సంగారెడ్డి జిల్లాలో వేర్వేరు ఘటనల్లో ఐదుగురు మృతి

సంగారెడ్డి జిల్లాలో వేర్వేరు ఘటనల్లో ఐదుగురు మృతి

సంగారెడ్డి, వెలుగు: వేర్వేరు ఘటనల్లో ఐదుగురు మృతి చెందారు. రోడ్డుపై అడ్డొచ్చిన కుక్కను తప్పించబోయి బైక్ పై నుంచి పడి యువకుడు చనిపోయాడు. ఈ ఘటన సంగారెడ్డి జిల్లా కంది మండలం ఇంద్రకరణ్ పీఎస్​పరిధిలో జరిగింది. ఎస్ఐ విజయ్ కుమార్ కథనం ప్రకారం..  మండలంలోని జుల్కల్ గ్రామానికి చెందిన పట్నం ప్రవీణ్ (28) మంగళవారం సాయంత్రం ఎద్దుమైలారం గ్రామం మీదుగా బంధువు పట్నం మల్లేశ్ తో కలిసి బైక్​పై జుల్కల్ నుంచి శంకర్ పల్లి వైపు వెళ్తున్నాడు. 

అకస్మాత్తుగా రోడ్డుపై కుక్క అడ్డు రావడంతో తప్పించబోయి చెట్టును ఢీ కొట్టాడు. ప్రమాదంలో ప్రవీణ్‌ తల, ముఖానికి గాయాలు తగిలి అక్కడికక్కడే మృతి చెందాడు. వాహనం వెనుక కూర్చున్న మల్లేశ్ తలకు గాయాలు కావడంతో శంకరపల్లిలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మృతుడి బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

బస్సు ఢీకొని వృద్ధుడు..

హుస్నాబాద్: బస్సు ఢీ కొని వృద్ధుడు మృతి చెందిన ఘటన మంగళవారం సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలం పందిళ్ల గ్రామ శివారులో జరిగింది. ఎస్ఐ లక్ష్మారెడ్డి కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన అనుమల్ల రాజిరెడ్డి (70) బైక్​పై వెళ్తుండగా సిద్దిపేట నుంచి హన్మకొండ వైపు వెళ్తున్న ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో రాజిరెడ్డి తలకు తీవ్ర గాయాలై భారీగా రక్తస్రావం జరిగింది. గమనించిన స్థానికులు అతడిని హుస్నాబాద్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. 

అక్కడ ప్రథమ చికిత్స అనంతరం పరిస్థితి విషమంగా ఉండడంతో వైద్యుల సూచన మేరకు కరీంనగర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ రాజిరెడ్డి చనిపోయాడు. మృతుడి కుమారుడు రవీందర్ రెడ్డి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. 

మహిళను హత్య చేసిన గుర్తు తెలియని వ్యక్తులు

కొండపాక: మండలంలోని తిమ్మారెడ్డిపల్లి గ్రామానికి చెందిన  ఏలూరి రాములమ్మ(60) ను సార్లవాడ కాసే గుడిసెల వద్ద గుర్తు తెలియని వ్యక్తులు మంగళవారం సాయంత్రం హత్య  చేసినట్లు కుకునూరుపల్లి పోలీసులు గుర్తించారు. వివరాల కోసం ఎస్ఐ  శ్రీనివాస్ ను సంప్రదించగా పూర్తి వివరాల కోసం విచారణ చేపట్టినట్లు తెలిపారు.

 ఆర్థిక సమస్యలతో సూసైడ్ 

మనోహరాబాద్: ఆర్థిక సమస్యలతో వ్యక్తి సూసైడ్ చేసుకున్న ఘటన మండలంలోని కుచారం గ్రామంలో జరిగింది. ఎస్ఐ సుభాష్ కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన పట్నం శ్రీశైలం (45)  ఆర్థిక సమస్యలతో బాధపడుతున్నాడు. మంగళవారం ఉదయం పొలం వద్దకు వెళ్లి వస్తానని చెప్పి పొలం వద్ద మామిడి చెట్టుకు ఉరి వేసుకుని చనిపోయాడు. ఈ విషయంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం తూప్రాన్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. 

 జీవితంపై విరక్తి చెంది యువకుడు..

నిజాంపేట: ఆర్థిక ఇబ్బందులతో జీవితం పై విరక్తి చెంది ఓ యువకుడు సూసైడ్ చేసుకున్న సంఘటన మండల పరిధిలోని బచ్చురాజ్ పల్లిలో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం..  గ్రామానికి చెందిన వడ్ల నవీన్ (22) తన తండ్రి మరణించినప్పటి నుంచి కూలీ పని చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. అవసరాల కోసం చిట్టి వేసి డబ్బులు వాడుకున్నాడు.

 ఇటీవల కూలీ దొరకపోవడంతో చిట్టీ డబ్బు కట్టలేక సోమవారం గడ్డి మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కుటుంబ సభ్యులు కామారెడ్డి గవర్నమెంట్ హాస్పిటల్ కు.. అక్కడి నుంచి నిజామాబాద్ గవర్నమెంట్ హాస్పిటల్ కు తరలించారు. అక్కడ  చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందాడు. మృతుడి తల్లి రత్నవ్వ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ రాజేశ్  తెలిపారు.

 తీసుకున్న అప్పు ఇవ్వమన్నందుకు దాడి

నర్సాపూర్ : తీసుకున్న లక్ష రూపాయల అప్పు మిత్తితో కలిపి ఇవ్వమన్నందుకు పది మందితో కలిసి దాడి చేసి గాయపరిచి, షాప్​ ధ్వంసం చేసిన సంఘటన మంగళవారం  నర్సాపూర్ పట్టణంలో జరిగింది.  బాధితుడి కథనం ప్రకారం.. స్థానిక గోల్డ్ స్మిత్ భవన్  వద్ద అక్బర్  ఏడాది కిందట లక్ష రూపాయల అప్పు తీసుకున్నాడు. తీసుకున్న అప్పు డబ్బులు, మిత్తితో సహా చెల్లించాలని భవన్​అడిగాడు.

 డబ్బులు ఇవ్వకపోగా అక్బర్ పది మందితో కలిసి వచ్చి దాడి చేయడంతో భవన్​ తలకు గాయమైంది. షాపులో వస్తువులు ధ్వంసం అయ్యాయి. ఈ దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డు అయ్యాయి. ఈ  మేరకు బాధితుడు పోలీస్ స్టేషన్ లో  ఫిర్యాదు చేశాడు.