పార్టీ గౌరవం తగ్గేలా మాట్లాడటం కరెక్టు కాదు

పార్టీ గౌరవం తగ్గేలా మాట్లాడటం కరెక్టు కాదు
  • కాంగ్రెస్​లో ఆగని లొల్లి
  • మాణిక్కం, రేవంత్​పై  నేతల విమర్శలు 
  • సోనియా అపాయింట్ మెంట్ కోరిన వెంకట్ రెడ్డి, శశిధర్ రెడ్డి 

హైదరాబాద్, వెలుగు: కాంగ్రెస్​లో వర్గ విభేదాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. పార్టీ స్టేట్ ఇన్​చార్జి మాణిక్కం ఠాగూర్, పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై నేతల విమర్శలు కొనసాగుతున్నాయి. వీరిద్దరి తీరుపై అసంతృప్తితో ఉన్న ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, సీనియర్ నేత మర్రి శశిధర్ రెడ్డి.. కాంగ్రెస్ చీఫ్ సోనియా గాంధీ అపాయింట్​మెంట్ కోరారు. రాష్ట్రంలో పార్టీ పరిస్థితి, ప్రస్తుత పరిణామాలు, తమకు జరుగుతున్న అన్యాయంపై వీరు ఆమె దృష్టికి తీసుకెళ్లనున్నట్లు తెలిసింది. కాగా, ఠాగూర్ కు జడ్చర్ల ఇన్​చార్జి, కోమటిరెడ్డి అనుచరుడు అనిరుధ్ రెడ్డి లేఖ రాశారు. మాజీ ఎమ్మెల్యే ఎర్ర శేఖర్ ను రేవంత్ పార్టీలో చేర్చుకోవడంపై అసంతృప్తితో ఉన్న ఆయన.. ఎర్ర శేఖర్​పై విమర్శలు చేశారు. తనను ఎర్ర శేఖర్ ఇబ్బందులకు గురి చేస్తున్నారని, 9 మర్డర్ కేసుల్లో నిందితుడిగా ఉన్న వ్యక్తితో స్టేజ్ పంచుకోలేనంటూ పేర్కొన్నారు. శేఖర్ తన సొంత తమ్ముడినే హత్య చేశారనే ఆరోపణలు ఉన్నాయన్నారు. 

ఏఐసీసీకి లేఖ రాయలే: మహేశ్వర్ రెడ్డి 

ఠాగూర్ ఆదేశాలతో గురువారం ఏఐసీసీ కార్యక్రమాల అమలు కమిటీ చైర్మన్​ మహేశ్వర్ రెడ్డితో ఏఐసీసీ సెక్రటరీ బోసురాజు చర్చలు జరిపారు. తర్వాత గాంధీ భవన్​లో మహేశ్వర్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. తాను కాంగ్రెస్​లోనే ఉంటానని ఆయన మరోసారి స్పష్టం చేశారు. ఏఐసీసీకి లేఖ రాయలేదని చెప్పారు. “ఆజాదీ కా గౌరవ్ పాదయాత్ర” కార్యక్రమ రిపోర్టు పంపడంలో ఆలస్యమైందని తెలిపారు. మునుగోడులో 175 గ్రామాల్లో పర్యటించే లీడర్ల లిస్టు సిద్ధమైందన్నారు. మర్రి శశిధర్ రెడ్డితో ఫోన్​లో మాట్లాడానని జాతీయ కిసాన్ కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్ కోదండరెడ్డి చెప్పారు. పార్టీ మారొద్దని దాసోజు శ్రవణ్ ఇంటికి వెళ్లి చెప్పానన్నారు. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డితోనూ మాట్లాడానన్నారు. పార్టీలోని సమస్యలన్నీ త్వరలోనే సర్దుకుంటాయని తెలిపారు. 

శశిధర్ రెడ్డిపై అద్దంకి ఫైర్ 

మాణిక్కం, రేవంత్​లపై కామెంట్లు చేయడంతో మర్రి శశిధర్ రెడ్డిపై అద్దంకి దయాకర్ ఫైర్ అయ్యారు. పార్టీ గౌరవం తగ్గేలా మాట్లాడటం కరెక్టు కాదన్నారు. బీజేపీ, ఆర్ఎస్ఎస్ చేస్తున్న కుట్రలో కాంగ్రెస్ నేతలు పావులుగా మారుతున్నట్టు అనుమానం కలుగుతోందన్నారు. ‘‘శశిధర్ రెడ్డి లాంటి నేతలు మాట్లాడితే కాదనే వారు ఎవరూ లేరు. స్టేట్ ఇన్ చార్జ్, పీసీసీ చీఫ్​పై విమర్శలు చేయడంతో పార్టీకి నష్టం కలుగుతుంది” అని అన్నారు.