జహీరాబాద్, వెలుగు: ఎస్సీ, ఎస్టీలపై దాడులను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య హెచ్చరించారు. ఎస్సీ, ఎస్టీలపై జరుగుతున్న దాడుల విషయంలో నిర్లక్ష్యం వహించే అధికారులపై తప్పనిసరిగా చర్యలు ఉంటాయన్నారు. మంగళవారం కోహిర్ మండలం సజ్జాపూర్ గ్రామంలో ఇల్లు కూల్చివేతకు గురైన దళిత బాధితుడు బేగరి రాములు కుటుంబాన్ని కమిషన్ సభ్యుడు రాంబాబునాయక్ తో కలిసి రూ.25 వేల పరిహార చెక్కు అందచేశారు.
కూల్చివేసిన స్థలంలోనే ఇంటి నిర్మాణానికి భూమి పూజ చేశారు. అనంతరం మాట్లాడుతూ..ఎస్సీ, ఎస్టీలపై దాడుల విషయంలో పోలీస్ శాఖ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఈ విషయంపై తాను ఐజీ, డీఐజీని కలిసి ఫిర్యాదు చేస్తానని హెచ్చరించారు. కోహిర్ ఎస్ఐ బాధితులకు అండగా నిలవకుండా దాడి చేసిన వారివైపు నిలవడం సరికాదని మండిపడ్డారు. బాధితుడికి న్యాయం జరిగే వరకు ఎస్సీ, ఎస్టీ కమిషన్ అండగా నిలుస్తుందన్నారు.
అనంతరం జహీరాబాద్ పట్టణ పరిధిలోని రంజోల్ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ బాలికల జూనియర్ కాలేజీని తనిఖీ చేశారు. విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే మాణిక్ రావు, ఆర్డీవో దేవుజా, సాంఘిక సంక్షేమ శాఖ డీడీ అఖిలేశ్ రెడ్డి, వివిధ శాఖల అధికారులు, ఎస్సీ, ఎస్టీ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.
