కామారెడ్డి , వెలుగు : ప్రగతి పథంలో కామారెడ్డి జిల్లా ముందుకు సాగుతోందని అడిషనల్ కలెక్టర్ విక్టర్ అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌తోపాటు ఇందిరాగాంధీ స్టేడియంలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి పోలీసు గౌరవ వందనాన్ని స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వానకాలం సీజన్‌లో రూ.1,092 కోట్ల విలువైన 4 లక్షల 57 వేల మెట్రిక్ టన్నుల వడ్లను కొనుగోలు చేశామని తెలిపారు. సన్నవడ్లకు రూ.100 కోట్ల బోనస్ చెల్లించామని పేర్కొన్నారు. జిల్లాలో 2 లక్షల 93 వేల రేషన్ కార్డుల ద్వారా ప్రతి నెల 6,322 మెట్రిక్ టన్నుల బియ్యం పంపిణీ చేస్తున్నామన్నారు.
ఇప్పటివరకు 6 కోట్ల 42 లక్షల మంది మహిళలు ఆర్టీసీ బస్సుల్లో జీరో టికెట్ ద్వారా ప్రయాణించారని చెప్పారు. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలు కొనసాగుతున్నాయన్నారు. పర్యాటకాభివృద్ధి కోసం పోచారం రిజర్వాయర్, లింగంపేట మండలంలోని నాగన్న మెట్ల బావి, నిజాంసాగర్ ప్రాజెక్టు పరిసరాల్లో అభివృద్ధి పనులు చేపట్టనున్నట్లు తెలిపారు.
రోడ్డు ప్రమాదాల నివారణకు పోలీసు శాఖ ద్వారా ‘ఆరైవ్ అలైవ్’ కార్యక్రమం అమలు చేస్తున్నామని, అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు జిల్లాలో నిరంతరంగా కొనసాగుతున్నాయని ఆయన వెల్లడించారు. జిల్లా పోలీస్ఆఫీస్లో ఎస్పీ రాజేశ్చంద్ర, కోర్టు ప్రాంగణంలో జిల్లా జడ్జి, ఆయా చోట్ల అధికారులు, ప్రజాప్రతినిధులు, నాయకులు జాతీయ జెండాను ఎగుర వేశారు. వేడుకల్లో అడిషనల్ కలెక్టర్ మదన్మోహన్, లైబ్రరీ జిల్లా చైర్మన్ మద్ది చంద్రకాంత్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
