గన్నీ బ్యాగుల స్టాక్ ను పటిష్టంగా భద్రపర్చాలి : ఖమ్మం అడిషనల్ కలెక్టర్ శ్రీనివాసరెడ్డి

గన్నీ బ్యాగుల స్టాక్ ను పటిష్టంగా భద్రపర్చాలి : ఖమ్మం అడిషనల్ కలెక్టర్ శ్రీనివాసరెడ్డి

ఖమ్మం టౌన్, వెలుగు : జిల్లాలో ఉన్న గన్నీ బ్యాగుల స్టాక్ ను పటిష్టంగా భద్రపర్చాలని అడిషనల్​ కలెక్టర్ పి. శ్రీనివాస రెడ్డి సూచించారు.  శనివారం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్​లో గన్నీ బ్యాగుల స్టాక్ పై గోడౌన్ మేనేజర్ లతో సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ బంగ్లాదేశ్ నుంచి జూట్ సరఫరాకు ఆటంకాలు ఏర్పడ్డాయని, రాబోయే రబీ సీజన్ ధాన్యం కొనుగోలుకు గన్నీ బ్యాగుల ఇబ్బందులు రాకుండా రేషన్ షాపులు, గోడౌన్ నుంచి అందుబాటు లో ఉన్న స్టాక్ భద్రపర్చుకోవాలని సూచించారు. సమావేశంలో జిల్లా పౌర సరఫరాల సంస్థ మేనేజర్ శ్రీలత, గోడౌన్ మేనేజర్లు, రవాణా కాంట్రాక్టర్లు, అధికారులు, తదితరులు పాల్గొన్నారు. 

ప్రశాంతంగా రంజాన్ మాసం నిర్వహణకు ఏర్పాట్లు

ప్రశాంతంగా రంజాన్ మాసం నిర్వహణకు  ఏర్పాట్లు చేయాలని అడిషనల్ కలెక్టర్ శ్రీనివాస రెడ్డి సూచించారు.  కలెక్టరేట్ లో రంజాన్ మాసం ఏర్పాట్లపై సంబంధిత అధికారులతో, ముస్లిం ప్రతినిధులతో ఆయన సమీక్షించారు. ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్, జిల్లాలోని  గ్రామీణ ప్రాంతాలు, మున్సిపాలిటీల్లో సైతం అవసరమైన ఏర్పాట్ల కోసం అధికారులకు సూచనలు జారీ చేశామన్నారు. 

ఆడపిల్లల విద్యను ప్రోత్సహించాలి

ఆడపిల్లల విద్యను ప్రతి ఒక్కరూ ప్రోత్సహించాలని అడిషనల్​ కలెక్టర్  శ్రీనివాస రెడ్డి సూచించారు. కలెక్టరేట్ లో శనివారం ముస్లిం మైనార్టీ ప్రతినిధులతో కలిసి మైనారిటీ రెసిడెన్షియల్ విద్యా సంస్థల వాల్​ పోస్టర్లను ఆవిష్కరించారు. జిల్లాలో 7 మైనారిటీ రెసిడెన్షియల్ విద్యాసంస్థలు నడుస్తున్నాయని, వీటిలో 6 నుంచి 12వ తరగతి వరకు నాణ్యమైన విద్య మైనారిటీలకు అందుతోందని ఆయన తెలిపారు. ఖమ్మంలోని మైనారిటీ రెసిడెన్షియల్ విద్యా సంస్థలలో చదివిన 38 మంది విద్యార్థులకు ఐఐటీ సీట్లు, 39 మంది ఎంబీబీఎస్, 11 మంది సీఏ, 14 మంది లా సెట్ క్రాక్ చేశారని వివరించారు.