బీఆర్‌‌‌‌ఎస్ మళ్లా వస్తే .. ప్రజాస్వామ్యాన్ని మర్చిపోవాల్సిందే

బీఆర్‌‌‌‌ఎస్ మళ్లా వస్తే  .. ప్రజాస్వామ్యాన్ని మర్చిపోవాల్సిందే

హైదరాబాద్, వెలుగు: బీఆర్‌‌‌‌ఎస్ మళ్లీ అధికారంలోకి వస్తే రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని మర్చిపోవాల్సిందేనని పీసీసీ అధికార ప్రతినిధి అద్దంకి దయాకర్ అన్నారు. నిజాంను మించిన అరాచకాలు ఇప్పటికే జరిగాయని, మూడోసారి కేసీఆర్ అధికారంలోకి వస్తే అవి మరింత పెరుగుతాయని ఆందోళన వ్యక్తం చేశారు. హంగ్ వస్తే కింగ్ తామే అని బీఎల్ సంతోష్ అంటున్నారని, కాంగ్రెస్‌‌తో బీజేపీ ఎలాగూ కలవదు కాబట్టి వాళ్లు కలిసేది బీఆర్‌‌‌‌ఎస్‌‌తోనేనని, అందుకే హంగ్ వచ్చేలా కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. 

బుధవారం గాంధీ భవన్‌‌లో మీడియాతో ఆయన మాట్లాడారు. పార్టీ కోసం పనిచేసినోళ్లు టికెట్ ఆశించడంలో తప్పు లేదని, టికెట్లు మాత్రమే కావాలనుకున్నోళ్లే పార్టీని వీడుతారని, సిద్ధాంతాలను నమ్ముకున్నోళ్లు పార్టీలోనే ఉంటారని చెప్పారు. రెబల్స్‌‌గా నామినేషన్లు వేసినోళ్లు వాటిని ఉప సంహరించుకోవడం మంచి విషయమన్నారు. 

ఎస్సీ వర్గీకరణ మాల, మాదిగ సామాజిక వర్గాల మధ్య కొంత దూరం పెంచిన మాట వాస్తవమన్నారు. తాను బాధ్యతగా ఓ మాదిగ నేత కోసం టికెట్ వదులుకున్నానని చెప్పారు. అధికారంలోకి వస్తే అవకాశాలుంటాయని తెలిసినా కొందరు వేరే పార్టీలోకి వెళ్లిపోయారని, బీఆర్‌‌‌‌ఎస్‌‌లోకి పోయినోళ్లు గోళ్లు గిల్లుకుంటున్నారే తప్ప.. చేస్తున్నదేమీ లేదని విమర్శించారు.