన సంస్థ ‘పర్యావరణం , వ్యర్థాల నిర్వహణ - సమస్యలు, ప్రభావాలు, సవాళ్లు -, అవకాశాలు" అనే అంశంపై రెండు రోజుల జాతీయ సదస్సు ప్రారంభమైంది.
దేశంలోని వివిధ విశ్వవిద్యాలయాల పరిశోధకులు, విద్యార్థులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, పర్యావరణ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్న ఈ సదస్సుకు కళాశాల డీన్ వి. కృష్ణ అధ్యక్షత వహించారు. ముఖ్య అతిథులుగా తెలంగాణ అటవీ శాఖ ప్రధాన సంరక్షణ అధికారి డా.సి.సువర్ణ, ఆచార్య కొండ లక్ష్మణ్ బాపూజీ హార్టికల్చర్ యూనివర్సిటీ వైస్ చాన్స్‌లర్ డా.డి.రాజిరెడ్డి, తెలంగాణ అటవీ సంరక్షణ అధికారి డా.ప్రియాంక వర్గీస్ పాల్గొని ప్రసంగించారు.
ఈ సందర్భంగా డా.సి.సువర్ణ మాట్లాడుతూ ‘పట్టణీకరణ, నగరీకరణ వల్ల పర్యావరణ కాలుష్యం పెరుగుతుంది, వ్యర్థాలు పేరుకు పోతున్నాయి. ఇలాగే కొనసాగితే భవిష్యత్తు ప్రమాదంలో పడుతుంది. పర్యావరణాన్ని కాపాడుకుంటేనే మానవాళి మనుగడ, భవిష్యత్తు ఉంటుంది. ప్రజల్లో పర్యావరణ పరిరక్షణ, వ్యర్థాల నిర్వహణపై అవగాహన కల్పించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని’ అన్నారు.
ఆచార్య కొండ లక్ష్మణ్ బాపూజీ హార్టికల్చర్ యూనివర్సిటీ వైస్ చాన్స్‌లర్ డా.డి.రాజిరెడ్డి మాట్లాడుతూ "తెలంగాణ ప్రభుత్వం విజన్ డాక్యుమెంట్-2047 సిద్ధం చేస్తున్న తరుణంలో ఇలాంటి సదస్సు నిర్వహించడం పర్యావరణానికి గొప్ప మేలు చేస్తుంది. వ్యర్థాల నుంచిసంపదను సృష్టించే పద్ధతులు కనిపెట్టి, కొత్త తరహా పరిశ్రమలు ఏర్పాటు చేసి పర్యావరణాన్ని కాపాడే బాధ్యత యువత, పరిశోధకులు, విద్యార్థులు తీసుకోవాలని’ అన్నారు.
తెలంగాణ అటవీ సంరక్షణ అధికారి డా.ప్రియాంక వర్గీస్ మాట్లాడుతూ "ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించాలి, వ్యర్థాల నిర్వహణ మన స్వంత ఇంటి నుండే ప్రారంభం కావాలి. ప్రతి ఒక్కరూ రెడ్యూస్-రీయూజ్-రీసైకిల్ అనే నినాదాన్ని పాటిస్తూ పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతిజ్ఞ తీసుకోవాలని" పిలుపునిచ్చారు.
ఈ సదస్సులో కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్, సదస్సు కార్యనిర్వాహక కార్యదర్శి డా.ఎన్.ఎస్.శ్రీనిధి, కళాశాల అధ్యాపకులు ప్రొ.మమత, డా.శ్రీధర్, డా.రీజా, డా.శాలిని, డా.చిరంజీవి, డా.ప్రియా, డా. జగదీష్, డా. నికిత, డా. అర్జున్ తదితరులు పాల్గొన్నారు.
