
నిద్రపోయేటప్పుడు గొంతు భాగంలో ఉన్న కండరాలు ఎక్కువగా రిలాక్స్ అవుతాయి. దాంతో నాలుక లేదా టాన్సిల్స్ లాంటి మృదు కణ జాలాలు (సాఫ్ట్ టిష్యూ) ఉండే భాగాలు గాలి వెళ్లే ద్వారాన్ని అడ్డుకుంటాయి. దీన్నే అబ్స్ట్రక్టివ్ స్లీప్ ఆప్నియా అంటాం. ఈ బ్లాకేజీ కండిషన్ కొన్ని సెకండ్ల నుంచి ఒక నిమిషం పాటు ఉంటుంది. ఆ టైంలో మెదడుకు ఆక్సిజన్ తక్కువై, ఊపిరి పీల్చుకోవడంలో ఇబ్బంది తలెత్తుతుంది. ఇది కొన్ని క్షణాలపాటు ఉండడం వల్ల ఎవరూ ఆ పరిస్థితిని గుర్తుపెట్టుకోలేరు. దీంతో గాఢనిద్రలోకి వెళ్లకుండా మాటిమాటికీ మెలకువ వస్తూ ఉంటుంది. తద్వారా శరీరానికి సరిపడా నిద్ర ఉండదు. ఊపిరి తీసుకోవడంలో కలిగే ఈ ఇబ్బందులు లేదా ఆప్నియాలు ఒక్కరాత్రిలోనే పది నుంచి వందలసార్లు కూడా వస్తాయి.
నిద్రపోయేటప్పుడు చాలామందికి గురక వస్తుంటుంది. దాంతో పక్కనవాళ్లు ఇబ్బంది పడడం సహజం. కానీ, గురకపెట్టేవాళ్లు ఎంత ఇబ్బంది పడతారో తెలుసా? గురక వల్ల ఎంతసేపు నిద్రపోయినా వాళ్లకు విశ్రాంతి తీసుకున్నట్టు అనిపించదు. కానీ, ఈ సమస్యను చాలామంది గుర్తించరు. తమంతట తాముగా గుర్తించలేరు కూడా. ఆ కండిషన్నే అబ్స్ట్రక్టివ్ స్లీప్ ఆప్నియా (ఒఎస్ఎ) అంటారు.
ఇది సైలెంట్‌గా నిద్రను డిస్టర్బ్ చేస్తుంది. తద్వారా దీర్ఘకాలిక అలసటకు దారితీస్తుంది. అంతేకాదు.. మరెన్నో హెల్త్ ప్రాబ్లమ్స్ రావడానికి అవకాశం ఉందని ముందుగా తెలియజేసే అలారమ్ లాంటిది. దీనివల్ల ‘బయటకు కనిపించని ఇబ్బందులు చాలా ఉంటాయి. కానీ మన శరీరం ఇచ్చే సంకేతాలను బట్టి ఆరోగ్యాన్ని కాపాడుకోగలిగితే లైఫ్ మారిపోతుంది’ అంటున్నారు డాక్టర్లు.