ఉద్యోగులపే స్కేల్ కోసం కృషి చేస్తా : ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య

ఉద్యోగులపే స్కేల్ కోసం కృషి చేస్తా : ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య

యాదగిరిగుట్ట, వెలుగు : మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం(ఎన్ఆర్ఈజీఎస్) కాంట్రాక్ట్ ఉద్యోగులైన టెక్నికల్ అసిస్టెంట్లు, ఫీల్డ్ అసిస్టెంట్లకు పే స్కేల్ కోసం కృషి చేస్తానని ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య హామీ ఇచ్చారు. ఆదివారం యాదగిరిగుట్టలోని లక్ష్మీనరసింహస్వామి ఫంక్షన్ హాల్ లో 'మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం టెక్నికల్ అసిస్టెంట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనంలో ఆయన పాల్గొని మాట్లాడారు. 

పేదలకు మూడు పూటలా బువ్వ పెడుతున్న ఉపాధి హామీ పథకాన్ని నీరుగార్చడానికి కేంద్ర ప్రభుత్వం కుట్ర చేస్తోందని ఆరోపించారు. ఉపాధి హామీ పథకం బడ్జెట్ ను తగ్గించడమే కాకుండా పని దినాలను సైతం తగ్గించి పేదల నోటికాడి ముద్దను లాక్కోవాలని చూస్తోందని విమర్శించారు. అనంతరం ఎన్ఆర్ఈజీఎస్ కాంట్రాక్ట్ ఉద్యోగులు పట్టణంలోని వైకుంఠ ద్వారం వరకు ర్యాలీగా వెళ్లి.. తమ సమస్యలకు పరిష్కారం చూపాలని ప్రార్థిస్తూ నారసింహుడి పాదాలకు వినతిపత్రం సమర్పించి ప్రత్యేక పూజలు చేశారు.

అనంతరం మార్నింగ్ వాక్ లో భాగంగా ఆదివారం ఉదయం ఎమ్మెల్యే ఐలయ్య రాజపేట మండల కేంద్రంలో పర్యటించారు. కాలనీల్లో ప్రజలను ఆప్యాయంగా పలకరించి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. గ్రామ పంచాయతీ కార్మికులతో కలిసి చీపురు పట్టి రోడ్లు ఊడ్చి.. డ్రైనేజీ క్లీన్ చేశారు. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులను పరిశీలించారు.  కార్యక్రమంలో ఎన్ఆర్ఈజీఎస్ టెక్నికల్ అసిస్టెంట్ అసోసియేషన్ గౌరవ అధ్యక్షుడు గౌరవ అధ్యక్షుడు ఉపేందర్ రెడ్డి, జిల్లా అధ్యక్షుడు వెంకట్ రెడ్డి, యాదగిరిగుట్ట అధ్యక్షుడు రమేశ్, నాగరాజు, కోశాధికారి రాంచంద్రయ్యచారి, కాంట్రాక్ట్ ఉద్యోగులు చంద్రశేఖర్, కృష్ణ, అశోక్, వెంకట్ తదితరులు  పాల్గొన్నారు.