సిద్దిపేట రూరల్, వెలుగు: పదో తరగతి ఫలితాల్లో వందశాతం ఉత్తీర్ణత సాధించాలని కలెక్టర్హైమావతి సూచించారు. మంగళవారం ఆమె కలెక్టరేట్ లో ప్రభుత్వ స్కూళ్లు, కేజీబీవీలు, గురుకులాల హెచ్ఎంలు, ప్రిన్సిపాళ్లతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. గత మూడేళ్లుగా పదో తరగతి ఫలితాల్లో జిల్లా ఉన్నత స్థానాలను సాధిస్తూ ఆదర్శంగా నిలిచిందని ఈసారి కూడా వందశాతం ఉత్తీర్ణత సాధించేలా కార్యాచరణ రూపొందించి విద్యార్థులను చదివించాలన్నారు.
ప్రతీ స్కూల్లో ఉదయం 8 నుంచి 9 గంటల వరకు సాయంత్రం 4:30 నుంచి 5:30 వరకు పదో తరగతి విద్యార్థులకు ప్రత్యేక స్టడీ అవర్స్ నిర్వహించాలన్నారు. అనంతరం రాష్ట్రస్థాయి చెకుముకి పోటీల్లో బహుమతులను సాధించిన విద్యార్థులకు సర్టిఫికెట్లను అందించారు. అనంతరం ఓటర్ జాబితాలో అభ్యంతరాలను తెలపాలని రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు.
జిల్లాలోని హుస్నాబాద్, దుబ్బాక, చేర్యాల, ప్రజ్ఞాపూర్- గజ్వేల్ మున్సిపాలిటీల్లో త్వరలో ఎన్నికలు నిర్వహించనున్న నేపథ్యంలో ఆయా మున్సిపల్ వార్డుల్లో ఓటర్ జాబితాను రూపొందించాలన్నారు. కార్యక్రమంలో జిల్లా రవాణా అధికారి లక్ష్మణ్, డీఈవో శ్రీనివాసరెడ్డి, జిల్లా ఇంటర్మీడియట్ అధికారి పాల్గొన్నారు.
