రూ.10 అదనంగా వసూలు.. మెట్రోకు రూ.10వేల ఫైన్

రూ.10 అదనంగా వసూలు..  మెట్రోకు రూ.10వేల ఫైన్
  • ఖమ్మం జిల్లా వినియోగదారుల కమిషన్​ ఆదేశాలు
  • మెట్రో రైలు సంస్థపై వినియోగదారుడి విజయం ​

ఖమ్మం, వెలుగు : మెట్రో రైల్వే స్టేషన్‌‌‌‌లో రూ.10 అదనంగా వసూలు చేశారనే ఫిర్యాదుతో  మెట్రో సంస్థకు ఖమ్మం జిల్లా వినియోగదారుల కమిషన్​ రూ.10 వేల జరిమానా విధించింది.  మెట్రో రైల్వే స్టేషన్‌‌‌‌లో ఒక వైపు నుంచి ఇంకొక వైపు వెళ్లినప్పుడు అదనంగా వసూలు చేసిన  రూ.10 తిరిగి ప్రయాణికుడికి చెల్లించాలని ఆదేశించింది.  జిల్లా వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్  చైర్మన్ వి. లలిత, సభ్యురాలు ఎ.మాధవీలత మంగళవారం తీర్పునివ్వగా, బుధవారం తీర్పు కాపీ బయటకు వచ్చింది.  కేసు వివరాలు ఇలా ఉన్నాయి.  ఖమ్మం జిల్లాకు  చెందిన లాయర్ వెల్లంపల్లి నరేంద్ర  స్వరూప్  ఎల్​బీనగర్ మెట్రో రైల్వే స్టేషన్‌‌‌‌లో 2019 జనవరి 18న ప్రయాణించారు. 

మెట్రో రైలు ఎక్కే తూర్పు వైపు దారిలో టాయిలెట్లు లేకపోవడంతో, పడమర వైపు ఉన్న వేరే దారిలో వెళ్లారు.  దీనికోసం మెట్రో రైల్వే సంస్థ జారీ చేసిన ట్రావెల్ కార్డను  ఆయన స్వైప్ చేశారు. అయితే, రూ.10 ట్రావెల్ కార్డ్ నుంచి కట్ కాగా.. దీనిపై ఆయన వినియోగదారుల కమిషన్​లో ఫిర్యాదు చేశారు. రెండువైపులా టాయిలెట్లు ఏర్పాటు చేయకపోవడం వల్లే ఇది జరిగిందని, మెట్రో సంస్థ నిర్లక్ష్యం ఉందని ఫిర్యాదులో పేర్కొన్నారు.   ప్రయాణికుల సౌకర్యార్థం డిస్​ప్లే బోర్డులు పెట్టాలని ఖమ్మం జిల్లా వినియోగదారులవివాదాల పరిష్కార కమిషన్  చైర్మన్ లలిత, సభ్యురాలు ఎ.మాధవీలత ఆదేశించారు. ప్రయాణికునికి జరిగిన అసౌకర్యానికి రూ. 5 వేలు, కోర్టు ఖర్చులు మరో రూ.5 వేలు 45 రోజుల్లో చెల్లించాలని కమిషన్ తీర్పునిచ్చారు.