యువత మత్తుపదార్థాలకు దూరంగా ఉండాలి : అడిషనల్ కలెక్టర్ చంద్రశేఖర్

యువత మత్తుపదార్థాలకు దూరంగా ఉండాలి : అడిషనల్ కలెక్టర్  చంద్రశేఖర్

సంగారెడ్డి టౌన్, వెలుగు: యువత మత్తుపదార్థాలకు దూరంగా ఉండాలని అడిషనల్​కలెక్టర్ చంద్రశేఖర్ సూచించారు. శనివారం ఎమ్మెన్నార్ మెడికల్​కాలేజీలో నిర్వహించిన నషా ముక్త్ భారత్ అభియాన్ ప్రతిజ్ఞ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. విద్యాసంస్థల్లో యాంటి డ్రగ్ కమిటీలను ఏర్పాటు చేసి, అనుమానాస్పద కార్యకలాపాలపై జిల్లా యంత్రాంగానికి తెలియజేయాలని విద్యార్థులకు పిలుపునిచ్చారు. సంగారెడ్డిని డ్రగ్స్​రహిత జిల్లాగా మార్చాలన్నారు.

 నషా ముక్త్ భారత్ అభియాన్ ఐదేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా మహిళా, శిశు, దివ్యాంగుల, వయోవృద్ధుల శాఖ ఆధ్వర్యంలో మాదకద్రవ్యాల దుర్వినియోగం, అక్రమ రవాణాపై అవగాహన కార్యక్రమం నిర్వహించినట్లు జిల్లా సంక్షేమాధికారి లలితా కుమారి తెలిపారు. యువత మాదకద్రవ్యాలకు దూరంగా ఉండేందుకు  మిషన్ పరివర్తన కార్యక్రమం ద్వారా పలు అవగాహన కార్యక్రమాలు కొనసాగుతున్నాయని చెప్పారు. అనంతరం నషా ముక్త్ భారత్  పోస్టర్​ఆవిష్కరించారు. విద్యార్థులతో ప్రతిజ్ఞ నిర్వహించారు. కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ రఘునందన్ రావు, జిల్లా యువజన క్రీడల అధికారి ఖాసింబేగ్, అధ్యాపకులు పాల్గొన్నారు.